Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సర్వజనాస్పత్రిలో 800 పడకలు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు శరవేగంగా పెరుగుతుండటంతో సర్వజనాసుపత్రిలో పడకలు నిండిపోతున్నాయి. పడకలు పరిమితం కావడం, కావాలనుకునే వారు ఎక్కువగా ఉన్నందున నాన్‌ కొవిడ్‌ వార్డులను ఖాళీ చేయించి కొవిడ్‌ వార్డులుగా మారుస్తున్నారు. గత ఏడాది 500 పడకలు మాత్రమే కేటాయించగా, ప్రస్తుతం 800 పడకలను సిద్ధం చేసినట్లు సూపరింటెండెంట్‌ ప్రభావతి తెలిపారు. ఇందులో 105 ఐసీయూలో ఉన్నాయి. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లేవారు తక్కువగా ఉండగా.. పడకల కోసం ఎదురు చూసేవారు ఎక్కువవుతున్నారు. ఈసారి వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందు వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఉన్న నేపథ్యంలో ప్రాణవాయువు అవసరమైన వారంతా ప్రభుత్వాసుపత్రికి పరుగులు పెడుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరాను గురువారం నుంచి పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు జిల్లా పాలనాధికారి అనుమతి మంజూరు చేశారు. దీంతో ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్యాంకర్‌ ఆసుపత్రిలోకి వచ్చేవిధంగా బుధవారం ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బంది కొరతతో రోగులను వెంటనే వార్డులకు తరలించలేకపోతున్నారు. అందువల్ల మానవ వనరులను వెంటనే మంజూరు చేయాలని పలువురు సూచిస్తున్నారు. పెరిగిన పడకల ఆధారంగా వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందిని కేటాయిస్తేనే రోగులకు సకాలంలో సరైన చికిత్స అందే అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని