
తాజా వార్తలు
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
ఎస్.కోట: కలకాలం తోడుగా ఉంటానని మాటిచ్చిన అతను భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. కష్ట, సుఖాల్లో అండగా ఉంటానని ప్రమాణం చేసిన అతను ఆమె వెంటే నడిచాడు. తుదిశ్వాస వరకూ వెన్నంటి ఉంటానని బాస చేసిన ఆ భర్త మరణంలో భార్యకు తోడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా ఎస్.కోటలోని పందిరప్పన్న కూడలిలో మనోహర్(56), సూర్య ప్రభావతి(47) దంపతులు నివాసం ఉంటున్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత సూర్య ప్రభావతికి గుండెపోటు రావడంతో భర్త మనోహర్ 108 వాహన సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మహిళను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్థరించారు.
మరణ వార్త విని భర్త మనోహర్, కుమారుడు రామ్ లిఖిత్ శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక అప్పటికే తీవ్ర వేదనతో ఉన్న భర్త మనోహర్.. ఈ సమచారాన్ని బంధువులకు చెబుదామని ఇంటి బయటికి వచ్చి ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధరించారు. మనోహర్ స్థానికంగా ఎల్.ఐ.సి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కుమారుడు డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు ఒక్కసారిగా మరణించడం స్థానికులను కలచివేసింది.
ఇవీ చదవండి..
యువతిపై దాడి చేసిన ఉన్మాది అరెస్టు