close

తాజా వార్తలు

ఏం పాపం చేశాము తల్లీ!

ఆత్మహత్య సంఘటనల్లో శిశువుల ఆత్మఘోష

ఈనాడు డిజిటల్‌, నాగర్‌కర్నూల్‌

‘నవమాసాలు మోసి కన్న మమ్మల్ని బయటి ప్రపంచం చూడకముందే చిదిమేస్తున్నారు. క్షణికావేశంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలతో మా ప్రాణాలు కూడా బలి పెడుతున్నారు. లాలించి.. పాలిస్తూ మధురమైన అమ్మ ప్రేమంటే ఏమిటో తెలియజేయాల్సిన మీరు అంతలోనే అంతమొందిస్తున్నారు. మేము ఏం పాపం చేశాము తల్లీ!’.. అంటూ కుటుంబ ఆత్మహత్యల సంఘటనల్లోని శిశువుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భర్తతో వివాదం, అత్తమామలతో గొడవల కారణంగా కొందరు గృహిణులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనల్లో కొందరు మహిళలు వారితోపాటు అభం శుభం తెలియని చిన్నారులను సైతం హత్య చేస్తున్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. మంటలకు ఆహుతైన రెండేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెతోపాటు ఆ ఇల్లాలు కూడా మృతిచెందిన సంఘటన ఎంతోమంది హృదయాలను కలచివేస్తోంది. కుటుంబ కలహాలతో తీసుకున్న నిర్ణయానికి అమాయకులైన చిన్నారులు సైతం బలయ్యారు. ఆత్మహత్య చేసుకోవడం నేరం అంటూ చట్టాలు పేర్కొంటున్నా.. క్షణికావేశంలో పిల్లల ప్రాణాలను సైతం హరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఏడాది కిందట నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తికి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో రెండేళ్ల, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో మరో కుమార్తె ప్రాణాలతో బయటపడింది. ఏడాదిన్నర కిందట నాగర్‌కర్నూల్‌ పట్టణానికి చెందిన మరో మహిళ కుటుంబసమస్యల నేపథ్యంలో ఇంట్లో ఫ్యానుకు మూడేళ్ల కుమారునికి ఉరేసి, తానూ ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వనపర్తి జిల్లా కిష్టగిరికి చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక కుమార్తెతో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా కొందరు మహిళలు వారికి ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులను తట్టుకోలేక వారితోపాటు వారి పిల్లలను సైతం హత్య చేసి, ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.

ఆత్మవిశ్వాసం అవసరం : ఆత్మహత్య చేసుకుంటే సాధించేది ఏమీ ఉండదు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి సంఘటనలకు పాల్పడరాదు. అసలు ఆ ఆలోచనే రావద్ధు బతికి సాధించాలన్న పట్టుదల ఉండాలి. కష్టనష్టాలను సవాలుగా తీసుకోగలిగే ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలో బలపడాలి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి పోలీస్‌స్టేషనులో మహిళల కోసం కౌన్సెలింగు కేంద్రాలు ఉన్నాయి. వాటిని మహిళలు ఉపయోగించుకోవాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలతోపాటు తమ ప్రాణాలను తీసుకోవడం సరైన నిర్ణయం కాదు.

- అపూర్వారావు, వనపర్తి ఎస్పీ


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.