
తాజా వార్తలు
మాజీ జడ్జి జస్టిస్ సి.ఎస్. కర్ణన్ అరెస్ట్!
చెన్నై: మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి.ఎస్. కర్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా జడ్జిలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఆరోపణలపై మూడు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. దీంతో పోలీసులు ఆయన్ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జస్టిస్ కర్ణన్ గతంలో మద్రాస్, కోల్‌కతా హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేశారు.
పదవీ విరమణ అనంతరం జడ్జిలపై అభ్యంతరకర వీడియో విడుదల చేసిన ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యాన్ని నిరసిస్తూ తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ సభ్యులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఏమిటని పోలీసులను ప్రశ్నించింది. తమిళనాడు డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్ వ్యక్తిగతంగా ఈ నెల 7న న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం కర్ణన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
2017లో కూడా కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు కర్ణన్‌కు ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జికి శిక్ష విధించడం ఇదే తొలిసారి.