close

తాజా వార్తలు

వేసిన చొక్కా... మళ్లీ వేయని చోరుడు

రూ.3.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

లాలాపేట, న్యూస్‌టుడే:  వేసిన చొక్కా.. మళ్లీ వేయడు. ఖరీదైన వాటినే కొనుగోలు చేస్తాడు. అతను ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తో, వ్యాపారవేెత్తనో అనుకుంటారు. కానీ అతనో దొంగ. తాళాలు వేసిన గృహాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. అపహరించిన సొత్తును తాకట్టు పెట్టి ఆ డబ్బును ఖర్చు చేశాకే మళ్లీ చోరీకి పాల్పడుతాడు. పోలీసులకు చిక్కితే ఒంటిపై ఒక్క దెబ్బ పడకముందే నేరాలను ఒప్పేసుకుంటాడు. బుధవారం లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌లు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు చెందిన సతీష్‌కుమార్‌నాయుడు(44) తన 16వ ఏటా 1994లో ఇంటి నుంచి పారిపోయి నగరానికి వచ్చాడు. అప్పటి నుంచి జల్సాలను అలవాటుపడి చోరీల బాటను ఎంచుకున్నాడు. మొదటిసారి దొంగతనం చేసి జువైనల్‌ హోంకు వెళ్లి వచ్చాడు. తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. చోరీ ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన దుస్తులు, షూలు కొనేవాడు. చొక్కాలు, ప్యాంట్లను ఒక్కసారి మాత్రమే ధరించేవాడు. మిగిలిన నగదుతో విజయవాడ, వైజాగ్‌, తిరుపతి తదితర ప్రదేశాలకు వెళ్లి జల్సాలు చేసేవాడు. గత ఏడాది సెప్టెంబరు 17న జైలు నుంచి వచ్చాక అదే నెల 27న లాలాగూడ ప్రాంతంలో తాళం వేసిన ఇంట్లో చొరబడి 1.28 తులాల పుస్తెలతాడు, 3 గ్రాముల డైమండ్‌ రింగ్‌, 2 గ్రాముల బంగారు ఉంగరం, 1.5 తులాల బంగారు గొలుసు, మూడు చిన్న బంగారు ఉంగరాలు కలిపి మొత్తం 4 తులాల ఏడున్నర గ్రాముల బంగారం ఎత్తుకెళ్లాడు. వాటిని తాకట్టు పెట్టడానికి గాంధీ ఆసుపత్రి సమీపంలో భిక్షాటన చేసే మహిళ సహకారం తీసుకున్నాడు. ప్రైవేటు ఫైనాన్స్‌లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బు  ఖర్చయ్యాక మళ్లీ గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ చేసి 4 తులాల బంగారు ఆభరణాలను అపహరించి తద్వారా వచ్చిన నగదుతో వైజాగ్‌, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేశాడు. గోపాలపురం, చిలకలగూడ పరిధిలోనే నాలుగుసార్లు దొంగతనాలు చేశాడు. నగదు పూర్తిగా ఖర్చు అయ్యాకే మళ్లీ చోరీకి పాల్పడడం అతనికి అలవాటు. ఈ నెల 20న లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌లో చోరీ చేయడానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ నెల 21న మెట్టుగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా (సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. అతని నుంచి నాలుగు చేతి ఉంగరాలు, రెండు చెవి దుద్దులు, రెండు లాకెట్లు, ఒక గొలుసు, చిన్న చిన్న ఉంగరాలు కలిసి రూ.3.2 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలను, ఇత్తడి సామగ్రిని స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.