Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంత్యక్రియలకూ ఎదురుచూపులే...

ఈనాడు - అమరావతి డిజిటల్‌

రోనాతో పరిస్థితులు మారిపోయాయి. అంత్యక్రియలకూ ఎదురుచూపులు తప్పడం లేదు. కొవిడ్‌ మృతులకు అయితే అంతిమ సంస్కారాలు చేయడం వారి బంధువులకు ఇబ్బందికరంగా మారుతోంది. చాంతాడంత వరుసతో బెంబేలెత్తుతున్నారు. శ్మశానంలో గంటలకొద్దీ వేచి ఉండడం నరకాన్ని తలపిస్తోంది. దీనికి తోడు ఎక్కడ తమకూ కరోనా సోకుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.
విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 18 ప్రాంతాల్లో మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ మృతదేహాలను కృష్ణలంకలోని స్వర్గపురికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ గ్యాస్‌, విద్యుత్తు ఫర్నేస్‌లపై మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కొన్నింటిని మాత్రం గుణదలలోని శ్మశానవాటికకు తీసుకెళ్తున్నారు. అక్కడ కట్టెలపై కాలుస్తారు. కృష్ణలంకలో మొత్తం శవాలను దహనం చేసేందుకు నాలుగు ఫర్నేస్‌లు ఉన్నాయి. ఒక్కో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అనంతరం పరిసరాలను శుభ్రం చేసేందుకు 20 నిమిషాల సమయం పడుతుంది. కరోనా కారణంగా రోజుకు 15 నుంచి 20 మృతదేహాలు వస్తున్నాయి. విద్యుత్తు వాటిపై దహనం చేసే ప్రక్రియ బాగా ఆలస్యమవుతోంది. కనీసం గంట పడుతోంది. గ్యాస్‌తో పని చేసే రెండు ఫర్నేస్‌లలో ఒకటి పాడైంది. దీంతో బుధవారం ఉదయం నుంచి మిగిలిన ఒక్క గ్యాస్‌ ఫర్నేస్‌నే వినియోగిస్తున్నారు.

గంటలకొద్దీ ఆలస్యం
విజయవాడ కొత్త జీజీహెచ్‌ రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న వారిని చికిత్స కోసం తీసుకొస్తుంటారు. మరణాలు ఇక్కడే అధికంగా సంభవిస్తుంటాయి. మంగళవారం ఒక్క రోజే 50 మృతదేహాలు మార్చురీకి చేరాయి. ఇందులో 30 మృతదేహాలను సాయంత్రానికి బంధువులకు అప్పగించారు. ఇలా ఒకేసారి అన్నీ రావడంతో శవాలను అప్పగించేందుకు సమయం ఎక్కువ పడుతోంది. ఒకవైపు మార్చురీలో మృతదేహాల అప్పగింతకు, మరోవైపు స్వర్గపురిలో దహన సంస్కారాలకు గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. ఫలితంగా మృతుల బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. అంత్యక్రియలు త్వరగా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
భవానీపురానికి చెందిన ఓ మహిళ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని మధ్యాహ్నం 2గంటలకు కృష్ణలంకలోని స్వర్గపురికి తీసుకొచ్చారు. సాయంత్రం 5గంటలైనా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
నగరానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మార్చురీలో ఉంచి మృతదేహాన్ని బుధవారం ఉదయం ఇచ్చారు. బంధువులు కృష్ణలంకలోని స్వర్గపురికి తీసుకొచ్చారు. సాయంత్రం 5గంటల వరకు నిరీక్షించినా అంత్యక్రియలు చేయలేదని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని