close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 16/07/2020 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రష్మీ టామ్‌ బాయ్‌.. సుధీర్‌ అతిమంచితనం

టీవీ ఆన్‌ చేస్తే ఆ జోడీ డ్యాన్స్‌లు, జోకులు వినిపిస్తాయి. కనిపిస్తాయి!

యూట్యూబ్‌, వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేస్తే... వాళ్ల మీద రాసిన వార్తలే ఉంటాయి!

వాళ్లే బుల్లితెర స్టార్స్‌ సుధీర్‌.. రష్మీ!

‘జబర్దస్త్‌’తో ప్రతి ఇంట్లో వ్యక్తులుగా మారిపోయిన ఈ ఇద్దరి గురించి, వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి వాళ్లంతట వాళ్లు చెప్పిన సందర్భాలూ చాలా తక్కువ. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సుధీర్‌, రష్మీ ఇటీవల సెట్స్‌లో అడుగుపెట్టారు. లాక్‌డౌన్‌ ముచ్చట్లు, వాళ్ల సొంత విషయాల గురించి ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చి పంచుకున్నారు. 


అలీ: తొలిసారిగా మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు?

రష్మీ, సుధీర్‌: మేం తొలిసారి కలిసింది జబర్దస్త్‌ సెట్‌లోనే. అంతకుముందు మాకు పరిచయం లేదు. 


అలీ: లాక్‌డౌన్‌ మూడు నెలలు ఏం చేశావు?

రష్మీ: నేను వైజాగ్‌లో అమ్మతో చాలా సేఫ్‌గా ఉన్నాను. రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు బయటకు వచ్చేదాన్ని. ఆ సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేదాన్ని. అదికాకుండా నాకు వంట లాంటివి రావు కాబట్టి.... నేను  క్లీనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ చూసుకుంటే... అమ్మ ఎప్పటిలాగే వంట చేసేది. 

సుధీర్‌: ఇంట్లోనే ఉండి వర్కవుట్లు చేశాను. నాకు కావాల్సింది వండుకుని తినేవాణ్ని. బ్యాచిలర్‌ రూమ్స్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్న వంట... ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా మరోసారి చేశా. 


అలీ: లాక్‌డౌన్‌కు ముందు ఎప్పుడైనా నువ్వు వండి సెట్‌కి తీసుకొచ్చి పెట్టావా?

రష్మీ: షూటింగ్‌ సమయంలో సుధీర్‌ ‘అన్నపూర్ణ రావు’ లాంటివాడు. షెడ్యూల్‌ ఉన్నప్పుడు ఇంట్లో వండించి తీసుకొచ్చి అందరికీ పెట్టేవాడు. సుధీర్‌ చెల్లెలు రొయ్యల బిరియానీ బాగా వండుతారు. అది తీసుకొచ్చి సెట్‌లో పెట్టేవాడు. 

సుధీర్‌: నేను వండి ఎప్పుడూ తీసుకురాలేదు కానీ... ఎవరైనా ఏదైనా తిందాం అని చెబితే వండించి తెచ్చేవాణ్ని. సరదాగా అందరం కలసి కూర్చొని తినేవాళ్లం. ఇప్పుడు కరోనా కారణంగా వీలవడం లేదు. 


అలీ: గడ్డం ఎందుకు పెంచావ్‌.. షాపులు లేవనా?

సుధీర్‌: ‘కాలింగ్‌ సహస్ర’ అనే సినిమాలో పాత్ర కోసమే ఈ గడ్డం పెంచుతున్నాను.


 

సుధీర్‌: దేవుడు ప్రత్యక్షమై ‘మీరు మిస్‌ అయిన వాటిలో ఒకటి కోరుకో.. నేను ఇస్తాను’ అంటే ఏం కోరుకుంటారు?

అలీ: మా అమ్మను తిరిగి ఇవ్వమని కోరుకుంటాను. డబ్బయితే నాకు అవసరం లేదు... భగవంతుడు ఇచ్చాడు. ఇక పేరంటావా ప్రేక్షక దేవుళ్లు ఇచ్చారు. గౌరవం... నిర్మాతలు, దర్శకులు, ఈ సమాజం ఇచ్చింది. అందుకే దేవుడు వరమిస్తే నేను అమ్మను అడుగుతా. 
ఎక్కడెళ్లినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంబానీకి ఎంత ధనమున్నా వంద మందిలో పది మందే గుర్తుపడతారు. కానీ నీ దగ్గర కళ ఉంది... అందుకే వంద మందిలో నిన్ను 90 మంది గుర్తుపడతారు. ఇదంతా కళాకారుడు కావడం వల్లే.


అలీ: ఈ కరోనా టైమ్‌లో మనకు పెళ్లి అవ్వకుండా, అమ్మ కూడా లేకుండా ఉంటే ఏమైపోయేవాళ్లం?

సుధీర్‌: ఊహించుకోలేం. లాక్‌డౌన్‌ సమయంలో అమ్మను బాగా మిస్‌ అయ్యాను. అక్క దగ్గర ఉండటానికి అమ్మ లాక్‌డౌన్‌కి కొన్ని రోజులు ముందు కెనడా వెళ్లింది. దీంతో అక్కడే స్టక్‌ అయిపోయింది. లాక్‌డౌన్‌ అనౌన్స్‌ చేసిన తర్వాతి రోజే అక్కకు బాబు పుట్టాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లో అమ్మ ఇక్కడ ఉండుంటే బాగుండేది అని అనిపించింది. వరుస చిత్రీకరణల వల్ల అమ్మను చాలా రోజుల నుంచి మిస్‌ అవుతూ వచ్చాను. లాక్‌డౌన్‌లో అమ్మ ఉండుంటే... చక్కగా టైమ్‌ స్పెండ్‌ చేసేవాళ్లం అనిపించింది. ఇప్పుడూ అక్కడికి వెళ్లలేని పరిస్థితి. 

రష్మీ: లాక్‌డౌన్‌ ముందు నేను రాజమహేంద్రవరంలో ఉన్నాను. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం అక్కడి నుంచి ముంబయి వెళ్లాలి. కరోనా కారణంగా షూటింగ్స్‌ రద్దు అనే విషయం తెలియగానే..  నాకొచ్చిన తొలి ఆలోచనే ‘అమ్మ దగ్గరకు వెళ్లిపోవాలి’ అని. నా సామాన్లు ఎక్కడ, నాకేం అవసరం లాంటి విషయాలను పట్టించుకోకుండా అమ్మ దగ్గరకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ షూటింగ్స్‌ మొదలయ్యాక హైదరాబాద్‌ వచ్చాను. ప్రపంచంలో అమ్మను మించిన బలం, ధైర్యం వేరే ఏమీ లేదు. 


అలీ: లాక్‌డౌన్‌ సమయంలో చాలా విషయాలు తెలుసుకున్నట్లున్నావ్‌?

రష్మీ: ఇటీవల కాలంలో కొన్ని విషయాలు నా కళ్లు తెరిపించాయి. లాక్‌డౌన్‌ ముందువరకు మా ప్రపంచం అంటే షూటింగ్స్‌, ఇల్లు మాత్రమే. కానీ లాక్‌డౌన్‌ వల్ల ప్రజల ఆలోచనాసరళి గురించి తెలిసింది. కొవిడ్‌ మహమ్మారి లాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇంతలా ఆలోచిస్తారా అని షాక్‌ అయ్యాను. నేను ఏం చేసినా నెగిటివ్‌గా తీసుకున్నారు. 


అలీ: రష్మీ లాక్‌డౌన్‌ సమయంలో బాగా అభివృద్ధి చెందినట్లున్నావ్‌ కదా?

సుధీర్‌: రష్మీ పైకి చాలా బోల్డ్‌గా, ధైర్యంగా కనిపిస్తుంది కానీ... చాలా సున్నిత మనస్తత్వం ఉన్న మనిషి. మనసు చాలా మంచిది. పైకి కోపంగా ఉన్నట్లు, ఏదో యాటిట్యూడ్‌ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ చాలా సెన్సిటివ్‌. ఢీ షోలో ఏదైనా ఎమోషనల్ డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌ చేస్తే వెంటనే ఎమోషనల్‌ అయిపోతుంది. మామూలుగా అయితే టామ్‌ బాయ్‌. అస్సలు మాట్లాడలేం. ‘ఏంటి రష్మీ’ అని పలకరిస్తే... ‘ ఆ ఏంటి చెప్పు’ అని కటువుగా అంటుంది. దాంతో ఎందుకు బాబోయ్‌ అని నేను అటువైపు కూడా వెళ్లను. 


అలీ: రష్మీ... లాక్‌డౌన్‌లో నీ తెలుగు బాగా మెరుగైనట్లు ఉంది కదా? 

రష్మీ: లాక్‌డౌన్‌ టైమ్‌లో చాలా మందితో గొడవపడ్డాను. కుక్కలకు ఆహారం ఇవ్వడానికి నేను బయటకు వెళ్లినప్పుడు ... అక్కడున్న కొంతమంది వచ్చి ‘ఇక్కడ పెట్టకండి.. అక్కడ పెట్టకండి...’ అనేవారు. అప్పుడు నాకు కోపం వచ్చి ‘అవి  కావు జంతువులు... మీరు జంతువులు’ అని క్లాస్‌ పీకేదాన్ని.


