Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లోపాలు పరిహరించడమే సిసలైన భరోసా

ఒక్కొక్కటిగా పునః ప్రారంభమవుతున్న ‘కొవిడ్‌ కేర్‌’ కేంద్రాలు
గతంలో కంటే మెరుగైన వైద్యం, వసతులందాలన్నదే అందరి అభిలాష

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే

శివారు ప్రాంతాల్లో కేంద్రాలున్నందున మరింత భద్రత అవసరం

రోనా బాధితుల సంఖ్య పెరిగిపోవడం, అందరికీ వైద్యశాలల్లో సేవలు అందించడం సాధ్యంకాక పోవడంతో ప్రభుత్వం మళ్లీ ‘కొవిడ్‌ కేర్‌’ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పరీక్షల్లో ‘పాజిటివ్‌’ వచ్చి, ప్రాథమిక లక్షణాలతో ఉన్న వారిని ఈ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తారు. వారి ఆరోగ్య సమస్యలను దూరం చేయడం, వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకకుండా చూడడమే ఈ కేంద్రాల లక్ష్యాలు. ఇక్కడ బాధితులకు విడిగా ఒక గది కేటాయించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచి,  మందులు, భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష జరిగిన తేదీ మొదలుకొని పది రోజుల వరకు ఇక్కడ ఉంచి, తేరుకున్న తర్వాత తిరిగి ఇంటికి పంపుతారు.
గత ఏడాది తొలి సారిగా కొవిడ్‌ వచ్చినప్పుడు ఇలా జిల్లాలో పది ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుచేసి, వాటిల్లో 5 వేల మందికి వసతి కల్పించారు. సుమారు 29 వేల మందికి పైగా బాధితులు వీటిలో చికిత్స పొంది, వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. తాజాగా కరోనా రెండో దశలో కేసులు రోజు రోజుకూ అధికం అవుతుండడంతో తిరిగి వీటిని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతానికి గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట ప్రాంతాల్లో 1000 పడకలతో కొద్ది రోజుల క్రితమే ఇవి ప్రారంభమయ్యాయి. గుంటూరులో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 100 పడకలతో ‘కొవిడ్‌ కేర్‌’ను బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురాగా, మరో రెండు రోజుల్లో బాపట్లలోనూ ఏర్పాటు చేయనున్నారు. తర్వాత మిగిలిన ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మలి దశలో ఈ కేంద్రాలు మరింతగా సద్వినియోగం కావాలంటే గతంలో దొర్లిన లోపాలు, పొరపాట్లు తిరిగి ఈ మారు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది.  

గత ఏడాది దొర్లిన పొరపాట్లను అవలోకిస్తే..
ఈ కేంద్రాలు దాదాపు అన్ని చోట్ల టిడ్కో నివాసగృహాల్లో ఏర్పాటు చేశారు. ఇవి ఆయా పట్టణాల శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి వద్ద సరైన భద్రత ఏర్పాటు చేయలేదు. దాంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆయా గృహాల్లోకి రావడంతో ఇతర అసాంఘిక కార్యక్రమాలకు ఆస్కారం కలిగింది. చుట్టూ ఉన్న చెత్తా చెదారం వల్ల గదుల్లోకి పాములు వచ్చిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి.
రాకపోకలను నియంత్రించే వారు లేకపోవడంతో ఈ కేంద్రాల్లోని వారు తమ ఇష్టానుసారంగా బయటకు రావడం, పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, దుకాణాలకు వెళ్లివచ్చేవారు. ఇలా చేయడగం వల్ల వైరస్‌ మరింత మందికి వ్యాపించేందుకు అవకాశం ఏర్పడింది.
భోజనం విషయంలో అనేక చోట్ల నాణ్యత ప్రమాణాలు పాటించ లేదు. మెనూ అమలు కాలేదు. నిబంధనల మేరకు ఏ బ్లాక్‌లో ఎంత మంది ఉన్నారో, వారికి ఆ బ్లాక్‌ చివర ఉన్న టేబుల్‌ వద్దకు భోజనం అందించాల్సి ఉండగా.. అలా జరగ లేదు. కేటరింగ్‌ ఏజెన్సీల వారు ఈ కేంద్రాల మెట్ల వద్దే ఆహార మూటలను పడేసి వెళ్లిపోయే వారు. దాంతో అన్ని బ్లాకుల నుంచి బాధితులు అక్కడికి గుంపులు, గుంపులుగా చేరే వారు. కొంతమంది రెండేసి పొట్లాలు తీసుకెళ్లడంతో చివరగా వచ్చిన వారికి భోజనం ఉండేది కాదు. మరో వంక ఏజెన్సీల వారికి తొలుత చెప్పిన విధంగా ఏనెలకానెల బిల్లలు చెల్లించ లేదు. వారు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. నెలలు గడిచినా అప్పటి బిల్లులే ఇప్పటికీ కొంత మందికి మంజూరు కాలేదు.
శుభ్రత పరంగా గతంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. గదుల్లోకి తొలిగా వచ్చిన వారు కరోనా నుంచి తేరుకుని తిరిగి తమ ఇళ్లకు వెళుతూ గదిని ఖాళీ చేసిన తర్వాత, శుభ్రం చేయకుండానే మరొకరికి అదే గదిని కేటాయించే వారు. అక్కడ వాడి పడేసిన దుస్తులు, సబ్బులు, తిను బండారాల కవర్లు, ఇతర చెత్త అలాగే ఉండేది. దీంతో తర్వాత వచ్చిన వారు ఇదంతా చూసి భయపడేవారు. మరుగుదొడ్ల విషయమైతే చెప్పనలవి కాదు.
వైద్య సేవల విషయంలోనూ బాధితులను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కేంద్రాల్లో ఉన్న బాధితులు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే వారిని వెంçనే సమీపంలోని పెద్ద వైద్యశాలలకు తరలించడానికి ఒక 108 వాహనం నిరంతరం సిద్ధంగా ఉండాల్సి ఉండగా.. గతంలో పలు చోట్ల ఈ విషయంలో గందరగోళ స్థితి నెలకొంది.

సమన్వయంతోనే సమస్యల పరిష్కారం
కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో భోజన ఏర్పాట్లు, పర్యవేక్షణ రెవెన్యూ విభాగం చూస్తోంది. వైద్యాన్ని వైద్యారోగ్యశాఖ అందిస్తుంది. పరిశుభ్రతను పురపాలక, పంచాయతీలు, అలాగే భద్రతను పోలీసులు అందించాల్సి ఉంది. ఈ నాలుగు విభాగాలు ప్రతి విషయంలోనూ సమన్వయంతో ముందుకు సాగి, పక్కా ప్రణాళికతో నిర్వహిస్తే ఈ కేంద్రాలు ఎంతో మంది బాధితులకు భరోసానిస్తాయి. వారిని విపత్తు నుంచి బయటపడేస్తాయి. నిఘా నేత్రాల ఏర్పాటు, వాటి నిరంతర పర్యవేక్షణ, ఉదయం, రాత్రి వేళల్లో ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు వంటివి పక్కాగా, లోప రహితంగా చేయాల్సి ఉంది.  

లోపాలు లేకుండా చూస్తాం
గతంలో దొర్లిన పొరపాట్లు ఈ మారు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని విభాగాల వారితో ఈ అంశాలపై చర్చిస్తాను. లోపాలు లేకుండా కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను నిర్వహిస్తాం. ఈ మారు కేంద్రాల్లో అక్సిజన్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అత్యవసర సమయంలో వైద్యశాలకు చేరే లోపు ఇవి ఉపయోపగడతాయి. ఇందు కోసం సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నాం.

- డాక్టర్‌ లక్ష్మానాయక్‌, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల జిల్లా నోడల్‌ అధికారి, గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని