Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెజవాడలో చంద్రయానం

విజయవాడ పాతబస్తీలో చిన్నారిని ఎత్తుకున్న చంద్రబాబు. చిత్రంలో సీపీఐ నేత రామకృష్ణ, కేశినేని శ్వేత.
పంజా సెంటర్‌లో జరిగిన రోడ్‌ షోలో అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెదేపా అధినేత

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ నగరంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. ఉదయం 11.30 గంటలకు భవానీపురంలోని 41వ డివిజన్‌ ముస్లిం దర్గా నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఆరంభమైంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ మేయర్‌ అభ్యర్థి కేశినేని శ్వేత, ఎంఎల్‌సీ బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య, బచ్చుల అర్జునుడు, నాగుల్‌ మీరా సహా తెదేపా సీనియర్‌ నాయకులు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. భవానీపురం, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, చిట్టినగర్‌, వన్‌టౌన్‌ మీదుగా రోడ్‌షో సాగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా చంద్రబాబుతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రధాన ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు ప్రసంగించారు. మధ్య నియోజకవర్గంలోనికి రోడ్‌షో ప్రవేశించి సింగ్‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై విమర్శలు గుప్పించారు.  అప్పటికే సమయం రాత్రి 9.30 గంటలు దాటిపోవడంతో అక్కడి నుంచి కండ్రిక వరకు వచ్చి రోడ్‌షోను ముగించారు. మధ్య, తూర్పు నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రచారం చేయాల్సి ఉన్నా సమయం లేకపోవడంతో ఆపేశారు. అధినేత పర్యటనకు తాను దూరంగా ఉండి కుమార్తె కేశినేని శ్వేత పాల్గొనేలా ఎంపీ కేశినేని నాని వ్యవహరించినట్లు తెలిసింది.
కాన్వాయ్‌ మళ్లింపు
కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: విజయవాడలోని కండ్రిక వద్ద నుంచి రోడ్‌షో ముగించి కాన్వాయ్‌లో బయలుదేరిన తెదేపా అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ను గురునానక్‌కాలనీ రోడ్డు వద్ద పోలీసులు ఆపారు. గురునానక్‌కాలనీ రోడ్డులో నుంచి కాన్వాయ్‌ వెళ్లాల్సి ఉండగా.. జాతీయ రహదారి గుండా వెళ్లాలంటూ పోలీసులు సూచించారు. దీంతో కొంత సమయం హైడ్రామా నడిచింది. జాతీయ రహదారిపై కాన్వాయ్‌ నిలిచిపోయింది. 15 నిమిషాల తర్వాత బెంజిసర్కిల్‌ మీదుగా కాన్వాయ్‌ను పోలీసులు పంపించారు.
వైకాపాకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి పాతర..: రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
వైకాపాకు మరోసారి ఓటు వేసి తప్పు చేయొద్దు. పులివెందుల, పుంగనూరులో పోలింగ్‌ లేకుండా అంతా ఏకగ్రీవాలు చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. విజయవాడలో వైకాపా గెలిస్తే పులివెందుల రాజ్యమే వస్తుంది. వైకాపాని ఓడించి అమరావతి రాజధానిపై ఇక్కడి వారి అభిప్రాయాన్ని తెలియజేయాలి. పసుపు, ఎరుపు కలయిక ఎప్పుడూ శుభసూచికమే.
ఎన్నో దుర్మార్గాలు:  శ్వేత, తెదేపా మేయర్‌ అభ్యర్థి
గత రెండేళ్ల వైకాపా పాలనలో ఎన్నో దుర్మార్గాలు భరిస్తున్నాం. తెదేపా పుట్టినిల్లు విజయవాడ. పశ్చిమలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ నగరానికి చేసిందేమీ లేదు. కార్పొరేటర్‌ స్థాయికి కూడా పనికిరాని వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న తెదేపా అభ్యర్థులను గెలిపించాలి. ఈ ప్రాంతంపై కక్షతోనే రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. జాబు రావాలంటే మళ్లీ బాబు వస్తేనే సాధ్యం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని