Updated : 22/04/2021 04:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంధాలను దూరం చేస్తూ.. బతుకును భారంగా మారుస్తూ..

న్యూస్‌టుడే, సత్తెనపల్లి, నాదెండ్ల, చిలకలూరిపేట గ్రామీణ

చిలకలూరిపేటకు చెందిన ఓ వ్యక్తి(54) తన రెక్కల కష్టంతో బిడ్డలిద్దరిని ఉన్నత చదువులు చదివించాడు. కుమారుడు విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌, కుమార్తె హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి పెళ్లి చేయాలని మంచి సంబంధాలు అన్వేషిస్తున్నాడు. ఇంతలో కరోనా వేసిన కాటుకి బలయ్యాడు. శుభకార్యం చేయాల్సిన ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి మృతితో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగింది.


సత్తెనపల్లి పట్టణానికి చెందిన నాన్న.. ఇద్దరు కుమార్తెలు ఓ ఇంట్లో నివాసముంటున్నారు. అమ్మ లేని లోటును పూడుస్తూ ఇద్దరు కుమార్తెలకు అండాదండగా ఉన్న నాన్న (వ్యాపారి 60 ఏళ్లు) కరోనాతో మృతి చెందారు. తండ్రి మరణంతో ఆధారం తెగి ఆయనపై ఆధారపడిన కుమార్తెల బతుకు భారంగా మారింది. ప్రతి రోజూ నాన్నను తలుచుకుని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమను చెయ్యిపట్టి నడిపించే వారులేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.


ఆ వ్యాపారి (46)ది సత్తెనపల్లి పట్టణం. అందరితో కలివిడిగా ఉంటారు. వ్యాపారం చేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందారు. రెండు వారాలకు పైగా వైరస్‌తో పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. లోకం పోకడ తెలియని ముగ్గురు పిల్లలతో ఎలా జీవితం గడపాలో తెలియని స్థితిలో మృతుడి భార్య ఉన్నారు. ఇష్టమైన వ్యాపారంలో తనను ప్రోత్సహిస్తున్న భర్త ఇక లేరనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కరోనా కల్లోలం రేపింది.

ప్రతి ఒక్కరిని ఇప్పుడు కరోనా కలవరపెడుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే, నిబంధనలు పాటించకుంటే నేనున్నానంటూ పలకరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చుట్టేస్తానంటోంది. అయినా చాలామందిలో స్పృహ కొరవడుతోంది. అవసరం ఉన్నా లేకున్నా బయట తిరగడం, గుంపులుగా చేరడం, భౌతిక దూరం పాటించకుండా, మాస్క్‌ ధరించకుండా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ఆ నిర్లక్ష్యమే తనతో పాటు ఇతరులకు సంకటంగా మారుతోంది.
జిల్లాలో ప్రతిరోజూ మూడు అంకెల్లో బాధితులు నమోదవుతున్నారు. ఇందులో అధికార, అనధికారం కలిపి మరణాలు రెండు అంకెల్లో ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో  ఒకే చోట కలిసి పనిచేసిన స్నేహితులు, కలసి మెలసి సంతోషకరమైన జీవనం సాగిస్తున్న కుటుంబాల్లో సభ్యుల మృతితో అలజడి రేగుతోంది. కనీసం తమ వారిని చివరి క్షణాల్లో పరామర్శించే అవకాశాలు అంతంత మాత్రమే. ఇరుగు పొరుగు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు స్వస్తి పలుకుతున్నారు.

కుటుంబాన్ని నడిపే దిక్కు లేక
కుటుంబంలో సంపాదనపరుడి ఆకస్మిక మృతితో వారి జీవన ప్రణాళిక దెబ్బతింటోంది. ఆత్మీయులను కోల్పోయిన బాధతో పాటు కుప్పకూలిన బతుకుబండిని నడిపే దిక్కు లేకుండా పోతోంది. కుటుంబ జరుగుబాటు, వైద్య, ఇతర అవసరాలకు తెచ్చిన అప్పులు తీర్చలేని దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పిల్లల విద్య, పెద్దల వైద్యం ఖర్చులు అదనపు భారం మోయడం కష్టతరమవుతోంది. ఆశల పల్లకిలో సాగిపోతున్న కుటుంబాల్లో కొవిడ్‌ మృత్యు ఘంటికలు మోగిస్తే అవి చుక్కాని లేని నావలా తయారవుతున్నాయి.
చుట్టేస్తున్న మహమ్మారి..
తొలిదశ సమయం కంటే రెండో దశ కరోనా వ్యాప్తి వేగంగా ఉందని నాదెండ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టరు సోమ్లనాయక్‌ అభిప్రాయపడ్డారు. గతంలో వైద్య సదుపాయాలు సమకూర్చుకుని సేవలు అందించడం కష్టమైంది. ఆ అనుభవంతో పాటు వైద్య సేవలు మెరుగుపడినప్పటికీ వైరస్‌ వేగానికి అడ్డుకట్టపడడం లేదు. రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి మొత్తం సభ్యులు వైరస్‌ ప్రభానికి గురవుతున్నారు. దీంతో వైద్యశాలలో మంచాలు దొరక్క ఊరికోక చోట చికిత్స పొందుతున్నారు. వీరికి సపర్యలు చేయడం మిగతా సభ్యులకు కష్టమవుతోంది. మెరుగైన వైద్యం కోసం ఇతర పట్టణాలకు తరలించలేక ఉన్నచోట దయనీయమైన పరిస్థితులు గడుపుతున్నారు.
కడసారి చేదు జ్ఞాపకాలు..
వైరస్‌ సోకిందన్న ఆందోళనతో పాటు ఆర్థిక ఇబ్బందులు భారమవుతున్నాయి. పడకలు దొరక్కపోవడం, అవసరానికి ఆర్థిక వనరులు సమకూరకపోవడంతో ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామన్న బాధ బాధిత కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది. రోజుల లెక్క వైద్య ఖర్చులను భరించలేక పేద, మధ్యతరగతి వర్గీయులు తమ వారిపై ఆశలు వదులుకుంటున్నారు. సర్కారు దవాఖానాల్లో వదిలేసి చేతులు జోడిస్తున్నారు. అక్కడ కనీసం పరామర్శించే వారు కొరవడుతున్నారు. మృతదేహాలకు సొంత ఊరిలో అంతిమ సంస్కారాలు చేసేందుకు బంధువులు ముందుకు రాని పరిస్థితి. దీంతో పురపాలక సిబ్బంది సాయంతో శ్మశాన వాటికలకు తరలిస్తున్నారు. కడసారి చూపునకు నోచుకోకుండానే తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల భౌతిక దేహాలకు అంత్యక్రియలు చేయడం వారికి చేదు జ్ఞాపకాలను మిగుల్చుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని