అనుమానంతో అంతం చేశాడు..
eenadu telugu news
Published : 30/07/2021 08:17 IST

అనుమానంతో అంతం చేశాడు..

భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త

    షాహిన్‌                   నిందితుడు ఆసిఫ్‌

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను పట్టపగలే అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. ఒకటో పట్టణ ఎస్‌హెచ్‌ఓ ఎం.రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన లారీ చోదకుడు ఆసిఫ్‌కు బెల్లంపల్లి పట్టణం అశోక్‌నగర్‌కు చెందిన షాహిన్‌(39)తో 17 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో ఆసిఫ్‌పై ఫిర్యాదు చేశారు. భార్య, పిల్లలను సరిగా చూసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు కాపురానికి పంపించారు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. లారీడ్రైవర్‌గా పని చేస్తున్న ఆయన నెల రోజుల నుంచి పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. ఈక్రమంలో భార్యపై అనుమానంతో హత్య చేయాలని ప్రణాళిక రచించాడు. గురువారం మధ్యాహ్నం కుమారుడిని బ్యాంకుకు పంపించాడు. కూతురు స్నానానికి వెళ్లడం గమనించి టీవీ శబ్దం ఒక్కసారిగా పెంచాడు. భార్యతో గొడవపడి గొంతు కోసి హతమర్చాడు. తల్లి మృతదేహాన్ని చూసి కుమారుడు, కూతురు బోరున విలపించారు. కుమారుడు సోహెల్‌ పది, కుమార్తె తమన్నా తొమ్మిదో తరగతి చదువుతున్నారు. భార్యను చంపిన వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. తన కుమార్తెను నమ్మి పంపిస్తే దారుణంగా చంపాడంటూ తల్లి సుల్తానా కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ రహమాన్‌ పరిశీలించారు. గొంతుతో పాటు శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని