close
టాలీవుడ్‌
‘బాహుబలి’ లేకపోతే ‘సైరా’ లేదు

- చిరంజీవి

‘‘అప్పట్లో ‘శంకరాభరణం’ తెలుగువాళ్లందరికీ గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆ తరవాత ‘బాహుబలి’ మనమంతా కాలర్‌ ఎత్తుకునేలా చేసింది. ‘సైరా’ కూడా అంతే గౌరవాన్ని తీసుకొస్తుందని విశ్వాసం ఉంద’’న్నారు చిరంజీవి. ఆయన నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్‌ నిర్మాత. వచ్చే నెల 2న విడుదల కానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘సెప్టెంబరు 22 నా జీవితంలో ముఖ్యమైన రోజు. 1978లో ఇదే రోజున నా మొదటి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. అలాంటి ఉద్వేగం 41 సంవత్సరాల తరవాత అనుభవిస్తున్నాను. దానికి కారణం ఈ ‘సైరా’. భగత్‌ సింగ్‌లాంటి పాత్ర చేయాలని అనుకునేవాణ్ని. ఆ కోరిక ‘సైరా’ తీర్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి పెద్దగా తెలీదు. ఆయన కథ విన్న తరవాత దేశానికి తెలియాల్సిన వీరుడి కథ అనిపించింది. మేం అనుకున్నది అనుకున్నట్టు తీయాలంటే కనీసం రూ.60 - 70 కోట్లు అవుతాయి. కానీ అప్పటికి నా మార్కెట్‌ అంత లేదు. దాంతో ఆగిపోయింది. ‘సైరా’ ఇప్పుడు తెరపైకి వచ్చిందంటే దానికి కారణం రాజమౌళినే. ఆయన ‘బాహుబలి’ తీసి ఉండకపోతే ‘సైరా’ వచ్చి ఉండేది కాదు. దేశ వ్యాప్త మార్కెట్‌కు ఆయన ఓ దారి వేశారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాబట్టుకోవచ్చన్న భరోసా ఇచ్చిన వ్యక్తి. యదార్థగాధని వక్రీకరించకుండా వాణిజ్య అంశాలతో తెరకెక్కించాడు సురేందర్‌రెడ్డి. సినిమా అంతా కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలూ అంటే ఈ వయసులో చేయడం కష్టం అనిపించింది. నేనేమో డూప్‌ని ఒప్పుకోలేను. కానీ కత్తి, డాలు పట్టుకుని గుర్రం ఎక్కితే గనుక ఒళ్లు, వయసు మర్చిపోతాను. పాతికేళ్ల క్రితం ఉన్న జోష్‌ ఆవహిస్తుంది. ఇది యువతరం చూడాల్సిన సినిమా’’ అన్నారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ‘‘చరణ్‌ వాళ్ల నాన్నకే కాదు, తెలుగువారందరికీ ఇస్తున్న బహుమతి ఈ చిత్రం. ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘మగధీర’ కథా చర్చల్లో చిరంజీవి ఉన్నారు. ఆయన కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన కొన్ని సన్నివేశాల్ని నటించి చూపించేవారు. అప్పుడు అనిపించింది. ఈ కథలో చరణ్‌ని కాదు, ఆయన్నే హీరోగా ఊహించుకుంటున్నారని. ‘ఇలాంటి సినిమా నేనొక్కటీ చేయలేదు’ అని చెబుతుండేవారు ఆయన. ఆ కోరిక చరణ్‌ తీర్చాడ’’న్నారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘పోటీతత్వం ఉన్న పరిశ్రమ ఇది. ఇలాంటి చోట అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నయ్య. భారతదేశం గొప్పదనం తెలియజేసే సినిమా ఇది. మనదేశం ఎప్పుడూ వేరే దేశాలపై దాడి చేయలేదు. ప్రపంచదేశాలన్నీ మనపై దాడి చేశాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం ఈ దేశం. వాళ్లు ఎంత కష్టపడ్డారు? ఏం చేశారు? అనేది తెలియాలంటే ఇలాంటి చిత్రాలు రావాలి. ‘శుభలేఖ’లో తొలిసారి డబ్బింగ్‌ డైలాగ్‌ చెప్పాను. మళ్లీ నా గళం ‘సైరా’కే ఇచ్చాను’’ అన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘200 రోజులు కష్టపడి చేసిన సినిమా ఇది. సాంకేతిక నిపుణులు లేకపోతే ‘సైరా’ సాధ్యమయ్యేది కాదు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ కుటుంబంలా కలిసి పనిచేశాం. చిరంజీవిగారి కలల సినిమాని నా చేతుల్లో పెట్టినందుకు, నా వెనుకుండి ప్రోత్సహించినందుకు రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్‌, కొరటాల శివ, జగపతిబాబు, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, బుర్రా సాయిమాధవ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, రత్నవేలు, వైష్ణవ్‌ తేజ్‌, డా.వెంకటేశ్వరరావు, మెహర్‌ రమేష్‌, అల్లు అరవింద్‌, ఎన్వీ ప్రసాద్‌, శరత్‌మరార్‌, డివీవీ దానయ్య తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.