close

తాజా వార్తలు

Published : 07/07/2020 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్షరాలను ఏమార్చి.. సొమ్మును ఊడ్చేసి!

నకిలీ వెబ్‌పోర్టళ్ల లింకులతో ఆఫర్ల వల
ఆసన్‌సోల్‌ నేరస్థులుగా పోలీసుల గుర్తింపు

హైదరాబాద్‌: ఆఫర్‌లో ఐఫోన్‌ను రూ.2,999కే విక్రయిస్తామంటూ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సెల్‌ఫోన్‌కు ప్రముఖ వెబ్పోర్టల్‌(నకిలీ) పేరుతో లింక్‌ వచ్చింది. రూ.80 వేల విలువైన ఆ ఫోన్‌ను తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ఉండటంతో ఉద్యోగి ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే ఆ లింక్‌ను క్లిక్‌ చేసి నగదు బదిలీ చేశారు. రోజులు గడిచినా ఐఫోన్‌ రాకపోయేసరికి ఆ వెబ్‌పోర్టల్‌లో తనిఖీ చేశాడు. తన పేరుతో ఎలాంటి లావాదేవీ జరగలేదని తేలింది. మోసపోయానని గ్రహించిన ఆ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రజల అవసరాలే ఆసరాగా సైబర్‌ నేరస్థులు కొత్త నేర విధానాలతో డబ్బు కొల్లగొడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌.. తదితర ప్రముఖ వెబ్‌పోర్టళ్లను పోలిన నకిలీ పోర్టళ్లను సృష్టించి ఆఫర్లలో తక్కువ ధరకే చరవాణులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఇస్తున్నట్లు పలువురి సెల్‌ఫోన్లకు లింకులను పంపిస్తున్నారు. ప్రముఖ వెబ్‌పోర్టళ్ల పేర్లలోని ఓ అక్షరాన్ని మార్చుతూ అవే డిజైన్లతో లింకులను రూపొందిస్తుండటంతో ప్రజలకు అనుమానాలు రావడం లేదు. దీంతో ఆ నకిలీ పోర్టళ్లలోని యూఆర్‌ఎల్‌ను క్లిక్‌ చేసి క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల ద్వారా డబ్బు పంపిస్తున్నారు. ఆ సొమ్ము నేరుగా నకిలీ వెబ్‌పోర్టల్‌ను సృష్టించిన నేరస్థుల ఖాతాలోకి వెళ్తుంది. ఆర్డర్‌ చేసిన వస్తువులు రోజులు గడిచినా రాకపోయేసరికి బాధితులు ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. చివరికి మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. బాధితుల నుంచి బదిలీ అయిన బ్యాంకు ఖాతాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. ఇది పశ్చిమ్‌బంగా రాష్ట్రంలోని ఆసన్‌సోల్‌ మోసగాళ్ల పనిగా గుర్తించారు.

అసలు వెబ్‌పోర్టళ్లలో తనిఖీ చేయాలి

సాధారణంగా వెబ్‌పోర్టళ్లు రాయితీ ప్రకటనల్ని సెల్‌ఫోన్లకు లింకుల రూపంలో పంపించవు. సంబంధిత వెబ్‌పోర్టళ్లలో మాత్రమే ఉంచుతాయి. లింకుల రూపంలో ప్రకటనలు వస్తే తప్పనిసరిగా అనుమానించాలి. అలాంటి ఆఫర్లు నిజమైనవేనా అని అసలు వెబ్‌పోర్టళ్లలో పరిశీలించి నిర్ధారించుకోవాలి.

-కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని