Published : 21/04/2021 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాణవాయువు కొరత

ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు


పట్టణంలోని ఒక గ్యాస్‌ దుకాణంలో ఖాళీగా ఉన్న సిలిండర్లు

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రాణవాయువు(ఆక్సిజన్‌) కొరత తీవ్రంగా ఏర్పడింది. స్థానిక గ్యాస్‌ ఏజెన్సీలలో అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం కరోనా బారిన పడి పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితులకు విధిగా ఆక్సిజన్‌ అందిస్తే కాని బతకని పరిస్థితి ఉండటంతో డిమాండ్‌ పెరిగింది. ఉత్పత్తి సంస్థల నుంచి సరఫరా కాకపోవటంతో స్థానికంగా లభించని పరిస్థితి నెలకొంది.

జిల్లాలో మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులకు చికిత్సలను అందిస్తున్నారు. పరిస్థితి విషమించి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారిన బాధితులకు ఆక్సిజన్‌ అందించాల్సిన అవసరం ఉంది. నిత్యం దాదాపు అయిదు నుంచి పది మంది వరకు ఇలా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అవసరమైన కొవిడ్‌ రోగులు ఉంటున్నారు. అయితే స్థానికంగా ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేకుండా పోయాయి. పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. అయితే అక్కడ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతుండటంతో అక్కడి బాధితుల అవసరాలకే అది సరిపోవటం లేదు. దీంతో జిల్లాకు సరఫరా నిలిచిపోయింది. జిల్లా ఉన్నతాధికారులు అక్కడి అధికారులతో సంప్రదించి ఆక్సిజన్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటే తప్ప సరఫరా కాని పరిస్థితి.

ధరలు మూడింతలు..

ప్రస్తుతం ఆక్సిజన్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల వారు విధి లేని పరిస్థితుల్లో.. మహారాష్ట్ర, నిజామాబాద్‌ల నుంచి తెప్పించుకుంటున్నారు. అక్కడ సైతం అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. రెండు రేట్లు అధిక ధరలు చెబుతున్నారని స్థానిక వైద్యుడు ఒకరు పేర్కొన్నారు. గతంలో జంబో ఆక్సిజన్‌ సిలిండర్‌(15 లీటర్లు) రూ.400లకు లభించేదని ప్రస్తుతం రూ.1,000 నుంచి రూ.1,200లకు కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఈ భారం బాధితులపైనే పడుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని