భరత్‌పూర్‌ నేరగాళ్ల సవాల్‌!

తాజా వార్తలు

Updated : 26/02/2020 07:37 IST

భరత్‌పూర్‌ నేరగాళ్ల సవాల్‌!

తెలంగాణ పోలీసులకు తలనొప్పిగా సైబర్‌ క్రిమినల్స్‌
‘ఓఎల్‌ఎక్స్‌’ వెబ్‌సైట్‌ ముసుగులో 4వేల మందికి టోకరా
పట్టుకునేందుకు వెళితే ఆయుధాలతో దాడులకూ సిద్ధం
ఈనాడు, హైదరాబాద్‌

ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకే వాహనాలను విక్రయిస్తామంటూ జరిగే ఆన్‌లైన్‌ మోసాలకు పెట్టింది పేరు భరత్‌పూర్‌ ముఠాలు. రాజస్థాన్‌కు చెందిన ఈ ముఠాలు సైబర్‌ నేరాలతో రెచ్చిపోతున్న తీరు తెలంగాణ పోలీసుల్ని కలవరపెడుతోంది. ఆర్మీ అధికారుల పేరిట ఐడీ కార్డులను ప్రకటనల్లో ఉంచడంతో పాటు ఆర్మీ దుస్తులు ధరించి మరీ ఉచ్చులోకి లాగుతుండటంతో నిత్యం పదుల సంఖ్యలోనే బాధితులు ఈ నేరగాళ్ల బారిన పడుతున్నారు. గత ఏడాది కాలంలోనే సుమారు 4వేల మంది వరకు బాధితుల నుంచి దాదాపు రూ. 13కోట్లు కొల్లగొట్టారీ ఘరానా నేరగాళ్లు. దర్యాప్తు క్రమంలో భరత్‌పూర్‌ నేరగాళ్ల పనే అని తెలుతున్నా.. అక్కడికి వెళ్లి వారిని గుర్తించగలుగుతున్నా అరెస్ట్‌ చేసి తీసుకురావడం తెలంగాణ పోలీసులకు కనాకష్టంగా మారుతోంది.

భాగ్యనగరంపై తరచూ విరుచుకుపడే అంతర్రాష్ట్ర దొంగల్లో అత్యధికం ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవే. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, దిల్లీ, హరియాణా.. తదితర రాష్ట్రాల్లోని పలు తెగలకు చెందిన ముఠాలు కీలకం. ఈ కోవలోనివే రాజస్థాన్‌ రాష్ట్రం భరత్‌పూర్‌ జిల్లాలోని డీగ్‌, కమాన్‌, జుర్హెరా, గోగూర్‌ అంతర్రాష్ట్ర ముఠాలు. జుర్హెరా ఠాణా పరిధిలో 60 గ్రామాలుంటే 52 గ్రామాల్లో నేరస్థుల ముఠాలదే హవా. ఔరంగజేబు హయాంలో బలవంతంగా మత మార్పిడులకు గురైన మేవ్‌ తెగలకు చెందినవారే ప్రస్తుతం పంథా మార్చి ఈ నేర కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని దర్యాప్తు క్రమంలో పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతాలకు సరైన రహదారి సదుపాయమూ అరుదే. ఒకవేళ పోలీసులు అక్కడికి వెళ్లాలన్నా కచ్చా రోడ్లు, బురద గుంటల్లో ప్రయాణించక తప్పదు. ఈ క్రమంలో దొంగల స్వస్థలాలకు వెళ్లి పట్టుకురావడం పోలీసులకు సాహసంతో కూడుకున్న పనే. గతంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా అక్కడికి వెళ్లినా పెద్దగా ఫలితం లేక పోయింది.

నేరస్థులు 6 వేల మంది.. దొరికింది నలుగురే
ఇటీవల కాలంలో ఓఎల్‌ఎక్స్‌ వేదికగా మోసాలు విపరీతంగా పెరిగాయి. ఒక్క 2019 ఏడాదిలోనే మూడు కమిషనరేట్ల పరిధిలో మోసగాళ్లు దాదాపు 4వేల మంది నుంచి ఏకంగా రూ. 13.35కోట్లు కొల్లగొట్టడం గమనార్హం. ఈ కేసుల్లో దాదాపు 6వేల మందికిపైగా నిందితులుంటారని అంచనా. ఇప్పటివరకు కేవలం నలుగురిని మాత్రమే పట్టుకురాగలిగారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇద్దరేసి చొప్పున నిందితులను అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారు.
హైదరాబాద్‌ పోలీసులు ఓ సారి గోగూర్‌ ప్రాంతానికి వెళ్లారు. ఊళ్లోకి వెళ్లి నేరస్థుల్ని పట్టుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో బ్యాంకు వద్ద మకాం వేశారు. ఖాతాలోనుంచి డబ్బు డ్రా చేసేందుకు వచ్చిన ఇద్దరిని పట్టుకొచ్చారు.
అక్కడి పోలీసులూ గ్రామాల్లోకి వెళ్లి నిందితుల్ని పట్టుకొచ్చే పరిస్థితి లేదు. కనీసం 200 మంది పోలీసులైతేనే బృందాలుగా ఏర్పడి వెళ్లాల్సి ఉంటుంది. తక్కువ మంది వెళ్తే దాడులకు గురవడం ఖాయం.

జుర్హెరాలో మనీమ్యూల్స్‌ సందడి
ఓఎల్‌ఎక్స్‌ మోసాల రూపంలో కొల్లగొట్టిన సొమ్మును సైబర్‌ నేరస్థులు మనీమ్యూల్స్‌(కమీషన్‌ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయించుకునే ఖాతాదారులు) ద్వారా సొంతం చేసుకుంటున్నారు. జుర్హెరాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుతోపాటు డీగ్‌, కమాన్‌ మండల కేంద్రాల్లోని ఎస్‌బీఐ శాఖల్లో ఈ తరహా మనీమ్యూల్స్‌ ఖాతాలు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకుగాను మనీమ్యూల్స్‌కు నేరస్థులు 15-20శాతం కమీషన్‌ ఇస్తున్నారు. ఇక్కడి పరిసరాల్లోని సుమారు 100 గ్రామాలకు ఆర్థిక లావాదేవీలు ఈ బ్యాంకుల ద్వారానే జరుగుతున్నా.. మనీమ్యూల్స్‌ ఖాతాల్లోకి వచ్చే నగదే అధికంగా ఉంటోందని దర్యాప్తులో వెల్లడైంది. పలు సందర్భాల్లో ఇక్కడి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ బృందాలు భరత్‌పూర్‌ వెళ్లినా కీలక నిందితులను పట్టుకురావడం గగనంగా మారింది. అక్కడి నేరస్థుల వద్ద నాటు తుపాకులు ఉండటం, గ్రామస్థుల మద్దతు కూడా ఉండటంతో అవసరమైతే దాడికి దిగేందుకు వెనకాడక పోవడమూ అవరోధంగా మారింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని