నీళ్లు నింపి.. నిలువునా వంచించి

తాజా వార్తలు

Updated : 30/04/2021 11:06 IST

నీళ్లు నింపి.. నిలువునా వంచించి

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ పేరిట మోసం
ఓ వైద్యుడు, కాంపౌండర్‌ అరెస్టు

నిజామాబాద్‌ నేరవార్తలు, వైద్యవిభాగం, న్యూస్‌టుడే: రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లో కొందరు నీళ్లు నింపి వంచిస్తూ కరోనా బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరో రెండు ఘటనల్లో ఇవే ఇంజక్షన్లను విక్రయిస్తూ పోలీసులకు సిబ్బంది పట్టుబడ్డారు. ఈ మూడు ఘటనలూ ఒకే రోజు నిజామాబాద్‌లో జరగడం గమనార్హం. ఓ బాధితుడు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను సిఫార్సు చేయడంతో రోగి తాలుకా బంధువులు ఓ మధ్యవర్తి ద్వారా రూ.85 వేలకు 5 వయల్స్‌ కొనుగోలు చేశారు. ఆసుపత్రి సిబ్బందికి అప్పగించగా ఈ ఇంజక్షన్లపై వారికి అనుమానం వచ్చింది. ఆసుపత్రి వైద్యుడు పరిశీలించి వాటిలో నీళ్లు పోసినట్లు గుర్తించారు. వెంటనే బాధితులు ఒకటో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆన్‌కాల్‌ విధులు నిర్వహించే మరో వైద్యుడు సాయి కృష్ణమనాయుడు ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. శ్రీకాకుళంకు చెందిన ఇతను డబ్బు సంపాదించాలన్న ఆశతో ఖాళీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ సీసాల్లో సెలైన్‌ సీసాలోని నీళ్లు నింపి కాంపౌండర్‌ సతీష్‌గౌడ్‌ ద్వారా రోగులకు విక్రయించినట్లు సమాచారం. నీళ్లు నింపినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇటీవల నగరానికి వివిధ ఆసుపత్రులకు సరఫరా అయిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఓ ముఠా నల్లబజారులో విక్రయిస్తోంది. వీటిని మహారాష్ట్రకు తరలించిసొమ్ము చేసుకుంటోంది. ఒక్కో వయల్‌ను రూ.35వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముతోంది.

సొమ్ముల కోసం నల్లబజారులో..

నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గురువారం రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు నల్లబజారుకు తరలిస్తూ ఓ నర్సు పోలీసులకు పట్టుబడింది. ఔట్‌సోర్సింగ్‌ నర్సు ఎలిజిబెత్‌ అలియాస్‌ స్రవంతి గురువారం రెండు ఇంజక్షన్లను అక్రమంగా బయటకు తీసుకొచ్చి తన భర్త అరుణ్‌కు అప్పగించింది. అతను ఓ రోగి బంధువుకు రూ.89 వేలకు బేరం అమ్ముతుండగా పోలీసులు పట్టుకొన్నారు. అనంతరం నర్సును అరెస్టు చేశారు. మరో ఘటనలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న కిరణ్‌.. బయట వ్యక్తి సాయిలుతో కలిసి నాలుగు వయల్స్‌ను ఒక్కొక్కటి రూ.32 వేలకు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని