close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరణంలోనూ వీడని స్నేహబంధం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి
మరొకరికి తీవ్ర గాయాలు

ఆదివారం రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు సహా ఏడుగురు మరణించారు. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చారు.
చేవెళ్ల, న్యూస్‌టుడే: నలుగురూ కలిసి చదువుకున్నారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. సరదాగా కారులో వెళ్లిన వీరిని రోడ్డు ప్రమాదం కబళించింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విజయపుర జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సార నరేష్‌(30) బీటెక్‌ చేసి నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. గారెల రవీందర్‌(32) ప్రైవేటు ఉద్యోగి. ఎన్కతల రఘు(30) వికారాబాద్‌ జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌. నర్కుడ నవీన్‌(30) ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. వీరంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి(2005) కలిసి చదువుకున్నారు. ఆదివారం నరేష్‌ కారులో చేవెళ్లకు వచ్చారు. తిరిగి వెళుతుండగా మీర్జాగూడ గేటుకు సమీపంలో అతివేగంతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జవగా అందరూ ఇరుక్కుపోయారు. చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్సై రేణుకారెడ్డి ఘటనాస్థలికి చేరుకుని అరగంట శ్రమించి వారిని బయటకు తీయించారు. అప్పటికే నరేష్‌, రవీందర్‌, రఘు మృతి చెందారు. నవీన్‌కు రెండు కాళ్లు విరగడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ఆలూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివాహమై ఏడాది తిరక్కముందే..
రఘుకు ఏడాది క్రితమే వివాహమైంది. భార్య ఎనిమిది నెలల గర్భవతి. అన్న, తమ్ముడు సైతం పోలీసు శాఖలోనే పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు రఘు కారు నడుపుతున్నాడు. మిగిలిన వారికెవరికీ వివాహాలు కాలేదు.  ఈ ప్రమాదానికి మద్యం తాగడమూ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నలుగురు గ్రామంలోనే ఉన్నారు. చేవెళ్లలో మద్యం తీసుకొని మార్గం మధ్యలో రోడ్డు పక్కన పొలాల్లో తాగినట్లు తెలిసింది.


రక్తమోడిన రహదారులు
ఉద్యోగంలో చేరేలోపు మృత్యు ఒడికి..

జవహర్‌నగర్‌: యాప్రాల్‌ వాసి ఆకాశ్‌రెడ్డి(24), సైనిక్‌పురి ఈశ్వరపురికాలనీ వాసి వీఎస్‌ కృష్ణవర్మ(24) స్నేహితులు. శనివారం రాత్రి బైకుపై స్నేహితుడి జన్మదిన వేడుకకు కౌకూరు వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగివస్తుండగా బ్రైట్‌ వ్యూ బహుళ అంతస్తుల సముదాయం ఎదురుగా రోడ్డుపై కారు ఢీకొట్టింది. ఇద్దరినీ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కృష్ణవర్మ మృతిచెందాడు. గాయపడిన ఆకాశ్‌ను సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎంబీఏ చేసిన కుమారుడు ఈనెల 9న ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమయ్యాడని ఈలోగా చనిపోయాడని తల్లిదండ్రులు విలపించారు. జవహర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


వ్యాన్‌ ఢీకొని మరొకరు..

రెజిమెంటల్‌బజార్‌: మౌలాలి హౌసింగ్‌బోర్డుకు చెందిన టి.ధనచారి(58) కార్పెంటర్‌. ఆదివారం బైకుపై చింతల్‌లోని చుట్టాల ఇంటికి వెళ్తుండగా సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ ప్రాంతంలో డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. తలకు గాయమై మృతిచెందాడు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం లారీ బోల్తా.. కీసర: బడంగ్‌పేట్‌ అల్మాస్‌గూడకు చెందిన అబ్దుల్‌ మిజాద్‌(34) ఆదివారం సంగారెడ్డి నుంచి లారీలో మద్యం లోడుతో కీసర మండలం బోగారంలోని లిక్కర్‌ గోదాంకు వస్తుండగా, తిమ్మాయిపల్లి వద్ద లారీ బోల్తా పడింది.  తీవ్ర గాయాలపాలైన అబ్దుల్‌ ఘటనా స్థలిలోనే మృతి చెందాడని కీసర పోలీసులు తెలిపారు.


వృద్ధుణ్ని బలిగొన్న లారీ

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: తార్నాక డివిజన్‌లోని లాలాపేటలో జీహెచ్‌ఎంసీ లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాంనగర్‌ నుంచి ఏఆర్‌.ఇమ్మాన్యూల్‌(82) ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. లాలాపేటలో వేగంగా వచ్చిన జీహెచ్‌ఎంసీ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.