Love: ప్రేమ పేరిట మోసం..ఆపై నిర్బంధం

తాజా వార్తలు

Updated : 07/07/2021 08:26 IST

Love: ప్రేమ పేరిట మోసం..ఆపై నిర్బంధం

పోలీసుల చొరవతో బయటపడిన యువతి

వీరవాసరం, న్యూస్‌టుడే: ప్రేమించిన వ్యక్తి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు తనను నిర్బంధించి బెదిరింపులకు గురిచేస్తారని ఊహించని ఆ యువతి రెండు రోజుల పాటు తీవ్ర మనోవ్యధకు గురైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన ఎ.రమేష్‌, బెంగళూరుకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ యువతికి మాయమాటలు చెప్పి రెండేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ దగ్గరి బంధువుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి రమేష్‌ను దూరం పెట్టగా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారంటూ మాయమాటలు చెప్పి ఆమెకు మళ్లీ దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే రమేష్‌కు పలు దఫాలుగా రూ.50 లక్షల నగదు, బంగారం ఇచ్చినట్లు ఆ యువతి చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది కిందట స్వగ్రామానికి వచ్చిన రమేష్‌ అప్పటి నుంచి తనతో ఫోన్లోనే మాట్లాడేవాడని.. కొద్ది రోజులుగా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేయడంతో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు ఈనెల 3న నవుడూరులోని రమేష్‌ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. రమేష్‌ కుటుంబ సభ్యులు ఆమెను దుర్భాషలాడి బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో నవుడూరు బస్టాండ్‌ వద్ద కూర్చొని విలపిస్తుండగా స్థానికులు గమనించారు. ఈ విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని భావించిన రమేష్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు మాయమాటలు చెప్పి పెనుమంట్ర మండలం పొలమూరు శివారులో ఒక ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో ఎస్సై ఎ.పైడిబాబు రంగంలోకి దిగారు. మంగళవారం పొలమూరులోని ఆ ఇంటికి వెళ్లి బాధిత యువతిని విడిపించి వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్‌, అతడికి సహకరించిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని