
ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతి
పల్లగిరి(నందిగామ గ్రామీణం), న్యూస్టుడే: నందిగామ-మధిర ఆర్అండ్బీ రహదారిపై పల్లగిరి మునేటికాలువ వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న రహదారి ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మాగల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బొబ్బిళ్లపాటి చిట్టిబాబు(35) కంచికచర్ల మండలం పేరకలపాడు నుంచి సిమెంటు ఇటుకలతో మాగల్లు వస్తున్నాడు. పల్లగిరి మునేటికాలువ సమీపంలో ఆటో అదుపుతప్పి రహదారిపక్కన కందకంలో బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ చిట్టిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మాగల్లుకు చెందిన యమల్య(27) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని నందిగామ ప్రభుత్వాసుపత్రిలోచేర్చి మెరుగైన వైద్యంకోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవాగారంలోని చిట్టిబాబు మృతదేహాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, వైకాపా నాయకుడు కొమ్మినేని రవిశంకర్ పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనిపై ఎస్సై హరిప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.