close
Published : 19/06/2020 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాబోయే భర్తను పరిచయం చేసిన నిహారిక

ఆయన ఎవరో, ఏం చేస్తారో తెలుసా?
సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకోబోతున్నారు. గురువారం నిహారిక ఓ వ్యక్తిని హత్తుకున్న ఫొటోను షేర్‌ చేసి, సర్‌ప్రైజ్‌ చేశారు. ఆ వ్యక్తి ముఖం మాత్రం చూపించలేదు. శుక్రవారం చైతన్యతో కలిసి ఉన్న ఫొటోల్ని షేర్‌ చేస్తూ.. ‘అతడు నావాడు..’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు రితూ వర్మ, సుశాంత్‌, నందిని రెడ్డి తదితరులు నటికి శుభాకాంక్షలు చెప్పారు.

చైతన్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కాబోయే సతీమణి ముద్దుపెట్టుకుంటున్న ఫొటోని షేర్‌ చేస్తూ.. ‘నిస్‌చై’ (నిహారిక+చైతన్య) అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

పెళ్లి గురించి నిహారికను ఆంగ్ల మీడియా ప్రశ్నించింది. దీనికి ఆమె బదులిస్తూ.. ‘అవును.. నా మిగిలిన జీవితాన్ని గడిపేందుకు కావాల్సిన వ్యక్తి దొరికాడు. మాకింకా నిశ్చితార్థం జరగలేదు. పెళ్లి కుదిరిందని చెప్పడానికే సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశా. నేను చాలా థ్రిల్‌లో ఉన్నా’ అని చెప్పారు. అనంతరం పెళ్లి కుమారుడి గురించి అడగగా.. ‘ఇప్పుడు దీనికి మించి ఏమీ చెప్పను. ఓ అద్భుతమైన ప్రయాణానికి ఇది ఆరంభమని ఆశిస్తున్నా. కరోనా కష్ట సమయంలో ఇది మాకు శుభవార్త’ అని నిహారిక పేర్కొన్నారు.

చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ చేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు. ఆయన హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు ఆయనకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట.

ఈ సందర్భంగా గుంటూరు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌‌ ఆఫ్‌ పోలీసు జె. ప్రభాకర్‌ రావుని మీడియా పలకరించగా.. ‘ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. పిల్లలకు గతంలో పరిచయం లేదు. ఇటీవల నిహారిక కుటుంబాన్ని కలిశాం. ఇద్దరూ సరైన జంటగా భావించి, పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు. ఆగస్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనున్నట్లు సమచారం.

‘ఒక మనసు’ సినిమాతో నిహారిక కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో నాగశౌర్యకు జంటగా నటించారు. 2016లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఆపై ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో  కనిపించారు. ఇటీవల చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. మరోపక్క పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిహారిక దాని ద్వారా పలు వెబ్‌ సిరీస్‌లు తీశారు.

 Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని