Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసు శాఖలో కరోనా గుబులు

కరోనా రక్షణ రేఖగా చుట్టూ తాడు కట్టుకొని ఫిర్యాదులు నమోదు చేస్తున్న స్పందన సిబ్బంది

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : కరోనా కట్టడికి ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న పోలీసు శాఖలో వైరస్‌ ఉద్ధృతి గుబులు పుట్టిస్తోంది. గత ఏడాది లాక్‌డౌన్‌ కాలంలో సమర్థంగా పనిచేసిన పోలీసులకు రెండో దశ కరోనా మహమ్మారి తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. పలువురు సిబ్బంది దీని బారిన పడటమే కారణం.  సోమవారం ‘స్పందన’కు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో బాధితులు తరలి రావడం, వారు నిబంధనలు సరిగా పాటించకపోవడం అధికారులు, సిబ్బందికి తలనొప్పిగా మారింది. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. మాస్కులతోపాటు ముఖ కవచాలను ధరించి పనిచేస్తున్నారు. తమ చుట్టూ తాడును రక్షణరేఖగా అడ్డుకట్టుకొని ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఎస్పీలను కలవడానికి వచ్చిన వారికి థర్మల్‌స్కాన్‌తోపాటు శానిటైజ్‌ చేసి పంపిస్తున్నారు. ఇంత చేస్తున్నా... జిల్లా వ్యాప్తంగా సుమారు 70 మందికి పైగా పోలీసు సిబ్బంది కరోనా బారిన పడినట్లు సమాచారం. వారిలో అర్బన్‌ పరిధిలోనే 37 మంది వరకు ఉన్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్లకు బాధితులు ఒక్కరే రావాలంటూ బోర్డులు పెడుతున్నారు. రూరల్‌ స్పందన ఫిర్యాదుదారులు తమ ప్రాంతాల్లోని స్టేషన్‌ నుంచే ఎస్పీకి ఆన్‌లైన్‌ ద్వారా అర్జీలు ఇవ్వాలని సూచిస్తున్నారు. సిబ్బంది అధైర్య పడకుండా అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని బారిన పడిన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజు సమీక్షించి తగిన చర్యలు  తీసుకోవాలంటూ స్టేషన్‌ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. చికిత్స పొందుతున్న సిబ్బందిని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని