close
అవీ.. ఇవీ..
రోడ్లు వేసి వెళ్లిపోయే శ్రీమంతుడు కాదు

సూపర్‌స్టారే కాదు.. సోషల్‌మీడియా స్టార్‌ కూడా..

చేయనంటే చేయనని చెట్టెక్కేశారు..

అమ్మాయిల కలల ‘రాజ కుమారుడు’ ఆయన..  అభిమానులకు ‘సూపర్‌స్టార్‌’ ఆయన.. నిజ జీవితంలో ‘శ్రీమంతుడు’. అందుకే గ్రామాల్ని దత్తత తీసుకుని రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోకుండా.. అక్కడి ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. ‘ఊరి నుంచి చాలా తీసుకున్నాం. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం’ అనేది పాలసీగా మారింది. పేరుకు సూపర్‌స్టారే అయినా.. చాలా వినయంగా ఉంటారు. వృత్తిపరంగా ఎప్పుడూ వివాదాల్లోనూ తలదూర్చలేదు. ఆయనే సూపర్‌స్టార్‌ కృష్ణ కుమారుడిగా వెండితెరకు పరిచయమై.. నేడు కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న మహేశ్‌బాబు. సోషల్‌మీడియాలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఓసారి చూద్దాం..

ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌

హేశ్‌కు సోషల్‌మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాను 53 లక్షల మందికిపైగా లైక్‌ చేశారు. ట్విటర్‌లో ఆయన్ను 8.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. మహేశ్‌ 25 మందిని ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.6 మిలియన్ల మంది మహేశ్‌ను ఫాలో అవుతుండగా.. 27 మందిని ఆయన ఫాలో అవుతున్నారు. 2018 జనవరి 25న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించారు. ‘భరత్‌ అనే నేను’ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఆయన లేకపోతే..

హేశ్‌ బాల్యం నుంచి పట్టాభి అనే వ్యక్తి ఆయనకు మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఆయన మహేశ్‌తోనే ఉన్నారు. పట్టాభితో చిన్నతనంలో దిగిన ఫొటోను మహేశ్‌ పంచుకున్నారు. ‘ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌తో ఫొటో దిగా. గత 24 ఏళ్లుగా ఆయన నాతో ఉన్నారు. ఆయన లేకపోతే నేను కెమెరా ముందు నిలబడలేను. ఈ ఫొటోను ఫొటోషాప్‌ చేయలేదు. నాకు ఇష్టమైన నీలిరంగు చొక్కాలో పట్టాభి’ అని గత ఏడాది పోస్ట్‌ చేశారు.

అచ్చం అమ్మలా..

న ముద్దుల కుమార్తె సితార చూసేందుకు అచ్చం తన తల్లి ఇందిరాదేవిలా ఉంటుందని ఓసారి మహేశ్‌ తెలిపారు. చిన్నారి ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘పింక్‌.. గర్ల్‌ పవర్‌. తన రూపం అచ్చం నా తల్లిలా ఉంది’ అని అన్నారు.

అమ్మ పుట్టినరోజున..

‘భరత్ అనే నేను’ సినిమాను మహేశ్‌ తన తల్లి పుట్టినరోజున విడుదల చేశారు. అప్పట్లో ఇందిరా దేవి పాత ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నా హృదయానికి దగ్గరైన, నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమాను మా అమ్మ పుట్టినరోజున విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. జన్మదిన శుభాకాంక్షలు అమ్మ’ అని మహేశ్‌ అన్నారు.

నమ్రతే ప్రపంచం..

‘నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నమ్రత’ అని మహేశ్‌ పలుమార్లు అన్నారు. తనను ప్రోత్సహించిన నమ్రతకు ‘భరత్ అనే నేను’ సక్సెస్‌ తర్వాత థాంక్స్‌ చెప్పారు. ఆమెను ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను షేర్‌ చేశారు. అంతేకాదు ఆయన స్నేహితురాలు కూడా నమ్రతేనట. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా మహేశ్‌ నమ్రతతో కలిసి గతంలో తీసుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ విష్‌ చేశారు. ఆమే తన ప్రపంచం అన్నారు.

ఫ్యామిలీ ఫస్ట్‌..

హేశ్‌ షూటింగ్‌ లేకపోతే తన సమయాన్ని కుటుంబం కోసమే కేటాయిస్తారు. విహారయాత్రలకు వెళ్తుంటారు. ‘సినిమా షూటింగ్‌ ఉంటే అదే నా లోకం. పేకప్‌ చెప్పాక భార్య, పిల్లల మీదే ధ్యాస. నేను జీవితాన్ని డిజైన్‌  చేసుకున్నాను’ అంటుంటారాయన. ‘ఫ్యామిలీ ఫస్ట్‌’ అంటూ నమ్రత, సితార, గౌతమ్‌ కలిసి ఉన్న ఫొటోను ఇటీవల షేర్‌ చేశారు.

రియల్‌ హీరో

కృష్ణ తన రియల్‌ హీరో అని మహేశ్‌ ఎప్పుడూ చెబుతుంటారు. తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నా రియల్‌ హీరో.. నా మార్గదర్శి.. నా పిల్లర్‌.. నా సర్వస్వం.. నేను మీ కుమారుడ్ని కావడం గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే నాన్న’ అని మహేశ్‌ ఆయనకు శుభాకంక్షలు చెప్పారు.

ఆమెకంటే హ్యాపీ అయ్యారట

106 ఏళ్ల వీరాభిమాని రేలంగి సత్యవతి గతేడాది నవంబరులో మహేశ్‌ కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఆ సమయంలో మహేశ్‌కు అంతులేని ఆనందం కలిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. పాత జనరేషన్‌కు చెందిన ఆమెకు తన సినిమాలు నచ్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సత్యవతిని కలిసినందుకు ఆమెకంటే ఎక్కువ ఆనందపడ్డానని చెప్పారు.

సామాజిక సేవ..

హేశ్‌ ఆంధ్రా హాస్పిటల్‌ సిబ్బంది సహాయంతో అనేక మంది చిన్నారులకు వైద్య సేవలు అందించారు. తాను దత్తత తీసుకుని, వైద్య సేవలకు సహకారం అందించిన చిన్నారుల గురించి మహేశ్‌ మాట్లాడుతూ.. ‘పిల్లలు సర్జరీ సమయంలో నా పేరు వినగానే సంతోషంగా ఫీల్‌ అవుతున్నారని ఆంధ్రా హాస్పిటల్‌ రామారావు గారు చెప్పారు. ఈ జీవితానికి ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్‌ ఏముంటుంది. పిల్లల జీవితాలను కాపాడటం చాలా గొప్ప విషయం’ అని అన్నారు.

మహేశ్‌తో మహేశ్‌..

సింగపూర్‌లోని మేడమ్‌ టుసాడ్స్‌ మ్యూజియంలో మహేశ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సిబ్బంది హైదరాబాద్‌కు తరలించి.. మహేశ్‌తో ఆవిష్కరించారు. ఆ సమయంలో మహేశ్‌ పోస్ట్‌ చేశారు. ‘వావ్‌.. దీన్ని చూసిన తర్వాత నా తొలి రియాక్షన్‌. మరో నన్ను చూసుకుని సర్‌ప్రైజ్‌ అయ్యా. దీనికన్నా సహజంగా విగ్రహాన్ని తయారు చేయడం కష్టం. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు చాలా సంతోషించారు’ అని అన్నారు.‌

30 ఏళ్ల తర్వాత..

హేశ్‌, విజయశాంతి కలిసి 1989లో నటించిన చిత్రం ‘కొడుకుదిద్దిన కాపురం’. ఇప్పుడు మళ్లీ  30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మహేశ్‌.. విజయశాంతితో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. పాత రోజులు గుర్తొస్తున్నాయని అన్నారు.

ఇష్టమైన చోటిదే..

స్విట్జర్లాండ్‌లోని స్విస్‌ ఆల్ఫ్స్‌ తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశమని నాలుగు రోజుల క్రితం మహేశ్‌ పోస్ట్‌ చేశారు. ట్రిప్‌లో తీసిన సెల్ఫీ షేర్‌ చేస్తూ.. ‘ఈ భూమిపైన నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇది. ది స్విస్‌ ఆల్ఫ్స్‌. నా కుటుంబంతో కలిసి షార్ట్‌ దసరా విరామాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా. పూర్తి ఎనర్జీ నింపుకొని సెట్‌లో అడుగుపెట్టబోతున్నా’ అని పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఇదే ప్రదేశం అంటే తనకు చాలా ఇష్టమని నమ్రత అన్నారు.

వైరల్..

ప్రముఖ మ్యాగజైన్‌ కోసం ఇటీవల మహేశ్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. కొత్త లుక్‌ చాలా బాగుందని నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఓ ఫొటోను మహేశ్‌ మంగళవారం షేర్‌ చేశారు. ‘ఎన్నో ఫొటోల్లో నాకు బాగా నచ్చిన ఫొటో ఇది. మీ అద్భుతమైన స్పందనకు థాంక్స్’ అని పేర్కొన్నారు.

మై సీతాపాప

సితార నైపుణ్యం చూసి మహేశ్‌ చాలాసార్లు గర్వంగా ఫీల్‌ అయ్యారు. ఓసారి పాప ‘బాహుబలి’ సినిమాలోని ‘మురిపాల ముకుందా..’ పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ‘ఎంత గొప్ప నైపుణ్యం’ అంటూ ప్రశంసించారు.

అల్లరి పిల్లవాడు.. చెట్టెక్కాడు

కృష్ణ తనయుడు కావడంతో మహేశ్‌కు బాల్యంలోనే నటించే అవకాశం సులభంగా వచ్చింది. పలు సినిమాల్లో బాలనటుడిగా చేసి, అలరించారు. నాలుగేళ్ల వయసులో దాసరి నారాయణ రావు తీసిన ‘నీడ’ (1979) సినిమాలో నటించారు. ఆపై కృష్ణ హీరోగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ‘పోరాటం’లో మహేశ్‌ కనిపించారు. ఈ సినిమాలో నటించేందుకు మహేశ్‌ను ఒప్పించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఓ సందర్భంలో కోడి రామకృష్ణ అన్నారు.

‘‘పోరాటం’ సెట్‌కు మహేశ్‌ వస్తుండేవాడు. ఈ సినిమాలో కృష్ణ చిన్న తమ్ముడు పాత్ర ఉంది. దానికి మహేశ్‌ బాగుంటాడు అనిపించింది. ‘కృష్ణ గారు మీ సోదరుడి పాత్రలో మహేశ్‌ను తీసుకుందామండి’ అని ఓ రోజు అడిగా. దానికి కృష్ణ నవ్వుతూ.. ‘అవునా.. వాడు అసలు ఎవరి మాట వినడు. వాడు ఒప్పుకోడు. నువ్వు కావాలంటే ఒప్పించుకో’ అన్నారు. నేను సరే అన్నా. అప్పుడు మహేశ్‌ సెట్‌లో ఉన్న ఓ చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్లి ‘బాబు నీకు సినిమాలో చేయాలని ఉందా?’ అని అడిగా. ‘లేదు’ అన్నాడు. ‘ఎందుకు’ అని అడిగా.. ‘సినిమాలంటే మనం జాగ్రత్తగా ఉండాలిగా. మా నాన్న గారిని చూస్తున్నాగా నేను’ అని చిన్నతనంలోనే అవగాహన ఉన్నట్లు అన్నాడు. ‘నీ పాత్ర బాగుంటుంది’ అని ఒప్పించబోయా. అంతే ‘నేను చేయను, నేను చేయను’ అంటూ చెట్టు ఎక్కేశాడు. తర్వాత ‘మీ నాన్న ముఖం నీకే ఉంది. నువ్వే తమ్ముడిగా సరిపోతావు’ అని ఒప్పించా. ‘పోరాటం’ సినిమాలో మహేశ్‌ పాత్ర బాగుంటుంది. మహేశ్‌ కళ్లజోడు పగిలిపోయే సీన్‌ ఉంటుంది.. దాన్ని చూస్తే ఇప్పటికీ మనకు ఏడుపు వస్తుంది’ అని ఆయన ఓ రోజు అన్నారు. ఆపై మహేశ్‌ బాలనటుడిగా దాదాపు ఏడు సినిమాల్లో నటించారు.

పాఠాలు నేర్చుకున్నా 

బాలనటుడిగా చేసిన తర్వాత మహేశ్ తొమ్మిదేళ్లు విరామం తీసుకున్నారు. చదువులు పూర్తి చేసుకుని ‘రాజకుమారుడు’ సినిమాతో 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటకీ ‘మురారి’ (2001) ఆయనకు బ్రేక్‌ ఇచ్చింది. ‘ఒక్కడు’ ఆయన్ను స్టార్‌ను చేసింది. ‘అతడు’తో ఆయన సినిమాలకు బాక్సాఫీసు వద్ద మంచి మార్కెట్‌ ఏర్పడింది. ‘పోకిరి’ రికార్డులు బ్రేక్‌ చేసి.. మహేశ్‌ను సూపర్‌స్టార్‌ను చేసింది. ‘దూకుడు’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ తదితర సినిమాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లలా నిలిచాయి. ‘గతంలో కథల విషయంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటున్నా. ఏదో అరగంట కథ వినేసి, ఎగ్జైట్‌ అయిపోయి సినిమా చేయడం సరికాదు. ఇప్పుడు నేను కనీసం మూడు గంటలు కథ వింటున్నా. నచ్చితే అప్పుడు సంతకం చేస్తా. ఇవి ఫెయిల్యూర్స్‌ నేర్పిన పాఠాలు’ అని చెబుతుంటారు మహేశ్‌.

-ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం

 

 

 Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.