Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కొవిడ్‌ కేర్‌’ కేంద్రాలుగా కల్యాణ మండపాలు

మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: కొవిడ్‌-19 కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కల్యాణ మండపాలను గుర్తించి కొవిడ్‌ కేర్‌ కేంద్రాలుగా వినియోగించుకోవాలని, కనీసం 500 పడకలు ఉండేలా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో బుధవారం కొవిడ్‌-19 నియంత్రణకు నియమించిన నోడల్‌ అధికారులు, వారి బృంద సభ్యులు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవోలతో సమీక్షించారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నందున డివిజినల్‌ స్థాయిలో సబ్‌కలెక్టర్లు, ఆర్డీవోలు, వైద్యారోగ్య శాఖ అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. పాజిటివ్‌ వ్యక్తులు 104కు ఫోన్‌ చేసిన వెంటనే వారిని ఆసుపత్రుల్లో చేర్చేలా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్‌ చికిత్సకు 60 ఆసుపత్రులను సిద్ధం చేశామని, ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతించిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 50 శాతం బెడ్లు కరోనా చికిత్సకే కేటాయించేలా నోడల్‌ అధికారులు పర్యవేక్షించాలన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న రోగుల స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కరోనా నమూనా పరీక్షల ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోందని, నమూనాలు సేకరించిన మూడు గంటల్లోగా పరీక్ష ల్యాబ్‌లకు అందేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కొవిడ్‌ చికిత్స అందించేందుకు గతేడాది నియమించిన సిబ్బంది అందరికీ నియామక ఉత్తర్వులు పంపించి, వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పడకలు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివర్‌ మందులు అవసరం మేరకు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాలను మినీ కంటెయిన్‌మెంట్‌ జోన్‌లుగా ఏర్పాటు చేసి, అక్కడ ఎరుపు రంగు జెండాను గుర్తుగా పెట్టాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూం మాదిరిగానే, డివిజన్‌ స్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయాలని సబ్‌కలెక్టర్లు, ఆర్డీవోలను ఆదేశించారు. ఆసుపత్రి యాజమాన్యం, ట్రైఏజ్‌ కేంద్రం, కొవిడ్‌ కేర్‌ కేంద్రం, కొవిడ్‌ టెస్టుల వివరాలు, హోం క్వారంటైన్‌, సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ స్థాయి, అందుబాటులోని బెడ్లు, ఆక్సిజన్‌, తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో జేసీ పి.ప్రశాంతి, జేసీ-2 శ్రీధర్‌రెడ్డి, సబ్‌కలెక్టర్లు మయూర్‌ అశోక్‌, శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, శిక్షణ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, డీఎంహెచ్‌వో యాస్మిన్‌, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, డీఆర్‌డీఎ పీడీ ఆనంద్‌నాయక్‌, జీజీహెచ్‌ పర్యవేక్షకులు డాక్టర్‌ ప్రభావతి, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని