ఒక్క సెల్ఫీ.. జైల్లో 600 తాళాలను మార్చేసింది!

తాజా వార్తలు

Published : 05/03/2021 10:04 IST

ఒక్క సెల్ఫీ.. జైల్లో 600 తాళాలను మార్చేసింది!

బెర్లిన్‌: నేటి యువతకు సెల్ఫీలపై ఉన్న మోజు ఏపాటిదో చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫీల కోసం వింతవింత ప్రయోగాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిని సైతం మనం చూస్తున్నాం. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడు చేయడం నేటి యువతరం లక్షణాల్లో ఒకటి. అందులో తప్పేం లేదు. కానీ, వెళ్లిన చోటు ఎలాంటిదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. ఒక్క ఫొటోతో ఎన్నో విషయాలు బయటపడతాయని సైబర్‌ నిపుణులు చెబుతుంటారు. అలాంటి సంఘటనే జర్మనీలో జరిగింది. ఓ యువకుడు జైలులో ఒక్క సెల్ఫీ తీసుకోవడం వల్ల ఏకంగా జైలులో ఉన్న వందలాది గదులకు తాళాలు మార్చాల్సి వచ్చింది.

బెర్లిన్‌లోని జేవీఏ హైడరింగ్‌ జైలుకి ఇటీవల ఒక యువకుడు ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వెళ్లాడు. మొదటిసారి జైలుకు వచ్చిన అతడు ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకోవాలనుకున్నాడు. ఆ ఆతృతతో జైలులోని ప్రధాన కార్యాలయంలో సెల్ఫీ తీసుకొని వాట్సాప్‌ షేర్‌ చేశాడు. అయితే, అతడు దిగిన సెల్ఫీలో జైలుకు సంబంధించి మాస్టర్‌ తాళంచెవితోపాటు ముఖ్యమైన గదులకు సంబంధించిన తాళం చెవులు కూడా కనిపించాయి. ఫొటోలో ఆ తాళంచెవులు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయంటే.. నిపుణులతో వాటికి నకిలీ తాళంచెవులు సృష్టించగలిగేలా ఉన్నాయట. ఈ విషయం తెలుసుకున్న జైలు అధికారులు కంగుతిన్నారు. వెంటనే అతడిని ఇంటర్న్‌షిప్‌ నుంచి తొలగించి.. నష్టనివారణ చర్యలకు దిగారు. జైలులో ఉన్న 600 గదులకు తాళాలు, పాస్‌కోడ్‌లు మార్చారు. ఒకవేళ పోలీసులు సమయానికి చర్యలు తీసుకోకపోయి ఉంటే.. ఆ తాళంచెవులకు పొరపాటున జైలు ఖైదీలకు అందితే కచ్చితంగా వారంతా పారిపోయే అవకాశం ఉండేదని అక్కడి అధికారులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తాళాలు మార్చడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. పాతవి తీసేసి కొత్తవి మార్చడానికి 20 మంది సిబ్బంది అవసరమయ్యారట.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని