close
కొత్త సినిమాలు
మేకప్‌ వేసుకుంటే నన్ను నేను మర్చిపోతా!

ఈ సినిమా చేయడానికి కారణం రాజమౌళి బాహుబలి చిత్రమే!

 ఎవరెన్ని విజయాలు సాధించిన మేము అసూయ పడం: పవన్‌కల్యాణ్‌

ఘనంగా ‘సైరా’ప్రీరిలీజ్‌ వేడుక

‘‘సైరా’లాంటి కథను సినిమాగా తీయాలంటే మొదటి నుంచి చివరి వరకూ గుర్రాలపై కత్తి యుద్ధాలు చేస్తూ ఉండాలి. ఎంతకష్టమో అది అనుభవిస్తే కానీ, తెలియదు. అయితే ఒక్కసారి మేకప్‌ వేసుకుని కత్తి, డాలు పట్టుకుని గుర్రం ఎక్కితే, నన్ను నేను మర్చిపోతా. నా వయసు మర్చిపోతాను. నాకు గుర్తొచ్చేది నా అభిమానులు, ఇమేజ్‌ మాత్రమే. 25ఏళ్ల కిందట ఏ జోష్‌ ఉందో అదే నన్ను ఆవహిస్తుంది’’ అని అన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ  చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతోందంటే అందుకు నా అభిమానులే కారణం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సెప్టెంబరు 22. నా జీవితంలో అద్భుతమైన ల్యాండ్‌ మార్క్‌. 1978 ఇదే రోజున నా మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. ఆ రోజు సినిమా ప్రజల ముందుకు వెళ్తోంది. చూసిన తర్వాత ఎలా తీసుకుంటారు. అనే భయాలు, ఉద్విగ్నతలు నాలో ఉన్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి అనుభూతిని ఫీలవుతున్నా. అందుకు కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ‘సైరా’. సాధారణంగా కథ అనుకున్న తర్వాత దాన్ని అల్లుకుంటూ వెళ్తాం. కానీ, ఇది అలా కాదు. పుష్కరకాలం కన్నా నా కోసం ఎదురు చూసిన పాత్ర ఇది. స్వాతంత్ర్య సమరయోధుల కథ చేయాలనుకున్నప్పుడు నాకు భగత్‌సింగ్‌ చేయాలని ఉండేది. ఏ దర్శకుడూ, కథా రచయిత ఆ పాత్రను నా దగ్గరకు ఎవరూ తీసుకురాలేదు. అటువంటి సమయంలో పరుచూరి బ్రదర్స్‌ ‘ఉయ్యాలవాడ’ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఈ పాత్రలో ఎన్నో కోణాలు ఉన్నాయని చెప్పారు. అప్పటినుంచి అడుగుతూనే ఉన్నారు. రెండు మూడు జిల్లాల వాళ్లకు తప్ప ఉయ్యాలవాడ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. చిన్న చిన్న పుస్తకాలు, బుర్రకథలు, ఒగ్గు కథలు ఉన్నాయి తప్ప ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కానీ, కథ విన్న తర్వాత ‘ఇంత గొప్ప యోధుడు ప్రపంచానికి తెలియకుండా కనుమరుగైపోయాడనిపించింది’. అందుకే సినిమా తీయడం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నా. 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు మంగల్‌పాండే గురించి తెలుసు. ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయ్‌ గురించి తెలుసు. ఆ తర్వాత భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, గాంధీల గురించి తెలుసు. కానీ, ఉయ్యాలవాడ గురించి తెలియదు. అందుకే పరుచూరి బ్రదర్స్‌ కథను మళ్లీ చెప్పగానే వెంటనే ఒప్పుకొన్నా.’’

‘‘మా ముందు ఉన్న పెద్ద సవాల్‌ బడ్జెట్‌. ఇంత భారీ బడ్జెట్‌ పెట్టి ఎవరూ సినిమా తీయడానికి ముందుకు రాలేదు. అయితే, మాకు పరోక్షంగా దారి చూపిన వ్యక్తి రాజమౌళి. భారీ బడ్జెట్‌తో ‘బాహుబలి’ తీసి అందరికీ మార్గనిర్దేశం చేశారు. ఆ ధైర్యంతో ‘సైరా’మొదలు పెట్టాం. ఇప్పటివరకూ నేను ఆయనకు ఒక విషయం చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నా.. ఆయనకు హ్యాట్సాఫ్‌. ఆ తర్వాత చరణ్‌ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ రిస్క్‌ ఏదో మనమే తీసుకుందామని  చెప్పాడు. నేను ‘సై’ అన్నా. అయితే, ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేయాలి? అనుకున్నప్పుడు పరుచూరి బ్రదర్స్‌ నన్ను దర్శకత్వం చేయమన్నారు. ‘ఇదొక ప్రత్యేక బాధ్యత’ అని చెప్పా. ఆ తర్వాత చరణ్‌ సురేందర్‌రెడ్డి పేరు చెప్పాడు. ‘ధ్రువ’ చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఇదే విషయాన్ని ఆయనకు చెబితే, ఎగిరి గంతేస్తాడని అనుకున్నా. కానీ, ‘నాకు వారం అవకాశం ఇవ్వండి’ అని వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన చేస్తానని చెప్పాడు. సినిమా కోసం ఆయన కూడా రాయలసీమకు వెళ్లి పరిశోధన చేసి ఆ తర్వాత కథను తనదైన శైలిలో తీర్చిదిద్దారు. సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత నాకు భయం వేసింది. ఎందుకంటే, సినిమా మొత్తం గుర్రాలపై, కత్తియుద్ధాలు చేస్తూ ఉండాలి. డూప్‌తో చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే అన్నీ సొంతంగా నేనే చేశా. నా నుంచి నటన రాబట్టుకున్నారు’’

‘‘చాలా తక్కువ సినిమాలే చిత్ర పరిశ్రమకు గౌరవం తీసుకొస్తాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు తెలిసిన అలాంటి చిత్రం ‘శంకరాభరణం’. ఆ తర్వాత ‘బాహుబలి’. ఇక్కడ గుర్తొంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. నేను ఏ చిత్ర విజయంతోనూ పోల్చడం లేదు. కేవలం గౌరవంతోనే. కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తే  యువతకు చేరువ అవుతుందని అనుకున్నాం. తను కూడా చేయడానికి ఒప్పుకొన్నాడు. పరిచయ సన్నివేశాలతో పాటు, చివర్లో రెండు నిమిషాలు ఆయన గొంతు వినిపిస్తుంది. అది యువతపై విశేష ప్రభావం చూపుతుంది. ఇలాంటి రాజుల చిత్రం యువతకు నచ్చుతుందా? అని కొందరు అడిగారు. నిజం చెప్పాలంటే ఇది యూత్‌ సినిమా. పాటలు, డ్యాన్స్‌లు లేకపోవచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ   కనెక్ట్‌ అవుతారు. ఎందరో మహానుభావుల త్యాగఫలితం ఈ స్వాతంత్ర్యం. దాని గురించి యువత తెలుసుకోవాలి. ప్రతి భారతీయుడు గర్వించే సినిమా. ఇంత గొప్ప సినిమాను చరణ్‌ తీయడం నిజంగా అభినందనీయం. సురేందర్‌రెడ్డి కోరుకున్న ప్రతిదాన్ని రామ్‌చరణ్‌ ఇచ్చాడు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌సేతుపతి, సుదీప్‌ ఇలా ఎవరిని అడిగినా వారితో చేయించాడు. నెలన్నర రోజుల పాటు జార్జియాలో షూటింగ్‌ చేశాం. ఆ ఒక్క ఎపిసోడ్‌ కోసమే దాదాపు 75కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో లాభాపేక్ష లేదు’’

‘‘అమితాబ్‌ బచ్చన్‌గారు పెద్ద మనసుతో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారు. ఇతర భాషల్లో చేయని ఆయన ఫోన్‌కాల్‌ చేయగానే ఈ పాత్ర ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. సుదీప్‌ కన్నడలో సూపర్‌స్టార్‌. నిడివితో సంబంధం లేకుండా ఈ పాత్ర ఒప్పుకొన్నాడు. విజయ్‌ సేతుపతి చాలా బిజీ ఆర్టిస్ట్‌. రెండు మూడేళ్ల వరకూ ఆయనకు డేట్స్‌ ఖాళీ లేవు. అయినా, వెంటనే ఒప్పుకొన్నారు. ఇక జగపతిబాబు పాత్రకు మిమ్మల్ని అలరిస్తుంది. ఆ పాత్రలో భిన్న కోణాలు ఉన్నాయి.  రత్నవేలు ఈ సినిమాను విజువల్‌ వండర్‌లా తీర్చిదిద్దారు. ఈ చిత్రకోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు’’ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా.

చిరు అనుభవనాన్ని ఎవరూ బద్దలు కొట్టలేరు!
ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సైరా’ ప్రీరిలీజ్‌ వేడుకకు అతిథిగా రావడం నా అదృష్టం. చిరంజీవి నాకు అన్నయ్య అయినా కూడా నేను ఒక అభిమానినే. సినీ పరిశ్రమలో పోటీతత్వం ఉంది. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. మీరు నాపై ఇంత అభిమానం చూపిస్తున్నారంటే.. అది ఆయన నేర్పిన పాఠం. ఇంటర్మీడియట్‌ నేను సరిగా చదవలేకపోయినందుకు మా అన్నయ్య దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా. ఆ సమయంలో మా వదిన, చిన్న అన్నయ్య.. చిరంజీవిగారి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆయన ఇచ్చిన భరోసా వల్లే నేను ఇప్పుడు మీ ముందు ఉన్నా. అలాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఉంటే ఎవరూ ఆత్మహత్య చేసుకోరు. స్వార్థం చూసుకోకుండా కోట్లు ఖర్చుపెట్టి అద్భుతమైన చిత్రాన్ని రామ్‌చరణ్‌ తీశాడు. భారతదేశం తాలుకూ గొప్పదనం తెలియజేసే చిత్రమిది. ప్రపంచ దేశాలు మనపై దాడి చేశాయి కానీ, ఏనాడూ భారత్‌ ఇతర దేశాలపై దాడి చేయలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలాంటి వ్యక్తుల సమూహం ఈ భారతదేశం. ఆనాటి నాయకులు ఎన్నో త్యాగాలు చేస్తే మనం ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం. అలాంటి చరిత్రను సురేందర్‌రెడ్డి తీయడం నిజంగా అద్భుతం. పరుచూరి బ్రదర్స్‌ రెండు దశాబ్దాల పాటు ఈ కథను మోశారు. ‘ఉయ్యాలవాడ అంటే చిరంజీవిగారే గుర్తొస్తారు’ అని ఈ కథను ఎవరితోనూ చేయలేదు. ఎంతమంది వచ్చి రికార్డులు బద్దలు కొట్టినా, చిరంజీవిగారి అనుభవాన్ని ఎవరూ బద్దలు కొట్టలేరు. చాలా రోజుల తర్వాత అన్నయ్య సినిమాకు నా గొంతు ఇచ్చాను. సాయి మాధవ్‌ అద్భుతమైన డైలాగ్‌లు రాశారు. స్వాతంత్ర్యయోధుల త్యాగ్యాన్ని గుర్తించేలా తీశారు. నా దేశం కోసం.. నా ప్రజల కోసం తీసిన సినిమా ఇది. అందుకే ‘సైరా’కు నా గొంతు ఇచ్చా. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా, మేము అసూయ పడం. ఎందుకంటే మేమంతా సినిమా జాతి’’ అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘మొదట పరుచూరి సోదరులకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్లు ఎన్నో ఏళ్లు ఈ కథను గుండెల్లో మోశారు. ఇన్నేళ్ల తర్వాత మా హీరో రామ్‌చరణ్‌ దాన్ని నెరవేరుస్తున్నాడు. ఇది ఆయన తండ్రికి మాత్రమే ఇచ్చే గిఫ్ట్‌ కాదు.. మొత్తం తెలుగువారికి ఇచ్చే బహుమతి. బాహుబలిలో 300 వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌లు ఉంటే, ఇందులో 3500 షాట్‌లు ఉన్నాయి. ఎమోషన్స్‌ క్యారీ చేస్తు ఇన్ని షాట్స్‌ పెట్టడం నిజంగా గ్రేట్. సురేందర్‌రెడ్డి అద్భుతంగా తీశారు. చిరంజీవిగారిని దర్శకత్వం చేసే అవకాశం చిన్న సన్నివేశం ద్వారా వచ్చింది. ‘మగధీర’ సమయంలో చిరంజీవిని దర్శకత్వం చేస్తుంటే, ఆయనే హీరోలా ఫీలయ్యేవారు. ‘ఇన్ని సినిమాలు చేసిన నేను ఇలాంటి సినిమా తీయలేకపోయా’ అని నాతో అన్నారు. కానీ, ‘సైరా’తో ఆయన కోరిక తీరింది’’ 

‘‘ఈ సినిమా కోసం 250రోజులు అందరం కుటుంబంలా పనిచేశాం. చిరంజీవిగారి కలల ప్రాజెక్టును నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఏ విషయంలో రాజీపడకుండా రామ్‌చరణ్‌ అన్ని విధాలా సహకరించడం వల్లే ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది’’ -దర్శకుడు సురేందర్‌రెడ్డి

‘‘తెలుగు సినిమా రారాజు మా అన్నయ్య చిరంజీవి. ఒక్కో షాట్‌ చూస్తుంటే ఆయన ఉగ్ర నరసింహుడిలా ఉన్నారు. ఆయన కెరీర్‌లో ఇదో అరుదైన అద్భుతమైన చిత్రం అవుతుంది’’-దర్శకుడు వి.వి.వినాయక్‌

‘‘షూటింగ్‌ మధ్యలో ఉండగా కొన్ని రషెస్‌ చూశా. చిత్రీకరణలో దశలో ఉండగా, భారీ అంచనాలు ఉన్న చిత్రమిది. ఇలాంటి దృశ్యకావ్యాన్ని తీయడానికి సురేందర్‌రెడ్డికి అవకాశం రావడం నిజంగా ఆయన అదృష్టం. సాధారణంగా కొడుకు హీరో అయితే, తండ్రి సినిమాలు తీస్తారు. కానీ, అందుకు భిన్నంగా తండ్రి హీరోను చేసి ఒక కొడుకు తీసిన సినిమా ఇది. ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’- దర్శకుడు కొరటాల శివ

‘‘ట్రైలర్‌ చూస్తే మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించింది. అందరి కొడుకులకు చరణ్‌ స్ఫూర్తి’’-సాయిధరమ్‌ తేజ్‌

‘‘చిరంజీవిగారు 150 సినిమాలు చేసినా, ఇలాంటి చిత్రాన్ని చేయలేదు. ‘సైరా’ నరసింహారెడ్డి చూసి చిరంజీవి అభిమానులే కాదు. ప్రతి భారతీయుడు గర్వపడతాడు’’ -వరుణ్‌తేజ్‌

‘‘వర్షం పడుతున్నా అభిమానులు ఇలా ఉండి మెగాస్టార్‌ పవర్‌ ఏంటో చెప్పారు. ఈ సినిమా మొట్టమొదటి ప్రేక్షకుడిని నేను. చూసిన తర్వాత కింద పడిపోయాను. సూపర్‌హిట్‌. సినిమా చాలా భయంతో చూశా. చాలా రోజుల కింద కథ విన్నాను. ఎలా తీశారా? అనిపించింది. ‘సైరా’ చూసిన వెంటనే వెళ్లి చిరుని ఆలింగనం చేసుకున్నా. ఇన్ని సినిమాలు తీసిన నేను ఇలాంటి గొప్ప చిత్రం ఎందుకు చేయలేదానని బాధపడిపోయా. సినిమా తప్పకుండా మీరూ చూడండి’’-నిర్మాత అల్లు అరవింద్‌

‘‘ఈ సినిమాపై చిరంజీవిగారికి చాలా నమ్మకం ఉంది. గాంధీ జయంతి సందర్భంగా ఆరోజే పుడుతున్న ‘సైరా’ను పెంచి పెద్ద చేసే బాధ్యత మీదే. కిందిస్థాయి వారిని కూడా ఎలా చూసుకోవాలో రామ్‌చరణ్‌లాంటి నిర్మాతకు మాత్రమే తెలుసు. ఈ సినిమా సందర్భంగా చిరంజీవిగారితో ఎక్కువసేపు గడిపే అవకాశం లభించింది’’-నటుడు జగపతిబాబు

‘‘తెలుగులో నా మొదటి చిత్రం చిరంజీవిగారితో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేందర్‌రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్‌లకు ధన్యవాదాలు’’-విజయ్‌ సేతుపతి

 

 

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.