close

తాజా వార్తలు

కలిసి బతకలేక...విడిచి ఉండలేక

చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమికుల ఆత్మహత్య

టెక్కలి పట్టణం : రాళ్లల్లో, ఇసుకల్లో ఇద్దరి పేర్లు రాసుకున్నారు. కాని, విధి వీరి ప్రేమ చూపి ఓర్వలేకపోయింది. తాము ఒకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు ఆ అమ్మాయికి వేరొకరితో వివాహమైంది. ఆరునెలలు గడిచినా మనసు మాత్రం మనసు పడ్డవాని దగ్గరే ఉండిపోయింది. అంతే కలిసి బతకలేమని.. అలాగని విడిచి ఉండలేమని ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

టెక్కలి మండలంలోని ఓ గ్రామంలో ప్రేమికులు చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందిన ఘటన సంచలనమైంది. గ్రామానికి చెందిన యువతి (20), నందిగాం మండలానికి చెందిన యువకుడి(24)తో ప్రేమలో పడింది. గ్రామంలో బంధువుల ఇంటికి తరచూ వస్తున్న యువకుడితో యువతికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పరిణయమాడి జీవితమంతా కలిసి ఉండాలని బాసలు చేసుకున్నప్పటికీ అది కుదరలేదు. ఆమె సంక్రాంతికి కన్నవారింటికి చేరింది. అదే సమయంలో యువకుడు కూడా అమ్మాయిని కలిశాడు. ఆదివారం వీరిద్దరూ కలసి మాట్లాడుకున్నారు. తమ ప్రేమను నిలుపుకోలేక పోయినందుకు తీవ్రంగా వేదన చెందారు. గ్రామంలోని చెట్టుపై తమ పేర్లను రాసుకున్నారు. తమను కలిపిన ప్రేమే శాశ్వతమని భావించినా, దాన్ని నిలుపుకోలేనప్పుడు ప్రాణాలు ఎందుకని వేదన చెందారు. సోమవారం వేకువజామున చెట్టుకు ఉరి వేసుకుని ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం వేళ చెట్టుకు వేలాడుతున్న ఇద్దరి మృతదేహాలను చూసిన గ్రామస్థులు ఆవేదన చెందారు. అబ్బాయి తరపువారు, అమ్మాయి తరఫువారు గ్రామానికి చేరుకోవడంతో గ్రామం శోక సంద్రమైంది. అబ్బాయి మృతదేహాన్ని ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో నందిగాం మండలంలోని స్వగ్రామానికి తరలించారు. అమ్మాయి మృతదేహాన్ని గ్రామంలోనే దహనం చేశారు. సంఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని టెక్కలి ఎస్‌ఐ బి.గణేష్‌ తెలిపారు.

ఆశల దీపాలు ఆరిపోయాయి

ఇద్దరూ తండ్రులు లేని పిల్లలే. అబ్బాయి తండ్రి కొన్నేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడగా, తల్లి కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. సోదరి కొంత ఆలనాపాలనా చూడగా, పెద్దమ్మ కూతురు కూడా ఆలనాపాలనా చూస్తుండటంతో ఆ గ్రామానికి రాకపోకలు ఎక్కువగా సాగిస్తుండేవాడు. ఆ క్రమంలోనే యువతి పరిచయమైంది. ఆమె కూడా తండ్రి లేడు. కుమార్తె భవిష్యత్తు బాగుండాలని ఆమె తల్లి అనుకుంది. మరో రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగితో ఆరునెలల క్రితమే వివాహం చేసింది. సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చిన కూతురు ఇంతటి ఘోరానికి పాల్పడుతుందని కలలోనైనా ఊహించలేకపోయింది. ప్రియురాలితో అందమైన జీవితాన్ని ఊహించుకున్న యువకుడు ఇటీవల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరో నెలరోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఈ తరుణంలోనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా ఆ ఇళ్ల ఆశల దీపాలు ఆరిపోయాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.