close
అవీ.. ఇవీ..
రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయి..!

ముంబయిలో ఒంటరిగా ఎన్నో కష్టాలు!

అది 2017 ఆగస్టు 25.. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా విడుదలైంది. అప్పటి వరకు షాలినీ పాండే అంటే ఎవరో ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ, ఈ ఒక్క సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారామె. ఎంతో సహజంగా ఆమె పలికించిన హావభావాలు, భావోద్వేగాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమెకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. నటి కావాలన్న ఆమె కల ఎట్టకేలకు తీరింది. అయితే ఈ ప్రయాణానికి ముందు షాలిని ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. సోమవారం షాలినీ 25వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

 

ఇంజినీరింగ్‌పై ఆసక్తిలేక..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో షాలిని జన్మించారు. చిన్నతనం నుంచే నటి కావాలని ఆమె అనుకోలేదట. ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో ఆమెకు థియేటర్‌ స్టేజ్‌పై ఆసక్తి కలిగింది. నటనలో మెళకువలు నేర్చుకున్నారు. కానీ, నటి కావడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. తన తండ్రి ఆమెను ఇంజినీర్‌ చేయాలని ఆశపడ్డారు.  అయితే, షాలిని వారి మాట కాదని ముంబయికి వచ్చేశారు. అక్కడ తన ఇద్దరు స్నేహితులతో కలిసుంటూ.. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూశారు. ఒంటరిగా చిన్నపాటి పోరాటమే చేశారు. ఎన్నో రాత్రులు బాధతో భోజనం తినకుండా నిద్రపోయానని షాలిని పేర్కొన్నారు.

 

ఫోన్‌ వచ్చింది..

ఈ క్రమంలో షాలిని ఫొటోలు చూసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘అర్జున్‌ రెడ్డి’ కోసం ఆమెను సంప్రదించారు. ‘ఈ సినిమా కోసం నాకు ఫోన్‌ చేశారు. ఆ రోజును నేను జీవితంలో మర్చిపోలేను. నటిని కావాలని ముంబయికి వచ్చిన నా కలను ఇది నిజం చేసింది’ అని ఆమె అన్నారు.

పుస్తకాలంటే..

ఈ భామకు పుస్తక పఠనం అంటే చాలా ఆసక్తి. ‘ఓ రీడర్‌ వంద మంది జీవితాల్లో జీవించగలడు’ అని చెబుతుంటుంది. కొత్త పాత్రల గురించి, వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతానని ఆమె వరల్డ్‌ బుక్స్‌ డే రోజు సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. మీరు ఓ వ్యక్తికి సినిమా చూడమని సలహా ఇస్తారా?, పుస్తకం చదవమని చెబుతారా? అని ఆమెను అడిగితే పుస్తకానికే ఓటు వేశారు.

ఫిట్‌గా..

‘అర్జున్‌ రెడ్డి’లో ఈ భామ కాస్త బొద్దుగా కనిపించారు. ఆపై జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసి ఫిట్‌గా తయారయ్యారు. ఈ సందర్భంగా తీసిన పలు ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. వృత్తిపట్ల ఆమెకున్న అంకితభావానికి నెటిజన్లు మెచ్చుకున్నారు.

మీ లైఫ్‌ మీది..

‘మీ జీవితం మీది. మరొకరికి అవకాశం ఇవ్వకండి, ఆధారపడకండి. ఇక్కడ మీరే డైరెక్టర్‌, యాక్టర్‌. మీకు నచ్చినట్లు జీవించండి’ అంటూ జీవిత సత్యాలను చెబుతుంటుంది. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు తల్లి, తండ్రి, సోదరి, స్నేహితులు.. ఎవరైనా సరే వారికి దూరంగా ఉండండి’ అని కూడా ఆమె ఇటీవల ఓ పోస్ట్‌ చేశారు. ప్రేమలేని చోట ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

బోల్డ్ అన్నందుకు..

‘అర్జున్‌ రెడ్డి’ లాంటి బోల్డ్‌ సినిమాకు సంతకం చేసే ముందు ఓసారి ఆలోచించలేదా? అని ఓ నెటిజన్‌ షాలినిని అడిగితే, దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ముద్దు సన్నివేశాలు చూపించినంత మాత్రాన ఇది బోల్డ్‌ సినిమా కాదు. ముందు మీ ఆలోచనలు మారాలి. ప్రపంచాన్ని మీరు చూసే కోణం మారాలి. ఇలాంటివి సర్వసాధారణం. మనం బయట కూడా చూస్తున్నాం కదా’ అంటూ అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు.

కోలీవుడ్‌లో బిజీ

‘అర్జున్‌రెడ్డి’ తర్వాత వరుసగా తమిళ సినిమాల్లో బిజీ అయ్యారు ఈ బ్యూటీ. ఇటీవల తెలుగులో ‘మహానటి’, ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’లో అతిథి పాత్రల్లో కనిపించారు. కల్యాణ్‌ రామ్‌ సరసన ‘118’లో మెరిశారు. ప్రస్తుతం ‘100% కాదల్‌’, ‘అగ్ని సిరగుగల్‌’, ‘నిశ్శబ్దం’ సినిమాల్లో నటిస్తున్నారు.

షాలినీతో చిట్‌చాట్‌..
* ‘అర్జున్‌రెడ్డి’ని ఎన్ని సార్లు చూశారు?
షాలినీ: రెండుసార్లు అనుకుంటా. ఎందుకంటే.. నా సినిమాను నేను ఎక్కువసార్లు చూసుకుంటే బాగా కనెక్ట్‌ అయిపోతా.
* మీ గురించి అందరికీ తెలియని విషయం?
షాలినీ: నేను సూపర్‌ ప్రైవేట్‌. నా భావాల్ని తేలిగ్గా వ్యక్తపరచను.
* ‘అర్జున్‌ రెడ్డి’లో మీకు నచ్చిన సీన్‌?
షాలినీ: క్లైమాక్స్‌
* మీకు ఇష్టమైన ఫుడ్‌
షాలినీ: అన్నీ ఇష్టమే. జంక్ ఫుడ్‌ తినను.
* ఎలాంటి కాస్మోటిక్స్‌ వాడుతారు?
షాలినీ: నేను కాస్మోటిక్స్‌ పెద్దగా వాడను.


-ఇంటర్నెట్‌డెస్క్‌

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.