వెబ్‌ సిరీసుల్లోనూ సీక్వెల్స్‌ వస్తున్నాయ్‌! - upcoming web series sequels
close
Published : 23/07/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెబ్‌ సిరీసుల్లోనూ సీక్వెల్స్‌ వస్తున్నాయ్‌!

మొన్నటి వరకు సినిమాలకు సీక్వెల్స్‌ వచ్చేవి. ఇప్పుడు ఆ హవా వెబ్‌ సీరిసుల్లోకి వచ్చేసింది. గత ఏడాదిన్నరగా ఆమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జీ5 ఓటీటీల్లో అనేక వెబ్‌ సిరీస్‌లు వచ్చాయి.. వస్తున్నాయి. వీటిని నెటిజన్లూ బాగా ఆదరిస్తున్నారు. దీంతో తొలి సీజన్‌లో హిట్‌ సాధించిన పలు వెబ్‌ సిరీస్‌లకు ఇప్పుడు సీజన్‌- 2 పేరుతో సీక్వెల్స్‌ తీస్తున్నారు. వీటికోసం నెటిజన్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి సీక్వెల్‌గా వచ్చేందుకు సిద్ధమవుతున్న ఆ వెబ్‌సీరిస్‌లేవో ఓసారి మీరే చూడండి..

ఫ్యామిలీమ్యాన్‌-2 : అమెజాన్‌ ప్రైమ్‌

మనోజ్‌ బాజ్‌పేయీకి విలక్షణ నటుడిగా పేరుంది. పలు చలన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌.. వెబ్‌సీరిస్‌లో నటించడం మొదలు పెట్టాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ డ్రామా ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ 2019 సెప్టెంబర్‌లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడులైంది. శ్రీకాంత్‌ తివారి అనే ఓ మధ్య తరగతి వ్యక్తి నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)లోని ఓ విభాగంలో పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే ఒక ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లే ఇతి వృత్తంగా తొలి సిరీస్‌ ఉంటుంది. దీనికి రాజ్‌ అండ్‌ డి.కె దర్శకత్వం వహించారు. మనోజ్‌ భార్యగా ప్రియమణి నటించారు. తొలి సిరీస్‌ భారీ విజయాన్ని సాధించడమే కాదు.. అత్యధిక రేటింగ్‌ అందుకున్న వెబ్‌సిరీస్‌గా నిలిచింది. ఇప్పుడు ‘ఫ్యామిలీమ్యాన్‌-2’ తీస్తున్నారు. ఇందులో సమంత అక్కినేని నటిస్తుండటం విశేషం. ఈ వెబ్‌సిరీస్‌ త్వరలో విడుదల కానుంది. ఈ సారి మనోజ్ ఏ సవాల్‌ను ఎదుర్కొంటారో చూడాలి.


మీర్జాపూర్‌- 2: అమెజాన్‌ ప్రైమ్‌

మీర్జాపూర్‌ అనే ప్రాంతంలో అఖండానంద్‌ అనే మాఫియా డాన్‌ ఉంటాడు. అక్కడ ఆయన మాటే శాసనం. అలాంటి వ్యక్తి కుమారుడైన మున్నాకి.. ఓ సాధారణ లాయర్‌, ఆయన కుమారులు గుడ్డు, బబ్లూ మధ్య వైరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ‘మీర్జాపూర్‌’ కథ. అలీ ఫజల్‌, విక్రాంత్‌ మస్సీ, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్‌ థిల్లర్ వెబ్‌సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్‌ దర్శకుడు. 2018 నవంవర్‌లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన తొలి సీజన్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టడంతో ‘మీర్జాపూర్‌-2’ పట్టాలెక్కింది. త్వరలో ఇది విడుదల కానుంది. 


క్రిమినల్‌ జస్టిస్‌-2: డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో 2019 ఏప్రిల్‌లో ఈ వెబ్‌సిరీస్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. బ్రిటీష్‌ టీవీ సిరీస్‌ ‘క్రిమినల్‌ జస్టిస్‌’ ఆధారంగా దర్శకుడు తిగ్మంశు ధులియా దీనిని అదే పేరుతో హిందీలో తీశారు. ఆదిత్య అనే యువకుడు కార్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఓ రోజు సనయ అనే అమ్మాయిని కారులో ఎక్కించుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయితో గడుపుతాడు. తెల్లవారే సరికి సనయ రక్తపు మడుగులో పడి ఉంటుంది. దీంతో పోలీసులు ఆదిత్యను అరెస్టు చేశారు. అన్ని సాక్ష్యాధారాలు ఆదిత్యకు వ్యతిరేకంగా ఉంటాయి. మరి ఆ హత్య ఆదిత్య చేశాడా? లేదా? ఈ నేరంలో ఎవరికి న్యాయం జరిగింది? వంటి విషయాలు తొలిసిరీస్‌లో చూడొచ్చు. పంకజ్‌ త్రిపాఠి, విక్రాంత్‌ మస్సీ, జాకీష్రాఫ్‌ అనుప్రియ గోయింకా తదితరులు ప్రధాన భూమిక పోషించారు. ఈ సిరీస్‌ మంచి విజయాన్ని సాధించడంతోపాటు సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘క్రిమినల్‌ జస్టిస్‌-2’ రాబోతోంది. విడుదలకు సిద్ధంగానే ఉన్న ఈ సిరీస్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. తొలి సిరీస్‌ ఓ యువకుడి నేపథ్యంలో ఉండగా.. సీక్వెల్‌లో ఓ అమ్మాయి నేపథ్యంలో ఉంటుందని సమాచారం. 


హోస్టేజ్‌స్‌-2: డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

ఉత్కంఠ భరితంగా సాకే క్రైమ్‌ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ ఇది. మీరా ఆనంద్‌ అనే ఓ డాక్టర్‌ ముఖ్యమంత్రికి తరచూగా చికిత్స అందిస్తుంటుంది. ఈ క్రమంలోనే సీఎంకు ఓ రోజు ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. అంతకుముందు రాత్రే మీరా కుటుంబాన్ని కొందరు దుండగులు బందీలుగా చేసుకుంటారు. ముఖ్యమంత్రిని చంపేస్తేనే వదిలిపెడతామని బెదిరిస్తారు. మరి మీరా ఏం చేస్తుంది? సీఎంను చంపుతుందా? లేదా వృత్తి ధర్మానికి కట్టుబడి ఉంటుందా? తన కుటుంబానికి కాపాడుకుంటుందా? అనేది హోస్టేజెస్‌ తొలిసిరీస్ కథ. ఇందులో రోనిత్ రాయ్‌, టిస్కా చోప్రా, పర్వీన్‌ దబాస్ తదితరులు నటించారు. సుధీర్‌ మిశ్రా దర్శకత్వంలో 2019 మేలో వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘హోస్టేజెస్‌-2’ సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చేసేందుకు వెబ్‌సిరీస్‌ బృందం సన్నాహాలు చేస్తోంది. 


అభయ్‌-2: జీ5

ఇది కూడా క్రైమ్‌ థిల్లర్‌ వెబ్‌ సిరీసే. అభయ్‌ అనే ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. లఖ్‌నవూ శివారులోని చింతరి గ్రామంలో ఇద్దరు స్కూల్ పిల్లలు అపహరణకు గురవుతారు. వీరిని అభయ్‌ ఎలా కనిపెట్టాడు అనేది కథ. కెన్‌ ఘోష్‌ దర్శకత్వం వహించిన ‘అభయ్‌’లో పోలీస్‌ ఆఫీసర్‌గా కునాల్‌ ఖేము నటించాడు. 2019 ఫిబ్రవరిలో ఓటీటీ జీ5లో ఇది విడులైంది. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘అభయ్‌-2’ వస్తోంది. ఇందులో కూడా కునల్‌ ఖెమ్ము ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రామ్‌ కపూర్‌, చుంకీ  పాండే విలన్లుగా కనిపించబోతున్నారు. వచ్చే నెలలో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల చేయనున్నారు. 


మేడ్‌ ఇన్‌ హెవెన్‌-2: అమెజాన్‌ ప్రైమ్

మన దేశంలో వివాహ వేడుక అనేది ఓ సామాజిక సంప్రదాయం. ఎంత భారీగా వివాహం చేస్తే అంత గొప్ప అని ఫీలవుతుంటారు. ఈ వివాహ వేడుకల నేపథ్యంతోనే ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ తొలి సిరీస్‌ వచ్చింది. ఇందులో ప్రాధాన పాత్రలైన తారా, కరణ్‌ వెడ్డింగ్‌ ప్లానర్స్‌. ఇద్దరు కలిసి దిల్లీలో వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, తెలిసే రహస్యాలు, అనుభవాలతో సిరీస్‌ సాగుతుంటుంది. 2019 మార్చిలో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కు జోయా అక్తర్‌, రీమా కగ్తి కథను అందించారు. నిత్య మెహ్రా, జోయా అక్తర్, ప్రశాంత్‌ నాయర్‌, అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మంచి టాక్‌ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌-2’ రాబోతోంది. 


పాయిజన్‌-2: జీ5

2019 ఏప్రిల్‌లో విడుదలైన ‘పాయిజన్‌’ వెబ్‌సిరీస్‌ యాక్షన్‌-క్రైమ్‌-థ్రిల్లర్‌ ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకుంది. సల్మాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో తొలిసారి నటించాడు. ఈ వెబ్‌ సిరీస్‌ కథేంటంటే.. రణ్‌వీర్‌ అనే వ్యక్తి తను చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించి విడుదలవుతాడు. పగ తీర్చుకోవడం కోసం గోవా వెళ్తాడు. గోవాలోనే ఉండే ఓ డాన్‌ను పట్టుకోవడం కోసం డీఎస్పీ విక్రమ్‌ ప్రయత్నిస్తుంటాడు. ఈ ముగ్గురు మధ్య కథ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌గా ‘పాయిజన్‌-2’ సిద్ధమైంది. ఈ సీక్వెల్‌లో రాయ్‌లక్ష్మీ, పూజా చోప్రా, రాహుల్‌ దేవ్‌, అఫ్తాబ్‌ శివ్‌దాసాని తదితరులు నటిస్తున్నట్లు సమాచారం.


ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌-3: అమెజాన్‌ ప్రైమ్‌

క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలనే కాదు.. వెబ్‌సిరీస్‌లను సైతం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఓ టీ20 క్రికెట్ లీగ్‌లో ముంబయి మావేరిక్స్‌ జట్టు ఎదుర్కొనే సమస్యలు, యాజమాన్యాల ఆధిపత్య పోరు, లావాదేవీలు, చీకటి కోణాలు, రాజకీయాల నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ సాగుతుంది. ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌-2’లో ముంబయి మావేరిక్స్‌.. హరియాణా హరికేన్స్‌పై తలపడటంతోపాటు క్రికెట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందనేది కథ. ఇందులో వివేక్‌ ఒబేరాయ్‌, రిచా చద్దా, అంగద్ బేడీ, తనుజ్‌ విర్వాణి వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలో పోషించారు. 2017 జులైలో తొలి సీజన్‌ విడుదల కాగా... రెండో సీజన్‌ గత ఏడాది డిసెంబర్‌లో వచ్చింది. భారీ తారాగణం.. క్రికెట్‌ నేపథ్యం ఉండటంతో ఈ రెండు సీజన్లు మంచి విజయం సాధించాయి. దీంతో ఇప్పుడు మరో సీక్వెల్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌-3’సిద్ధం చేస్తున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని