Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేటితో ముగియనున్న వీరమ్మతల్లి తిరునాళ్ల

ఆలయం వద్ద భక్త జన సందోహం

ఉయ్యూరు టౌన్‌, న్యూస్‌టుడే: వీరమ్మతల్లి తిరునాళ్ల 14వ రోజైన ఆదివారం ఆలయ పరిసరాలు భక్త జనసందోహంతో నిండిపోయింది. భక్తులు క్యూలైన్లలో బారులుతీరి గంటల తరబడి నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో పాల పొంగళ్ల వద్ద రద్దీ పెరిగింది. భక్తులకు ఎండ నుంచి ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా టెంట్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడాయి. ఆలయం వైపు నుంచి వాహనాలు రాకుండా ప్రధాన కూడలి నుంచి కాటూరు రోడ్డు వైపు వాహనాలను మళ్లించారు. ఉయ్యూరు పెద్ద ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తిరునాళ్ల మొక్కుబడి ఉత్సవం ఘనంగా జరిగింది. ముఠా కార్యాలయం దగ్గర నుంచి అందంగా పూలతో అలంకరించి పొట్టేళ్లతో ప్రభ బండిని డీజే, మేళతాళాలు, డప్పువాయిద్యాలతో వందలాది మంది ముఠా కార్మిక కుటుంబాలు ఊరేగింపుతో వీరమ్మతల్లి ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు అందించారు. ముందుగా ఎమ్మ్లెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌, పెనమలూరు ఎమ్మెల్యే కె.పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్‌లు హాజరై కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఆదివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలువురు దాతలు మంచినీరు అందించారు. ఉయ్యూరు పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టరు ఎం.కె.బాబు నేతృత్వంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని