Published : 22/04/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా పరీక్షల్లో వేగం ఏదీ?

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

జిల్లాలో కరోనా విజృంభిస్తున్నా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఆ స్థాయిలో జరగడం లేదు. అందువల్లే వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తోందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స అందించేందుకు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను వేరు చేసేందుకు, ఆయా ప్రాంతాల్లో కట్టడి చర్యలు చేపట్టి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుంటుంది. జిల్లాలో రోజూ నమూనాల్ని పరీక్షించే సంఖ్య 7 వేలు దాటకపోవడం గమనార్హం. పరీక్షలు పెరగకపోవడంతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో జాప్యమవుతోంది. దీంతో అనుమానిత లక్షణాలున్నా వారంతా ఇంట్లో ఉండకుండా, చాలామంది మాస్కులు ధరించకుండా, బౌతికదూరం పాటించకుండా తిరుగుతుండటంతో వైరస్‌ వేగంగా సంక్రమిస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షల పెంపుపై వెంటనే దృష్టి పెట్టాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీనిపై గుంటూరు వైద్య కళాశాల ప్రధానాచార్యులు బాబూలాల్‌ మాట్లాడుతూ రోజుకు 4,500 నమూనాల్ని పరీక్షించే సామర్థ్యం ఉన్నప్పటికీ, 5 వేల వరకూ పరీక్షించగలగుతున్నామన్నారు. పరికరాలు, పరీక్షించే కేంద్రాలు, మానవ వనరులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం
గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రయోగశాలలో నిత్యం 5 వేల నమూనాల్ని మాత్రమే పరీక్షించగలుగుతున్నారు. దీంతో నమూనాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. బుధవారం నాటికి సుమారు 15 వేల నమూనాలు ఇంకా పరీక్షించాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన సేకరించిన నమూనాలను బుధవారం పరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల ఫలితాలు వెల్లడి ప్రకటించడానికి కనీసం మూడు రోజుల గడువు పడుతోంది.
మళ్లీ ఆ స్థాయిలో సన్నద్ధమైతేనే..
వైద్య కళాశాలలో ల్యాబ్‌ 24 గంటలూ పనిచేయాలి. అవసరాలకు తగ్గట్లు సిబ్బందిని నియమించుకోవాలి. ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన ప్రైవేటు వైద్య కళాశాలలు, ప్రయోగశాలల్లో గరిష్ఠంగా నమూనాల్ని పరీక్షించేవిధంగా చూడాలి. ప్రభుత్వ నమూనాల్ని ప్రైవేటు ప్రయోగశాలల్లో పరీక్షిస్తే కేవలం రూ.475 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లకు నేరుగా వచ్చే నమూనాల్ని పరీక్షిస్తే రూ.800 నుంచి రూ.1,500 వరకు రుసుం వసూలు చేస్తున్నారు. దీంతో వారు ప్రభుత్వం నుంచి వచ్చే నమూనాలను పరీక్షించేందుకు ఆసక్తి చూపడం లేదని పలువురు తెలుపుతున్నారు.
క్షేత్ర స్థాయిలో సమన్వయలోపం
కరోనా వైరస్‌ అనుమానితుల నుంచి క్షేత్ర స్థాయిలో సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు పంపడంలో సక్రమంగా వ్యవహరించనందున ఇబ్బందులు వస్తున్నాయి. ఐసీఎంఆర్‌ ఫారంలో ఉన్న వివరాలు, సేకరించిన నమూనాపై ఉన్న సమాచారం భిన్నంగా ఉంటుందని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. ఒకేసారి వేల నమూనాలు రాత్రి సమయంలో ల్యాబ్‌కు పంపుతుండటంతో లోపాలు గుర్తించి, సరిచేసేందుకే చాలా సమయం వృథా అవుతోందని తెలుపుతున్నారు. రోజుకు 4,500 నమూనాల్ని పరీక్షించే సామర్థ్యం ఉన్నందున ఆ మేరకు పంపితే ఫలితాలు వెంటనే ప్రకటించే అవకాశం ఉంటుందంటున్నారు. ఆ విధంగా కాకుండా అధికంగా వస్తున్నందునే ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతోందని తెలుపుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని