close
సినిమా రివ్యూ
రివ్యూ: రాగ‌ల 24 గంట‌ల్లో

సినిమా: రాగల 24 గంటల్లో...

న‌టీన‌టులు: సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, ‘అదిరే’ అభి తదితరులు

కథ: వై.శ్రీనివాస్ వర్మ

మాటలు: కృష్ణభగవాన్

సంగీతం: రఘు కుంచె

సాహిత్యం: భాస్కరభట్ల, శ్రీమణి

ఛాయాగ్రహ‌ణం: గరుడవేగ అంజి

నిర్మాత‌: శ్రీనివాస్ కానూరు

దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి

సంస్థ: శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌

విడుద‌ల‌: 22-11-2019

హాస్య ప్రధాన‌మైన చిత్రాలతో విజ‌యాలు అందుకున్న ద‌ర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి. ‘ఢ‌మ‌రుకం’తో ఆయ‌న స్థాయి మ‌రింత పెరిగింది.  చాలా కాలం త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అదే.. ‘రాగ‌ల 24 గంట‌ల్లో...’. మ‌రి ఈ చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురి చేసిందా? లేదా? 

క‌థేంటంటే: ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో శిక్ష అనుభ‌విస్తున్న ముగ్గురు నేర‌స్థులు జైలు నుంచి త‌ప్పించుకుంటారు. వాళ్లని ప‌ట్టుకునేందుకు ఏసీపీ న‌ర‌సింహ (శ్రీరామ్‌) రంగంలోకి దిగుతాడు. ఇంత‌లో ఆ ముగ్గురు నిందితులు విద్య (ఈషారెబ్బా) ఇంట్లోకి చొర‌బ‌డ‌తారు. పోలీసులు వ‌స్తున్నార‌నే భ‌యంతో ఆ ఇంట్లో ఒక వార్డ్‌రోబ్‌లో దాక్కునేందుకు వెళ్లిన ఆ ముగ్గురికీ అందులో రాహుల్ (స‌త్యదేవ్‌) శ‌వం క‌నిపిస్తుంది. ఈ శ‌వం ఎవ‌రిద‌ని విద్యని అడిగితే త‌ను నా భ‌ర్తే అని చెబుతుంది. ఒక అనాథ అమ్మాయి అయిన విద్యని ప్రేమించి ,పెళ్లి చేసుకున్న రాహుల్‌ని భార్యే ఎందుకు చంపింది? ఆ విష‌యం తెలిశాక ఆ ముగ్గురు ఏం చేశారు? వాళ్లు అత్యాచారం చేసిన ఆ అమ్మాయి ఎవ‌రు? ఆ ముగ్గురు నిందితుల‌కీ, రాహుల్‌కీ సంబంధ‌మేమైనా ఉందా? తదిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: థ్రిల్లర్ సినిమాల‌కి క‌థ ఎంత ముఖ్యమో... క‌థ‌నం అంత‌కంటే  కీల‌కం. త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? అస‌లు నిందితులు ఎవ‌రు? అనే ఉత్సుక‌త ఆద్యంతం కొన‌సాగాలి. ఆ క్రమంలో ర‌క‌ర‌కాల ఊహల్ని ప్రేక్షకుల్లో రేకెత్తించాలి. అప్పుడే ఆ క‌థ‌లు ర‌క్తిక‌ట్టిస్తాయి. ఈ విష‌యంలో ఈ చిత్రం కొద్ది మేర‌కు మంచి ప్రభావ‌మే చూపించింది. కామెడీ చిత్రాల‌పై మంచి ప‌ట్టుని ప్రద‌ర్శించిన దర్శకుడు  శ్రీనివాస‌రెడ్డి, ఒక  థ్రిల్లర్‌ను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. అక్కడక్కడా సినిమాటిక్ లిబ‌ర్టీస్ తీసుకున్నట్టు, పాత్రల్ని తీర్చిదిద్దిన విధానంలో స‌హ‌జ‌త్వం లోపించిన‌ట్టు అనిపించినా... క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా మాత్రం ఆయ‌న ప‌నితీరు మెప్పిస్తుంది. ఆరంభ స‌న్నివేశాల‌తోనే ప్రేక్షకుడిని క‌థ‌లోకి తీసుకెళ్లారు. క‌ర‌డు గ‌ట్టిన నేర‌స్థుల‌కి ఒక అమ్మాయి ఇంట్లో అనుకోకుండా శవం క‌నిపించ‌డం, అది కూడా ఆ అమ్మాయే హ‌త్య చేశాన‌న‌డం ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ఆ త‌ర్వాత కూడా అదే గాఢ‌త కొన‌సాగాల్సి ఉండ‌గా...  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రాహుల్‌, విద్యల ప్రేమ‌, పెళ్లి నేప‌థ్యం థ్రిల్లింగ్ టెంపోని కాస్త త‌గ్గించిన‌ట్టైంది. క‌థ‌లో భాగంగానే ఆ స‌న్నివేశాలు రూపొందినప్పటికీ థ్రిల్లర్ సినిమాకి కావ‌ల్సిన వేగం అక్కడ తగ్గినట్లు అనిపిస్తుంది.

ద్వితీయార్ధంలో క‌థేమీ లేక‌పోవ‌డంతో దర్శకుడు మ‌లుపుల‌పైనే ఆధార‌ప‌డ్డారు. క‌థ‌నంలో భాగంగా వ‌చ్చే ఆ మ‌లుపులు సినిమాని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చేస్తాయి. రాహుల్‌ హ‌త్య విష‌యంలో విద్య మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టడం, ప‌రిశోధ‌న జ‌రుగుతుండ‌గానే కేసు గురించి విద్య ఏసీపీ ఇంటికి వెళ్లడం, అక్కడ తెలిసిన కొన్ని నిజాలతో చోటు చేసుకునే మ‌లుపులు ఆక‌ట్టుకుంటాయి. ముగ్గురు నిందితుల ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నా.. అక్కడ పాట పెట్టడం సినిమాకి మైన‌స్‌గా మారింది. సీరియ‌స్‌గా సాగే క‌థ‌కు స్పీడ్‌బ్రేక‌ర్లు వేసిన‌ట్టైంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి కీల‌కం. ఇందులో అస‌లు నిందితుడు ఎవ‌ర‌నేది చివ‌రి స‌న్నివేశాల్లో బ‌య‌టప‌డే విధానం మెప్పిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ఈషా రెబ్బా నాయికా ప్రాధాన్యమున్న పాత్రలో క‌నిపిస్తారు. స‌హ‌జమైన ఆమె అందం, అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. స‌త్యదేవ్ ప్రతినాయక ఛాయ‌ల‌తో కూడిన పాత్రలో చాలా బాగా నటించారు. ఏసీపీ న‌ర‌సింహ‌గా శ్రీరామ్ అభిన‌యం, ఆయ‌న పాత్ర కూడా సినిమాకి ప్రధాన‌ బ‌లం. ఈషా స్నేహితుడిగా గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్ అల‌రిస్తారు. మోడ‌ల్‌గా ముస్కాన్ సేథీ, ప‌క్కింటి అంకుల్‌గా కృష్ణ‌ భ‌గ‌వాన్, దాస్ పాత్రలో ర‌వివ‌ర్మ త‌దితరులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. ముగ్గురు నిందితులుగా న‌టించిన టెంప‌ర్ వంశీ, అజ‌య్‌, అనురాగ్‌ల పాత్రలు సినిమాకి కీల‌కం. సాంకేతికంగా ర‌ఘు కుంచె సంగీతం, అంజి కెమెరా ప‌నిత‌నం ప‌ర్వాలేద‌నిపిస్తాయి. న‌టుడు కృష్ణ‌ భ‌గ‌వాన్ రాసిన మాట‌ల్లో అక్కడక్కడా ఛమ‌క్కులు వినిపిస్తాయి. శ్రీనివాస్‌వ‌ర్మ క‌థ బాగుంది. దాన్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దడంలో ద‌ర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫ‌లితాల్నే ఇచ్చాయి.

బలాలు

+ క‌థ‌, క‌థ‌నం

+ ఈషా, స‌త్యదేవ్ న‌ట‌న

+ ద్వితీయార్ధంలో మ‌లుపులు

బ‌ల‌హీన‌త‌లు

- ఆశించిన స్థాయి థ్రిల్లింగ్ అంశాలు లేక‌పోవ‌డం

-  సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా..: ‘రాగ‌ల 24 గంట‌ల్లో’..  ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి రేకెత్తిస్తుంది!

గమనిక: ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది మాత్రమే. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.