Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కూలీలపైమృత్యు పంజా..!

 రహదారి ప్రమాదంలో ఇద్దరి మృతి
21 మందికి గాయాలు

ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా దుస్తులు, వంట సామగ్రి, పాత్రలు, ఆహారం

జంగారెడ్డిగూడెం, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద బతుకులు వారివి... ఒక జట్టుగా ఉంటూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న వారిపై విధి పంజా విసిరింది.
పశ్చిమగోదావరి జిల్లా తల్లాడ - దేవరపల్లి రహదారిపై జంగారెడ్డిగూడెం బైపాస్‌పై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు దాటేందుకు ఆగి ఉన్న ట్రాక్టరును పొగ మంచు కారణంగా కనిపించక ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 12 మందికి దెబ్బలు తగిలాయి. వేమారెడ్డి రాంబాబు (48), బొల్లా సహస్ర (18 నెలలు) మృతి చెందారు. బొల్లా శివనాగేంద్రరావు కుమార్తె సహస్రకు తలకు బలమైన గాయం కావడంతో రక్తం పోయింది. ఈ చిన్నారిని మొదట పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో ఏలూరు రిఫర్‌ చేయడంతో అక్కడికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.


దైవదర్శనానికి బయలుదేరి..
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిగ గ్రామానికి చెందిన పలువురు కుప్పనూర్పుడి పనులు చేస్తుంటారు. మూడు ట్రాక్టర్లపై చిక్కవరం నుంచి సుమారు 60 మంది వ్యవసాయ కూలీలు తమ కుటుంబాలతో సహా పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం గుబ్బలమంగమ్మ ఆలయానికి శనివారం రాత్రి బయలుదేరారు.  ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటలకు ట్రాక్టర్లు జంగారెడ్డిగూడెం చేరుకున్నాయి. రెండు ట్రాక్టర్లలోని వారు విందుకు అవసరమైన మాంసం కొనేందుకు ఆగారు. వీరి ముందున్న మరో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మార్గ మధ్యంలో బైపాస్‌ రావడంతో దానిని దాటించకుండా వెనుక వారి కోసం వాహనాన్ని రహదారి అంచున నిలిపారు. ఈ సమయంలో ఖమ్మం వైపు వెళ్తున్న లారీ వేగంగా ట్రాక్టర్‌ ఇంజిన్‌ భాగాన్ని ఢీకొట్టి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టరు ఇంజిన్‌ ట్రక్కు నుంచి విడిపోయింది. ఇందులోని వారందరూ ఎగిరి రోడ్డుపై పడటంతో అందరూ గాయపడ్డారు. చిమ్మ చీకటి, పైగా మంచు కురుస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఏం జరిగిందో తెలియని అయోమయం నెలకొంది. రక్తమోడిన గాయాలతో బాధితుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం హృదయవిదారకంగా మారింది. ట్రక్కు పూర్తిగా బోర్లా పడకుండా సమీపంలోని బడ్డీ కొట్టు కారణంగా ఆగింది. ప్రమాదంలో ట్రక్కులో ఉన్న వారందరికీ గాయాలు కాగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో వేమారెడ్డి అశ్వినికుమార్‌ (25), వేమారెడ్డి ఆదిత్యకుమార్‌ (29), బొల్లా నిరీష (32)లను విజయవాడ తరలించారు. వేమారెడ్డి కుమారి (50), వేమారెడ్డి వీరమ్మ (35), ఆయా సాంబయ్య (24), బంటు రమాదేవి (29), వేమారెడ్డి రమాదేవి (29), వేమారెడ్డి గణపతి (22), బంటు శివమ్మ (46), బొల్లా శ్రీను (45), బొల్లా పుట్లమ్మ (30), బొల్లా సుశీల (35), బంటు శ్రావణి (24), బొల్లా కుమారి (40), చెమట మహాలక్ష్మి (40), బొల్లా శ్రీనివాసరావు (45), లాము రవికుమార్‌ (30), బంట రమణ (45), బంటు అభిదాస్‌ (6) మరో వ్యక్తి  ఏలూరులో చికిత్స పొందుతున్నారు.  
ప్రమాదం సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితులను మొదట జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  


గ్రామంలో విషాద ఛాయలు
ప్రమాద వార్త తెలిసిని వెంటనే చిక్కవరం శివారు కండ్రిగ గ్రామంలో  విషాద ఛాయలు అలముకున్నాయి. ఏటా వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత ఇష్ట దైవానికి మొక్కులు తీర్చుకోవడం  గ్రామస్థులకు అలవాటు. ఈ ఏడాది కూడా గుబ్బల మంగమ్మను దర్శించడానికి బయలు దేరిని వీరిని విధి వెంటాడింది.  బాధితులను స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఏలూరు వెళ్లి పరామర్శించి మెరుగైన చికిత్స నిమిత్తం చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆళ్ల నానితో కలిసి ఆదేశించారు.


కుమార్తె పెళ్లి చూడకుండానే..
ప్రమాదంలో మృతి చెందిన వేమారెడ్డి రాంబాబుకు భార్య, కుమార్తె ఉన్నారు. రానున్న మే నెలలో ఉన్నగానొక్క కూతురు భవాని పెళ్లిని ఘనంగా చేయాలని తన సన్నిహితులతో పదేపదే సమాలోచనలు చేసేవారని గ్రామస్థులు చెప్పారు. పెళ్లి కుదుర్చుకున్న తర్వాత అనుకోని రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణవార్త విన్న కూతురి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. మరోవైపు భార్య వీరమ్మకు కూడా ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.
* ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి సహస్ర  తల్లిదండ్రులకు కూడా ఒక్కటే కుమార్తె. ఉన్న ఒక్క కూతురు మృతి చెందడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని