
తాజా వార్తలు
వెండి సింహాల చోరీ.. దొరికిన నిందితుడు
విజయవాడ: బెజవాడ దుర్గగుడిలో వెండి సింహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడు సాయిబాబు, బంగారం వ్యాపారి కమలేశ్ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 కిలోల వెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సిట్ అధికారులతో కలిసి విజయవాడ సీపీ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.
సీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది జూన్ చివర్లో దుర్గగుడికి నిందితుడు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. దర్శనం అనంతరం మెట్లు దిగుతుండగా ఆలయంలో టార్పాలిన్ కవర్ కప్పిన వెండి రథంపై ఉన్న వెండి సింహాల ప్రతిమలను చూశాడు. పథకం ప్రకారం ఒక ఇనుప రాడ్ సాయంతో మూడు విగ్రహాలను దొంగిలించగలిగాడు. నాలుగో సింహం ప్రతిమ రాకపోవడంతో భయపడి అక్కడనుంచి పారిపోయాడు. అక్టోబరు 17న వెండి సింహాల ప్రతిమలు అపహరణకు గురైనట్లు ఆలయ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ప్రారంభించాయి. విచారణలో భాగంగా ఆలయంలో పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను విచారించాం. ఈ తరహా దొంగతనాలకు పాల్పడిన 40 మంది పాత నేరస్థులను పోలీసులు విచారించారు. ఓ దొంగతనం కేసులో అరెస్టయిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సాయిబాబును విచారించగా కేసు మిస్టరీ వీడింది. వెండి సింహాలను తుక్కుగా చేసి తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన నగల వ్యాపారికి విక్రయించినట్లు తేలింది’’ అని సీపీ వెల్లడించారు. నిందితుల వద్ద ఇతర ఆలయాల్లో చోరీ చేసిన 6.4 కిలోల వెండి దిమ్మెలనూ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
ఇవీ చదవండి..
మీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల