Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గందరగోళం.. అయోమయం

పరీక్షల ఫలితాలు తెలుసుకునేదెలా..?

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, సబ్‌కలెక్టరేట్‌

ట్రేసింగ్‌.. టెస్టింగ్‌.. ట్రీట్‌మెంట్‌.. (జాడ, పరీక్ష, చికిత్స) కరోనా నియంత్రణకు అధికార యంత్రాంగం చెబుతున్న సూత్రమిది. ఓ వ్యక్తికి పాజిటివ్‌గా పరీక్షలో తేలితే వెంటనే ఆయన ఇంటి ముందు ప్రభుత్వ అంబులెన్సు ఉండేది. రోగిని చికిత్సకు వెంటనే తరలించేవారు. కొంతమందిని బలవంతంగా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇది మొదటి వేవ్‌ కరోనా స్థితి.
గన్నవరానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజులైనా ఫలితం రాలేదు. అధికారుల వెంటబడితే మూడు రోజులకు పాజిటివ్‌ ఉందని తేల్చి చెప్పారు. అప్పటికే ఆయనకు జ్వరం తీవ్రంగా ఉంది. నీరసం ఆవహించింది. దీంతో కొవిడ్‌ ఆస్పత్రిలో చేరేందుకు విజయవాడ జీజీహెచ్‌కు వెళ్లారు. ఎన్ని గంటలు వేచి చూసినా పట్టించుకునేవారే లేరు. పడకలు లేవని చెప్పారు. తెలిసిన నాయకులకు మొర వినిపించుకుంటే దాదాపు 10 గంటల తర్వాత చేర్చుకున్నారు. ఇదీ ప్రస్తుత పరిస్థితి.
కరోనా రెండో దశలో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఒక్క నెలలోనే 38 మంది జిల్లాలో మృత్యువాత పడ్డారు. వేల మంది ఇళ్లలో చికిత్స తీసుకుంటున్నారు. వందల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరారు. రోజురోజుకు కొత్త కేసులు భారీగా వస్తున్నాయి. దీంతో అసలు కరోనా పరీక్షల నిర్వహణ, ఆసుత్రుల్లో ప్రవేశం చికిత్సలు అందా గందరగోళంగా ఉన్నాయి. సామాన్యులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు ప్రత్యేకంగా సమన్వయకర్త, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ను నియమించినా ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోగులు పడిగాపులు పడుతున్నారు. చికిత్స కోసమే కాదు.. ప్రభుత్వ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లోనూ అదే పరిస్థితి ఉంది. ఎవరితో సిఫార్సు చేసినా తాము చేర్చుకోమని గూడవల్లి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వైద్యులు చెబుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లాలో కంటెయిన్‌మెంట్‌ జోన్లు, ప్రాంతాలు లేకుండా పోయాయి. అంతా కలగాపులగం అయింది.

నేరుగా వెళ్లవద్దు: ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తున్న జేసీ శివశంకర్‌ మాట్లాడుతూ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నవారు నేరుగా వెళుతున్నారని, అలా వెళ్లవద్దని సూచించారు. ప్రభుత్వ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్న వారి ఫలితాలు 7 గంటల నుంచి 24 గంటల మధ్య వస్తాయని, వాటిని వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. దీనికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. పాజిటివ్‌ వచ్చిన వారు 104కు ఫోన్‌ చేస్తే తగిన సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోనూ కొవిడ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని, అక్కడ నుంచి కూడా సహాయం పొందవచ్చని చెప్పారు.

సీటీ స్కాన్‌లో లక్షణాలు కనిపిస్తే...

సీటీ స్కాన్‌లో కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వాళ్లు రిపోర్టులు, ఆధార్‌ కార్డులతో నగరంలోని ఎన్టీఆర్‌ డెంటల్‌ యూనివర్శిటీ ప్రాంగణంలోని ట్రైైఏజ్‌ సెంటర్‌లో సంప్రదించాలని జేసీ సూచించారు. అక్కడి సిబ్బంది బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, హోం క్వారంటైన్‌ లేదా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపడం లేదా చికిత్స కోసం కొవిడ్‌ ఆసుపత్రికి సిఫార్సు చేయడం.. వంటివి చేస్తారని వివరించారు. అవసరమైన వారికి 14 రోజుల పాటు వాడాల్సిన మందులను ఇచ్చి, అవి ఏ విధంగా వాడాలో అవగాహన కల్పిస్తారని తెలియజేశారు.

త్వరలో 24 గంటలూ పని చేసే పరీక్ష కేంద్రాలు

నగరంలోని పాత, కొత్త ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, బిషప్‌ అజరయ్య పాఠశాల ప్రాంగణంలో 24 గంటలూ పని చేసే కొవిడ్‌ నిర్ధారణ వైద్య పరీక్ష కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్టు జేసీ వెల్లడించారు. సమీక్షలో సబ్‌కలెక్టరు ధ్యానచంద్ర, శిక్షణ కలెక్టరు శోభిక, డీఆర్డీఏ పీడీ ఎం.శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో సూర్యప్రకాష్‌, డీఎంహెచ్‌వో డాక్టరు ఎం.సుహాసినీ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టరు జ్యోతిర్మయి, డాక్టరు శివప్రసాద్‌, వైద్యాధికారులు చైతన్య కృష్ణ, నవీన్‌, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త బాలసుబ్రహ్మణ్యం, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చికిత్స కోసం ఎక్కడికెళ్లాలి
కరోనా రోగుల్లో చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలనే అయోమయం నెలకొంది. లక్షణాలు లేకపోతే.. పాజిటివ్‌ వచ్చినా ఇంటికే పంపిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చి కొంత నీరసంగా ఉన్నా పడకలు లేవని చెబుతున్నారు. కరోనా రోగి కావడంతో సహాయకులు లేకుండా ఆసుపత్రికి వస్తున్నారు. వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. విజయవాడ నగరంలో రోజూ ఇందిరాగాంధీ స్టేడియం, దండమూడి ఇండోర్‌ స్టేడియం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, రైల్వే గ్రౌండ్స్‌లో కొవిడ్‌ పరీక్షలకు నమూనాలు స్వీకరిస్తున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రిలో కూడా పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో సగటున 2వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నమూనాలు తీసుకున్న తర్వాత రెండు మూడు రోజుల వరకు ఫలితాలు చెప్పడం లేదు. నెగెటివ్‌ వచ్చిన వారికి ఆ సమాచారం కూడా ఇవ్వడం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని