close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆధిపత్య పోరుతోనే భాస్కరరావు హత్య

 ఎనిమిదేళ్లుగా అనేకసార్లు ప్రయత్నాలు
 గొడవలు పెరగడంతో.. మాజీ మంత్రిని కలిసిన నిందితులు
 కొల్లు రవీంద్ర భరోసాతో ప్రణాళిక ప్రకారం హత్య
 వివరాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

ఈనాడు డిజిటల్‌, విజయవాడ, మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటీ మాజీ అధ్యక్షుడు మోకా భాస్కరరావు హత్యలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భాగస్వామి అని, అన్ని ఆధారాలు సేకరించాకే ఆయన్ను అరెస్టు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. రవీంద్ర అనుచరుడు చింతా నాంచారయ్య అలియాస్‌ చిన్నా, భాస్కరరావుల ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగిందన్నారు. దీనంతటికీ కొల్లు రవీంద్ర పెద్దన్నలా వ్యవహరించారని ఎస్పీ చెప్పారు. వివరాలను ఆయన మచిలీపట్నంలో శనివారం వివరించారు.
‘భాస్కరరావు, నాంచారయ్య (చిన్నా)ల మధ్య ఏడెనిమిదేళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిన్నా.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరుడు. మచిలీపట్నం కార్పొరేషన్‌ 24వ వార్డు తెదేపా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. నగరపాలిక ఎన్నికల్లో ఆ వార్డులో చిన్నా తెదేపా తరఫున, భాస్కరరావు వైకాపా నుంచీ పోటీ చేస్తున్నారు. రాజకీయంగా తన ప్రత్యర్థి అయిన భాస్కరరావును చంపేందుకు చిన్నా 2013 నుంచి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. గత ఆరు నెలలుగా భాస్కరరావుకు తమ కులంలో ఆధిపత్యం పెరుగుతుండటంతో.. చంపాలని నిర్ణయించుకున్నారు. గత నెల 28న చంపేందుకు ప్రయత్నించారు. ఆ రోజు కుదరకపోవడంతో 29న చంపారు’ అని ఎస్పీ తెలిపారు.

హత్యకు రవీంద్ర ఇంట్లోనే కుట్ర
‘హత్యకు 15, 20 రోజుల క్రితం చిన్నా కొల్లు రవీంద్ర ఇంటికెళ్లాడు. ఎలాగైనా భాస్కరరావును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నానని, మీ సహకారం కావాలని అడిగాడు. ఆయన తర్వాత చూద్దామని పంపించేశారు. అనంతరం భాస్కరరావు, చిన్నాల మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయి. దీంతో హత్యకు ఐదు రోజుల ముందు చిన్నా.. రవీంద్రను మళ్లీ కలిశాడు. అన్నా.. భాస్కరరావును చంపకపోతే మా కులంలో బతకడం కష్టంగా ఉందని చిన్నా అనడంతో రవీంద్ర అంగీకరించారు. పక్కాగా ప్లాన్‌ చేయాలని, విఫలమైతే అతను మనందరి అంతు చూస్తాడని చెప్పారు. నేను మీకు అన్ని రకాలా సాయం చేస్తాను. కానీ నా పేరు ఎక్కడా రాకూడదు.. నాకు నేరుగా ఫోన్‌ కూడా చేయొద్దని రవీంద్ర సూచించారు. హత్య ఎప్పుడు, ఎక్కడ చేయాలో ఆయన ఇంట్లోనే ప్రణాళిక వేశారు. చేపల మార్కెట్‌కు వచ్చి వెళ్తున్న భాస్కరరావుపై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోతూనే చిన్నా వేరే ఫోన్‌ నుంచి రవీంద్రకు కాల్‌ చేసి పనైపోయిందని చెప్పారు. సరే పారిపోండని ఆయన సూచించారు. తన పీఏలు రిజ్వాన్‌, నాగరాజుతోపాటు కోలా రాము, ధనబాబుల ఫోన్లతో మధ్యాహ్నం 3.30 గంటల వరకు రవీంద్ర నిందితులతో మాట్లాడినట్టు గుర్తించాం. భాస్కరరావు హత్య విషయంలో చిన్నా, నాంచారయ్య అలియాస్‌ పులి, మరో మైనర్‌ బాలుడితో పాటు కొల్లు రవీంద్ర ప్రోద్బలం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్‌ డేటాను పరిశీలించి నిందితులను గుర్తించాం. శుక్రవారం మధ్యాహ్నం కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లేసరికే ఆయన పరారయ్యారు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించగా తూర్పుగోదావరి జిల్లా సీతారాంపురం దగ్గర పట్టుబడ్డారు. శుక్రవారం రాత్రి అరెస్టు చేసి మచిలీపట్నానికి తీసుకొచ్చాం’ అని ఎస్పీ తెలిపారు.
మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలింపు
కొల్లు రవీంద్రకు పోలీసులు శనివారం ఉదయం ఆరోగ్య పరీక్షలు చేయించి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండో అదనపు మేజిస్ట్రేట ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో చిన్నా, పులి, బాలుడు, నాగమల్లేశ్వరరావు, వంశీలను అరెస్టు చేసి, ఐపీసీ 302, 109 రెడ్‌విత్‌ 32 సెక్షన్ల కింద కేసు పెట్టామని ఎస్పీ చెప్పారు.
నిజనిర్ధారణ కాకుండా అరెస్టా?
నిజనిర్ధారణ, కోర్టులో నిరూపణ కాకుండా కేవలం నిందితుల వాంగ్మూలం ఆధారంగా.. అగ్నికుల క్షత్రియ సంఘ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం తమ సామాజికవర్గానికి చేస్తున్న అన్యాయంగానే భావిస్తున్నామని అగ్నికుల క్షత్రియ జాతీయ యూత్‌ అధ్యక్షుడు నాగిడి సాంబశివరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘మచిలీపట్నంలో అగ్నికుల క్షత్రియుడు మోకా భాస్కరరావు హత్యను మేం ఖండిస్తున్నాం. అయితే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోత్సాహంతోనే ఈ హత్య చేశామని.. ప్రధాన నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు చూపి ఆయన్ను అరెస్టు చేయడం బాధాకరం’ అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.