
తిరునాళ్లకు వచ్చే భక్తులకు వసతులు
ఏర్పాట్లపై ఎమ్మెల్యే, అధికారులతో చర్చిస్తున్న జేసీ ప్రశాంతి
నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: తిరునాళ్ల సందర్భంగా త్రికోటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని జాయింట్ కలెక్టర్ ప్రశాంతి చెప్పారు. కోటప్పకొండలో తిరునాళ్ల ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ లక్షలాదిగా భక్తులు వచ్చినా ట్రాఫిక్ రద్దీ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక పోలీసులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. 9వతేదీలోగా ఎవరు ఎక్కడ విధులు నిర్వహించాలన్న అంశంపై స్పష్టత ఉండాలని చెప్పారు. వరుసల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, పిల్లలకు పాలు, బిస్కెట్లు వంటివి అందించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏటా ముందస్తు సమావేశాలు పెట్టుకున్నా తిరునాళ్ల రోజున ట్రాఫిక్ నిలిచిపోవడం సహజంగా మారిందని చెప్పారు. ఈ ఏడాది ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్‌శాఖ విజయవంతమైతే రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించారు. సబ్‌కలెక్టర్ మయూర్‌అశోక్, డీఎస్పీ విజయభాస్కర్, ఈవో రామకోటిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.