close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జజ్జనకరి జనారే

ఏం పిల్లడో ఎల్దమొస్తవా... జజ్జనకరి జనారే... యంత్రమెట్లా నడుస్తున్నదంటే... తదితర గీతాలతో సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు వంగపండు. ఆయన కలం నుంచి జాలువారిన గీతాలు ఎంతోమందిలో చైతన్యాన్ని రగిలించాయి. గొంతెత్తి ప్రశ్నించేలా చేశాయి. జానపదాలకి గజ్జెకట్టి ఆడిపాడిన వంగపండు జనాన్ని కదిలించారు. ఆయన పాటలపై సినిమా పరిశ్రమ కూడా అంతే ఇష్టం ప్రదర్శించింది. విప్లవ నేపథ్యమైనా, చైతన్యంరగిలించే కథలైనా... వంగపండు పాట వినిపిస్తేనే పరిపూర్ణం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు దర్శకనిర్మాతలు. మాదాల రంగారావు, టి.కృష్ణ, దాసరి నారాయణరావు, ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌.నారాయణమూర్తి తదితరులు దర్శకత్వం వహించిన సినిమాల్లో వంగపండు పాటలు రాశారు. 30కిపైగా సినిమా పాటలు రాసిన వంగపండు...ఆర్‌.నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ‘అర్ధరాత్రి స్వతంత్రం’, ‘ఆలోచించండి’, ‘భూపోరాటం’, ‘అడవి దివిటీలు’ సినిమాలకి మొత్తం పాటలు రాశారు. ‘చీమలదండు’, ‘ఎర్రసముద్రం’, ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాల్లోనూ వంగపండు రాసిన పాటలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి.


బహుముఖ ప్రజ్ఞాశాలి.. వంగపండు

- ఆర్‌.నారాయణ మూర్తి

‘‘వంగపండు ప్రసాదరావుతో నాకెంతో గొప్ప అనుబంధం ఉంది. నా తొలి చిత్రం ‘అర్ధరాత్రి స్వతంత్రం’కు ‘‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అనే అద్భుతమైన గీతం అందించి చిత్ర విజయంలో కీలక భూమిక పోషించార’’న్నారు నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి. ప్రముఖ విప్లవ కవి, గాయకుడు వంగపండు మృతిపట్ల సంతాపం తెలిపిన నారాయణ మూర్తి.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ‘‘వంగపండు నేను ఎన్నో కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచాం. ఆయన నా దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలకు పాటలు రాశారు. ‘విప్లవ శంఖం’, ‘రేపటి పౌరులు’, ‘పిచ్చోడి చేతిలో రాయి’ లాంటి మరో 30 విజయవంతమైన చిత్రాలకూ గీతాలు రాశారు. 80ఏళ్ల వయసులోనూ చుట్టూ ఉన్న సమస్యలపై స్పందిస్తూ.. పాటలు రాస్తూ, పాడుతూ అందరిలో పోరాట స్ఫూర్తి రగిలించిన గొప్ప గాయకుడు వంగపండు. వంగపండు, గద్దర్‌లను ‘నిజమైన ప్రజాకవుల’ని కీర్తించారు మహాకవి శ్రీశ్రీ. వంగపండు బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం పాటలు రాయడం, ఆలపించడం మాత్రమే కాదు.. ‘అడవి దివిటీలు’ అనే గొప్ప నాటకాన్ని, ‘భూమి భాగోతం’ అనే అద్భుత నృత్యరూపకాన్ని రచించారు. ఇందులో ‘అడవి దివిటీలు’ నాటకానికి ‘మా భూమి’ అంతటి పేరొచ్చింది. ఇంతటి గొప్ప మనిషి ఇప్పుడు ‘‘ఏం పిల్లడో పోయి వస్తను.. ఏం పిల్లో పోయి వస్తను. ఆకాశంలో చుక్కల్లోకి.. చుక్కల మధ్యనున్న చంద్రుడిలోకి’’ అంటూ వీడ్కోలు పలికారు. నిజంగా ఆయన మరణం ప్రపంచ కళా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు నారాయణ మూర్తి.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.