
మహిళల భద్రత మా బాధ్యత
కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీలు అమ్మిరెడ్డి,
విశాల్‌గున్నీ, జేసీ ప్రశాంతి, జీఎంసీ కమిషనర్ అనురాధ తదితరులు
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం గుంటూరులో అర్బన్ పోలీసులు కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. డీఐజీ త్రివిక్రమవర్మ, అర్బన్, రూరల్ ఎస్పీలు అమ్మిరెడ్డి, విశాల్‌గున్నీ, జేసీ ప్రశాంతి, జీఎంసీ కమిషనర్ అనురాధ, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీగా కదిలారు. మహిళలను గౌరవించు, బాల్యవివాహాలు వద్దు, ఆడపిల్ల చదువు అవనికి వెలుగు అంటూ ఫ్లకార్డులు చేతపట్టారు. ఈ సందర్భంగా డీఐజీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ మహిళల భద్రత మా బాధ్యత అన్నారు. మహిళల రక్షణకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ఎస్పీలు అమ్మిరెడ్డి, విశాల్‌గున్నీలు మాట్లాడుతూ ప్రతి మహిళా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అన్నివేళలా పోలీసులు అండగా ఉంటారన్నారు.