అలీ: వాళ్ల మీద అంత కోపం ఎందుకొచ్చింది? 

రష్మీ: లాక్‌డౌన్‌ - కరోనా కారణంగా కుక్కలకు ఆహారం దొరికే పరిస్థితి లేదు.  నేను నా దగ్గర ఉన్న ఆహారం కుక్కలకు పెడుతుంటే... ‘చీమలొచ్చేస్తాయ్‌... కుక్కల ఇక్కడంతా చెత్త చేసేస్తాయ్‌’ అని అనేవారు. ఇవన్నీ చూసి చాలా కోపం వచ్చింది. వైద్యులు, పోలీసులు, శానిటైజేషన్‌ సిబ్బంది.. ఇలా అందరూ మా కోసం అంత కష్టపడుతున్నారు. అలాంటప్పుడు మేము ఆ చిన్న బాధ్యత తీసుకొని కుక్కలకు ఆహారం పెట్టకపోతే ఎలా అనిపించింది. అందుకే అదే చేశాను.


అలీ: మీ ఇద్దరిలో బెస్ట్‌ సింగర్‌ ఎవరు?

సుధీర్‌: రష్మీ మంచి సింగర్‌. నేను వరస్ట్‌ సింగర్‌. ‘అహ నా పెళ్లంట’ ఈవెంట్‌లో మేమిద్దరం కలసి ‘నిన్నే పెళ్లాడతా’లోని ‘కన్నుల్లో నీ రూపమే...’ పాట పాడాం. అప్పుడు రష్మీ నా కంటే 200 రెట్లు బాగా పాడింది. రికార్డింగ్‌ టైమ్‌లో ఆమెలోని ప్రొఫెషనల్‌ సింగర్‌ బయటకు వచ్చి... హావభావాలతో పాడింది. 


అలీ: మీకు నచ్చిన పాట ఏంటి? తెలుగులో? 

రష్మీ: ‘ఘరానా మొగుడు’లోని ‘ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్లు...’ అనే పాట అంటే ఇష్టం.  నా చిన్నప్పుడు మూడో తరగతిలో నేర్చుకున్న మొదటి తెలుగు పాట ఇది.  ఇలాంటి పాటల్లో ఓ మజా, కిక్‌ ఉంటాయి. 

సుధీర్‌: నాకు రొమాంటిక్‌ సాంగ్స్‌ అంటే ఇష్టం. ‘చెలి’ లోని ‘మనోహరా...’, ‘రోజా’లోని ‘పరువం వానగా..’ పాటలు చాలా ఇష్టం. ఆ రోజుల్లో క్యాసెట్‌ మొత్తం ఆ పాటల రికార్డింగ్‌ చేయించి అదే పనిగా వినేవాణ్ని. ఆ తర్వాత సీడీలు వచ్చాక మొత్తం సీడీ అంతా ఆ పాటే రికార్డ్‌ చేయించుకుని వినేవాణ్ని. 

రష్మీ:  సుధీర్‌ చాలా రొమాంటిక్‌. రొమాంటిక్‌ అనే డ్రమ్ము ఉంటే... అందులో సుధీర్‌ను భగవంతుడు ముంచి తీశాడు. సుధీర్‌లో రొమాంటిక్‌ యాంగిల్‌ చాలా బాగుంటుంది.  (నవ్వులు) కొంతమందిలో కోపం ఎక్కువ ఉంటుంది. కానీ సుధీర్‌ సున్నితమైన మనిషి. 


అలీ: మీ ఇద్దరి గురించి వెబ్‌సైట్స్‌లో కథలు కథలుగా రాస్తుంటారు.. వాళ్లకు మీరు చెప్పే సమాధానం ఏంటి?

సుధీర్‌: మా వల్ల వాళ్లకు ఏదో పని దొరుకుతుంది... డబ్బులు వస్తున్నాయి  కదా అని ఆనందంగా ఉంటుంది.  అలా రాయడం వల్ల వచ్చిన డబ్బుతో వాళ్ల కుటుంబం ఆనందంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. నిజంగా మా మధ్య ఏముందా? లేదా అనేది మాకు తెలుసు. 


అలీ: అలాంటి రాతల వల్ల మీ కుటుంబసభ్యులు బాధపడటం లేదు?

సుధీర్‌: అప్పుడెప్పుడో ‘సుధీర్‌ వాళ్ల ఇంట్లో విషాదం.. శోకసంద్రంలో రష్మీ’ అని రాశారు. ఇలా రాసినప్పుడు బాధగా అనిపిస్తుంది. 

రష్మీ: ఇంకా మా గురించి మంచిగా రాస్తున్నారనే చెప్పాలి. కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ చూస్తే...  ‘ఫలానా వ్యక్తి చనిపోయార’ని బతికుండగానే వార్తలు వస్తుంటాయి. మేం ఇంకా బెటర్‌ ఇలాంటి వార్తల్లో ఇంకా బతికే ఉన్నాం.


అలీ: టీవీ ఛానల్స్‌లో మీది హిట్‌ పెయిర్‌. మరి మీ ఇద్దరిని పెట్టి సినిమా తీస్తామని ఎవరూ సంప్రదించలేదా?

సుధీర్‌: చాలా మంది వచ్చారు... వస్తూనే ఉన్నారు. అయితే మంచి కథ కోసం వేచి చూస్తున్నాం. 

రష్మీ: ఇద్దరికీ సమాన ప్రాధాన్యమున్న కథ వస్తే కచ్చితంగా చేస్తాం. 


అలీ: రష్మీ... హీరోయిన్‌గా ఎన్ని సినిమాలు చేశావు?

రష్మీ: కొన్ని కొన్ని మరచిపోవాలని ఉంటుంది కదా... అందుకే గుర్తుంచుకోను. ఓ సినిమా నేను కష్టపడి చేసినా... అవతలి వ్యక్తి వల్ల సరిగా ఆడవు. అలాంటి సినిమాల్ని బ్యాడ్‌ మెమొరీస్‌గా ఆలోచలనల నుంచి తీసేస్తాను.


అలీ: సుధీర్‌.. లాక్‌డౌన్‌లో పెళ్లి గురించి ఆలోచించావా?

సుధీర్‌: పెళ్లి గురించి మా ఇంట్లోవాళ్లు చాలా ఆలోచించారు. ఈ మూడు నెలలూ ఎప్పుడు చూసినా నా పెళ్లి మాటలే. ఆఖరికి మా మేనకోడలుతో ‘సుధీర్‌ మామ... మేం ఇండియా రావాలంటే పెళ్లి చేసుకో’ అని చెప్పించారు. పెళ్లంటే ఇంట్రస్ట్‌ లేదని చాలాసార్లు చెప్పాను. ఏమవుద్దో ఏమో చూడాలి. 


సుధీర్‌ గురించి రష్మీ మార్కులు

హార్డ్‌ వర్కర్‌: 10/10

మంచితనం: 5.5/10 (సుధీర్‌కి అతిమంచితనం ఉంది. అప్పుడప్పుడు దాని వల్ల చిరాకు కూడా కలుగుతుంటుంది. ఒక్కోసారి మంచివాడేనా.. లేక నటిస్తున్నాడా అనిపిస్తుంటుంది. అతిమంచితనం ఒక్కోసారి ఇబ్బందిపెడుతుంది కూడా)

ఫ్రాంక్‌నెస్‌: 3/10 (మనిషికి ఒపీనియన్‌ ఉండదు. నాకు నెగిటివ్‌, పాజిటివ్‌ అని ఏదో ఒక ఒపీనియన్‌ ఉంటుంది. సుధీర్‌కి అది తక్కువ. ఏదైనా విషయంలో అభిప్రాయం అడిగితే.. ఏమో అని న్యూట్రల్‌గా ఉండిపోతాడు)

రొమాంటిక్‌ యాంగిల్‌: 100/10 (సుధీర్‌ను ఎవరు పెళ్లి చేసుకుంటారోగానీ.. తొలి ఆరు నెలలు జీవితాన్ని సినిమాటిక్‌గా చూపిస్తాడు. ఆ తర్వాత ‘మరీ ఇంత సినిమాటిక్‌ ఆ...’ అని  ఆ అమ్మాయికే చిరాకేస్తుంది.)

రష్మీ గురించి సుధీర్‌ మార్కులు

అందం: 10/10 (నేను ఈ విశ్వంలో చూసిన గొప్ప అందం రష్మీ)

స్టుపిడిటీ: 0/10

మంచితనం: 10/10

రొమాంటిక్‌ యాంగిల్‌: నాకు తెలియదు

కన్నింగ్‌ నెస్‌ : 0/10

హార్డ్‌ వర్క్‌: 10/10

హెల్పింగ్‌ నేచర్‌: 100/10 (జంతువులకు ఏమైతేనే తట్టుకోలేదు. అలాంటి మనుషులకు ఏమైనా అయితే ఇంకా బాగా పట్టించుకుంటుందిగా)


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.