
తాజా వార్తలు
కూలి పనులకు వెళుతూ మృత్యువాత
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు సరిహద్దులో జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కొనకొండ్ల సమీపంలో 18 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతురాలు వజ్రకరూరు మండలం కొనకొండ్ల వాసి రమణమ్మ(35)గా గుర్తించారు. బాధితులంతా కూలి పనుల కోసం కొనకొండ్ల నుంచి ఈ తెల్లవారుజామున ఆటోలో గుమ్మనూరు బయల్దేరారు. రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండటంతో రహదారికి అడ్డంగా మట్టి కుప్పలు వేశారు. వీటిని గమనించకుండా డ్రైవర్ వేగంగా నడపటంతో ఆటో బోల్తా పడింది. కూలీలపై ఆటో పడటంతో గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ రమణమ్మ మార్గ మధ్యలోనే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి..