Crime News: 4గంటల్లో 5,911 నకిలీ బిల్లులు

తాజా వార్తలు

Updated : 02/06/2021 08:39 IST

Crime News: 4గంటల్లో 5,911 నకిలీ బిల్లులు

  రూ.111 కోట్ల విలువైన ఆభరణాలు విక్రయించినట్లు సృష్టి
  రద్దయిన నోట్ల అక్రమ మార్పిడి కేసులో ఈడీ తుది అభియోగ పత్రం

ఈనాడు, హైదరాబాద్‌: రద్దయిన పెద్ద నోట్ల అక్రమ మార్పిడికి కుట్ర పన్నిన హైదరాబాద్‌లోని నగల సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోమవారం తుది అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ కుట్రలో ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జెవెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముసద్దిలాల్‌ జెవెల్లర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు కీలకపాత్ర పోషించినట్లు.. ఇందులో ఆయా సంస్థల నిర్వాహకులు కైలాష్‌ గుప్తా, నితిన్‌ గుప్తా, నిఖిల్‌ గుప్తా సహా 41 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. 2016 నవంబరు 8న రాత్రి 8 గంటల సమయంలో 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటల్లోపే రూ.111 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు విక్రయించినట్లు ఆ మూడు సంస్థల నిర్వాహకులు 5,911 నకిలీ రశీదులు సృష్టించారు. తద్వారా రూ.111 కోట్ల విలువైన రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. వాస్తవానికి ఆ నాలుగు గంటల్లో అంత పెద్దమొత్తంలో కొనుగోళ్లు జరగకపోయినా తమకు తెలిసిన ఇతర వ్యాపారులు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల దగ్గర సమీకరించిన నల్లధనాన్ని ఇలా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. అనంతరం ఆ సొమ్ము ద్వారా బంగారం కొనుగోలు చేయడంతో పాటు పన్నులు, బ్యాంకు రుణాలను చెల్లించారు. తర్వాత ఆ బంగారాన్నీ విక్రయించారు. తొలుత ఈ అక్రమ వ్యవహారంపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ఈడీ అక్రమార్జన ద్వారా కూడగట్టిన రూ.111 కోట్ల సొమ్ము మళ్లింపుపై ఆరా తీసింది. ఈ కుంభకోణం ద్వారా నిందితులు మొత్తం రూ.139 కోట్లు ఆర్జించినట్లు గుర్తించింది.
ఇప్పటికే రూ.130.57 కోట్ల ఆస్తుల జప్తు
2017, 2019లో ఈడీ నగల సంస్థలతోపాటు నిర్వాహకుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి రూ.86 కోట్ల విలువైన నగల్ని జప్తు చేసింది. రెండు విడతలుగా అభియోగ పత్రాలు నమోదు చేసింది. న్యాయస్థానం అనుమతితో గత ఫిబ్రవరి 1న ఆ నగలు సహా రూ.130.57 కోట్ల చర, స్థిరాస్తుల్ని జప్తు చేసింది. తాజాగా ముగ్గురు నిర్వాహకులు సహా నగదు మార్పిడిపై సలహాలు ఇచ్చిన చార్టర్డ్‌ అకౌంటెంట్లు, తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఆయా సంస్థల ద్వారా అక్రమంగా మార్పిడి చేయించిన గోల్డ్‌ బులియన్‌ వ్యాపారులు.. ఇలా మొత్తం 41 మందిపై అభియోగ పత్రం దాఖలు చేసింది. వీరంతా ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన సొమ్ముతో కొన్న ఆస్తుల్ని జప్తు చేసేందుకు ఇప్పటికే ఈడీ న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రొవిజినల్‌ అటాచ్‌మెంట్‌ ఆర్డర్లకు అనుమతి లభించింది. తాజా అభియోగ పత్రంలోని వివరాలను హైదరాబాద్‌ సీసీఎస్‌కూ పంపించినట్లు ఈడీ వర్గాలు  వెల్లడించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని