భీవండి ఘటనలో 16కి చేరిన మృతులు 

తాజా వార్తలు

Updated : 21/09/2020 22:02 IST

భీవండి ఘటనలో 16కి చేరిన మృతులు 

భీవండి: మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్థుల భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. వీరిలో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. నాలుగేళ్ల బాలుడితో పాటు 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. సోమవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో భీవండి పట్టణంలో పాత భవనం ఒకటి  కూలిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది 43 ఏళ్లనాటిదని, ఆ భవనం యజమానిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక అధికారుల్ని సైతం ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. 

ఠానే నగరానికి 10 కి.మీల దూరంలో పటేల్‌ కాంపౌండ్‌లో ఉన్న ఈ మూడంతస్థుల భవనంలో 40 ప్లాట్లు ఉండగా.. 150 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. అందరూ నిద్రపోతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న కొందరిని బయటకు తీశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. 

అనంతరం సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు జాగిలాలను రంగంలోకి దించినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌.ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు స్థానిక అధికారులు చెప్పారు. స్థానిక అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో భవనం యజమాని సయ్యద్‌ అహ్మద్‌ జిలానీపై కేసు నమోదు చేసినట్టు భీవండి డీసీపీ రాజ్‌కుమార్‌ షిండే తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ఈ ఘటనలో మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. నగరంలో 120 ప్రమాదకరమైన భవనాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిని ఖాళీ చేయించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు కమిటీని వేశారు. 

ప్రధాని మోదీ, సీఎం ఉద్ధవ్‌ విచారం

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని అధికారుల్ని ఆదేశించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని