
తాజా వార్తలు
కొట్టాడని ప్రశ్నిస్తే చంపేశాడు
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ, పక్కన సీఐ, ఎస్ఐ
తిరుపతి(నేరవిభాగం): తిరుపతి లక్ష్మీపురంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి తూర్పు డీఎస్పీ తుపాకుల మురళీకృష్ణ, సీఐ బీవీ శివప్రసాద్ మంగళవారం స్టేషన్లో విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. లక్ష్మీపురానికి చెందిన శంకర్ అదే కాలనీకి చెందిన భరత్‌యాదవ్ మధ్య మనస్పర్థల కారణంగా ఆదివారం రాత్రి కొట్టాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, భరతయాదవ్ శంకర్ ఇంటికి వెళ్లి ఎందుకు కొట్టావని ప్రశ్నించారు. దీంతో ఆవేశానికి లోనైన శంకర్ తన ఇంట్లో ఉన్న కత్తితో భరత్‌యాదవ్ కడుపులో పొడిచి పారిపోయాడు. గాయపడ్డ భరత్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడన్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు శంకర్‌ను మంగళవారం తిరుపతి బస్టాండు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పద్మావతి కల్యాణ మండపాల పక్కన ఉన్న ముళ్లపొదల్లో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.