కుమార్తెలను రక్షించబోయి తల్లి కన్నుమూసింది!

తాజా వార్తలు

Published : 17/09/2020 01:29 IST

కుమార్తెలను రక్షించబోయి తల్లి కన్నుమూసింది!

వికారాబాద్‌ జిల్లాలో విషాద ఘటన

మర్పల్లి: వికారాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం ఓ ఇంట విషాదం నింపింది. కుమార్తెలతో కలిసి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ తల్లి మృతి చెందిన ఘటన మర్పల్లి మండల పరిధిలోని షాపూర్‌తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దశరథ్, అనితాబాయి(35)లకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఐదుగురు సంతానం. బుధవారం ఉదయం పత్తి పంటలో కలుపు తీయడానికి దశరత్‌, అనితతో పాటు ఐదుగురు పిల్లలు, మరో ముగ్గురు కలిపి మొత్తం 10 మంది ఆటోలో వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సాయంత్రం 4 గంటలకు భారీగా వర్షం కురిసింది. షాపూర్‌తండా సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోండటంతో కొంతసేపు నిరీక్షించారు. ఆ తర్వాత ఇంటి వద్ద పని ఉందని.. వెళ్దామంటూ అనిత తన భర్త దశరథ్‌కు చెప్పింది. 

దీంతో కుమారులు, తండ్రి దశరథ్‌..ఒకరికొకరు చేతులు పట్టుకొని వాగు దాటారు. ఆ తర్వాత కుమార్తెలు వీణాబాయి, బబ్లూబాయి చేతులు పట్టుకొని అనితాబాయి వాగు దాటుతున్న క్రమంలో కుమార్తెలు జారి వాగులో కొట్టుకుపోయారు. ఇద్దరు కుమార్తెలను కాపాడే ప్రయత్నంలో అనిత కూడా వాగులో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన దశరథ్.. వీణాబాయి, బబ్లూబాయిలను రక్షించాడు. అప్పటికే అనితబాయి సుమారు 200 మీటర్ల దూరం కొట్టుకుపోవడంతో స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి అనితను ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు గుర్తించారు. అనంతరం వాగు అవతల చిక్కుకున్న మిగతా ముగ్గురుని స్థానికులు తాడు సాయంతో దాటించారు. ఘటనా స్థలాన్ని మర్పల్లి ఎస్సై సతీష్ చేరుకుని వివరాలు సేకరించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని