ప్రేమపేరుతో నమ్మించి మోసం

తాజా వార్తలు

Published : 09/07/2020 08:51 IST

ప్రేమపేరుతో నమ్మించి మోసం

● పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

● అతనికి సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు

నరసరావుపేట పట్టణం: ప్రేమపేరుతో నమ్మించి మోసం చేయడంతో పాటు బంగారం, డబ్బులు వసూలు చేశారని నరసరావుపేటకు చెందిన ఓ యువతి ముగ్గురిపై గ్రామీణ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన నరసరావుపేట పోలీసులు యువతిని మోసం చేసిన యువకుడితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ వీరారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నూజండ్ల మండలం జంగాలపల్లెకు చెందిన పులుకూరి శివానంద్‌ ప్రేమ పేరుతో నరసరావుపేటకు చెందిన ఓ యువతికి దగ్గరయ్యాడు. గతంలో ఇతను పట్టణంలోని పురుగుల మందుల దుకాణంలో పనిచేశాడు. లాక్‌డౌన్‌ అనంతరం ఉద్యోగం మానేశాడు. ఈనేపథ్యంలో ప్రేమ పేరుతో దగ్గరైన యువతిని నమ్మించి ఆమె వద్ద విడతల వారీగా సుమారు రెండు లక్షల నగదు, రూ.40వేల విలువైన బంగారం తీసుకున్నాడు. ఈ క్రమంలో శివానంద్‌కు ఈపూరు, రొంపిచర్ల పోలీస్‌ స్టేషన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు అయిన అప్పలనాయుడు, శ్రీను సహకరించారు. మోసపోయిన యువతి ఎస్పీని ఆశ్రయించటంతో శివానంద్‌ బాగోతం బయటపడింది. గతంలోనూ ఇతను ప్రేమపేరుతో ముగ్గులోకి దింపి పలువురు యువతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు శివానంద్‌కు కానిస్టేబుళ్లతోపాటు మరికొందరి సహకారం ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, కేసులో ప్రమేయం ఉన్న అందరిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని