
ఆశలు ఛిద్రం
పండగ వేళ విషాదం
ప్రమాదంలో దంపతుల దుర్మరణం
ప్రాణాలతో బయటపడ్డ కూతురు
ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: కన్న ఊరు.. సొంత మనుషులు, స్నేహితుల నడుమ పండగను సంతోషంగా జరుపుకుందామని కొండంత ఆశతో పయనమైన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో దంపతులను బలి తీసుకోగా, 15 ఏళ్ల కూతురు అనాథగా మిగిలిన విషాద ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం మలకపల్లికి చెందిన జొన్నలగడ్డ రమేశ్ (45) సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తన భార్య నీలిమ (40)తో కలిసి అక్కడే ఉంటున్నారు. వారి ఒక్కగానొక్క కుమార్తె అశ్విత చెన్నైలో ఓ వసతిగృహంలో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఎనిమిది రోజుల క్రితం రమేశ్, నీలిమ సింగపూర్ నుంచి చెన్నై చేరుకుని అక్కడే ఉన్న సొంతింట్లో ఉంటున్నారు. ఆయన సోదరుడు శ్రీనివాస్ కొవ్వూరులో నివసిస్తుండగా, అతని వద్దే తల్లిదండ్రులు వీర్రాజు, విజయలక్ష్మి ఉంటున్నారు. తల్లికి ఇటీవల ఒంట్లో బాగోలేదని తెలియడంతో కొవ్వూరు వెళ్లి ఆమెను తీసుకొని మలకపల్లి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో బుధవారం ఉదయం కూతురు, భార్యతో కలిసి సొంతూరుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు వద్ద ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వారి కారు ఢీకొంది. ఆ ధాటికి కారు పల్టీలు కొట్టి రోడ్డుకడ్డంగా పడింది. కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. చోదకుడి వైపు ఉన్న ముందు చక్రం దెబ్బతిని టైరు పగిలింది. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా, దాన్ని నడుపుతున్న రమేశ్, వెనుక సీటులో కూర్చున్న నీలిమ తీవ్రంగా గాయపడ్డారు. ముందు సీట్లో తండ్రి పక్కనే కూర్చున్న అశ్విత, ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అందులో ఉండి పోయింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు, సమాచారం అందుకున్న ఎస్సై అశోక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గడ్డపారతో కారు తలుపులు పగలగొట్టి రక్తపు గాయాలతో పడి ఉన్న ముగ్గురిని చికిత్స నిమిత్తం కాటూరి వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు రమేశ్ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కొద్దిసేపటికి చికిత్స పొందుతూ నీలిమ మృతి చెందింది. అశ్విత స్వల్ప గాయాలతో బయటపడినా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోయింది. కొంతసేపటికి తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న బాలిక అమ్మా, నాన్నా అంటూ బిగ్గరగా రోదిస్తుండగా అక్కడి వారు ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. ఎస్సై అశోక్ దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. సమాచారం అందుకున్న రమేశ్ సోదరుడు శ్రీనివాస్, బంధువులు గుంటూరు ఆసుపత్రికి చేరుకొని అశ్వితను అక్కున చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.