కొత్త ఏడాదిలో సరికొత్త సినిమాలు.. వచ్చేస్తున్నాయ్‌ - telugu movies ready to release this sankrathi
close
Published : 01/01/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త ఏడాదిలో సరికొత్త సినిమాలు.. వచ్చేస్తున్నాయ్‌

సంక్రాంతి పండగ అంటేనే సందడి. అందులోనూ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కోడిపందేలు, ఎడ్లపందేలు, ఎగ్జిబిషన్లతో పాటు కొత్త సినిమాలు విడుదలకు ఇది అనువైన కాలం. ఇంటిల్లిపాదీ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తారు. అందుకే నిర్మాతలు, హీరోలు సంక్రాంతి బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతుంటారు. సంక్రాంతి హీరోగా నిలిస్తే వారికి అదొక గర్వకారణం. పైగా లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు ఇప్పుడు కొత్త సినిమాలతో మోత మోగించడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈసారి సంక్రాంతి బరిలో నిలువనున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దామా!

‘షకీలా’తో షురూ..

ఒకప్పుడు షకీలా సినిమాలంటే యువతలో విపరీతమైన క్రేజ్‌ ఉండేది. అడల్ట్‌ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న శృంగార తార. ఆమె జీవిత కథకు సినిమాగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిచాచద్దా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ‘మీర్జాపూర్‌’ ఫేమ్‌ పంకజ్‌ త్రిపాఠి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ అభిమానులను అలరిస్తోంది.

రెడీగా ఉన్న ‘రెడ్‌’

హీరో రామ్‌, దర్శకుడు కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌ ఎంతటి సూపర్‌హిట్టో అందరికీ తెలిసిందే. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’లతో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. తమిళ చిత్రం ‘తడమ్‌’ రీమేక్‌గా వీరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. గతంలో రామ్‌ నటించిన ‘దేవదాస్‌’, ‘మస్కా’ చిత్రాలు సంక్రాంతికి విడుదలైన అలరించాయి. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్‌తో మంచి జోరుమీదున్న రామ్‌ జనవరి 14న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

‘మాస్టర్‌’ థియేటర్ క్లాస్‌..

కోలీవుడ్‌ నుంచి కొత్త సంవత్సరంలో రానున్న అత్యంత క్రేజీ చిత్రం విజయ్‌ ‘మాస్టర్‌’. విజయ్‌సేతుపతి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినా లాక్‌డౌన్‌ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఓటీటీల నుంచి భారీ ఆఫర్‌ వచ్చినా తిరస్కరించి, జనవరి 13న ఈ ‘మాస్టర్‌’ థియేటర్‌లో క్లాస్‌ తీసుకోబోతున్నాడు. సంక్రాంతి పండగ సందడి మరింత డబుల్‌ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

థియేటర్‌ను ‘క్రాక్‌’ చేస్తానంటున్న రవితేజ

కథానాయకుడు రవితేజ వెండితెరపై ఎంత ఎనర్జీతో నటిస్తారో.. ఆయన సినిమా చూస్తున్న ప్రేక్షకుడు డబుల్‌ ఎనర్జీని పొందుతాడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పతంగుల పండగకు థియేటర్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, లిరికల్‌ ప్రోమోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ‘డాన్‌శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ-గోపీచంద్‌ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. పైగా రవితేజకు సంక్రాంతి సీజన్‌ కలిసొచ్చింది. గతంలో ఆయన నటించిన ‘కృష్ణ’ మంచి విజయాన్ని అందుకుంది.

సంక్రాంతికి అదరగొడతానంటున్న ‘అల్లుడు’

సంక్రాంతికి సందడి చేయబోతున్న మరో క్రేజీ చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో శ్రీనివాస్‌ బెల్లంకొండ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో సోనూసూద్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కూడా చాలా వేగంగా పూర్తిచేశారు. ప్రస్తుతం మంచి జోరు మీదున్న ముద్దగుమ్మ నభానటేష్‌తో అల్లుడుశీను ఆడిపాడనున్నాడు. ప్రకాష్‌రాజ్‌తో పాటు మరికొందరు సీనియర్ నటులు నటిస్తున్న ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో సందడి చేయనుంది.

వీటితో పాటు షకలక్‌ శంకర్‌ హీరోగా నటిస్తున్న ‘బొమ్మ అదిరింది..దిమ్మ తిరిగింది’ జనవరి 1న థియేటర్లో నవ్వులు పంచనుంది. అలాగే ఇప్పటికే ఓటీటీలో విడుదలై అలరించిన ‘డర్టీ హరీ’, ఒరేయ్‌ బుజ్జిగా, ‘వి’ చిత్రాలు మరోసారి ప్రేక్షకులను థియేటర్లలో పలకరించనున్నాయి.

ఇవీ చదవండి..

ఇది పోరాటం కాదు.. మహా సంగ్రామం..

సుహానాఖాన్‌ తళుక్కులు.. హన్సిక ఎదురుచూపులు

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని