హాలీవుడ్‌ యాక్షన్‌ మొదలైంది - story on hollywood movies
close
Published : 30/06/2021 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాలీవుడ్‌ యాక్షన్‌ మొదలైంది

కొవిడ్ ఆంక్షల కారణంగా టాలీవుడ్‌, బాలీవుడ్‌ పరిశ్రమలే కాదు, హాలీవుడ్‌ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనింది. ప్రస్తుతం అంతటా ఆంక్షలు ఎత్తివేయడంతో  అక్కడి దర్శకనిర్మాతలు చిత్రీకరణల బాట పడుతున్నారు.  భారీ యాక్షన్‌ సినిమాలైనా ‘అక్వామ్యాన్ 2’, ‘నైవ్స్‌ ఔట్ 2’‌, ‘జాన్‌ విక్‌4’ లాంటి బడా సినిమాలు ఒకే రోజు(జులై 28) సెట్లోకి అడుగుపెట్టాయి. ఈ భారీ యాక్షన్‌ చిత్రాల ప్రారంభంతో హాలీవుడ్‌లో  సందడి నెలకొంది. ఆగిపోయిన చిత్రాలు కూడా తిరిగి ధైర్యంగా షూటింగ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.  ఆ వివరాలు చూద్దాం. 

ఆక్వామ్యాన్‌ 2


జాసన్‌ మొమొవా నటించిన ‘ఆక్వామ్యాన్‌’ 2018లో ఘన విజయం సాధించిన సూపర్‌ హీరో చిత్రం. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డీసీ దీన్ని నిర్మించి భారీ వసూళ్లు సాధించింది. చైనాలోనూ విడుదలై మొదటి రెండు రోజుల్లోనే రూ.400 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.  ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. డీసీ నుంచి వచ్చిన యాక్షన్‌ ఫాంటసీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్రజీవిగా జాసన్‌ చేసిన యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. మొదటి సినిమాకు పనిచేసిన దర్శకుడు జేమ్స్‌ వాన్‌ రెండో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ 16న థియేటర్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

జాన్ విక్‌4


హాలీవుడ్ స్టైలిష్‌ యాక్షన్‌ చిత్రాల్లో ‘జాన్‌ విక్‌’ ఒకటి. కియాన్‌ రీవ్స్‌ యాక్షన్‌ హీరోగా అదిరిపోయేలా నటించిన ఈ సిరీస్‌లో ఇప్పటికి మూడు చిత్రాలు వచ్చాయి. అన్నీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సాధించినవే. ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న నాలుగో చిత్రం ‘జాన్‌ విక్‌: చాప్టర్‌ 4’ షూటింగ్‌ తాజాగా మొదలైంది. నిజానికి మూడో చిత్రం విడుదలైన కొన్ని వారాలకే షూట్‌ మొదలవ్వాల్సింది కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లయన్స్ గేట్ సామాజిక మాధ్యమాల్లో ఒక ఫొటోను షేర్‌ చేసింది. జపాన్‌తోపాటు బెర్లిన్‌, పారిస్‌ నగరాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది.  వచ్చే ఏడాది మే 27న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. 

నైవ్స్‌ ఔట్‌ 2


హాలీవుడ్‌ మర్డర్‌ మిస్టరీ చిత్రం ‘నైవ్స్‌ ఔట్‌2’ సీక్వెల్‌ తాజాగా గ్రీస్‌లో ప్రారంభమైంది. నైవ్స్‌ ఔట్‌ సిరీస్‌లో వస్తున్న రెండో చిత్రమిది. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రియాన్‌ జాన్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  జేమ్స్ బాండ్‌ సినిమాలతో అలరించిన డానియల్‌ క్రేగ్‌ ఇందులో ప్రైవేట్‌ డిటెక్టివ్‌గా నటిస్తున్నారు. గ్రీస్‌లో సముద్ర తీరంలో కీలక ఘట్టాలు తెరకెక్కించే పనిలో తలమునకలైంది చిత్రబృందం.  ‘నైవ్స్ ఔట్‌’ నుంచి రాబోయే తదుపరి రెండు చిత్రాల హక్కులను ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు 450 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకోవడం విశేషం. 

సెట్‌లోకి వెళ్లనున్న మరొకొన్ని చిత్రాలు

‘మిషన్‌ ఇంపాజిబుల్‌7’ చిత్రం కూడా  కొన్ని వారాల క్రితం షూటింగ్‌ను తిరిగి ప్రారంభించింది. టామ్ క్రూయిజ్‌ ఇందులో హీరో.  షూటింగ్‌ ప్రారంభించిన కొన్ని రోజులకే సెట్‌లో 14 మందికి పాజిటివ్‌గా తేలడంతో చిత్రీకరణ వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతుండటం, బడా సినిమాలు సెట్స్‌ పైకి రావడంతో చిత్ర బృందం పునరాలోచనలో పడింది. వీలైనంత త్వరలో మళ్లీ సెట్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ‘ఆక్వామాన్2’, ‘జాన్‌ విక్‌ 4’, ‘నైవ్స్‌ ఔట్2’ మొదలైన జులై 28నే మరో నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం ‘వైట్‌ నాయిస్’ షూటింగ్‌ ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా హాలీవుడ్‌లో షూటింగ్‌ల సందడి నెలకొంది. ఇప్పటికే కొన్ని షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉండగా, మరికొన్ని బడా చిత్రాలు చిత్రీకరణకు సిద్ధమవుతున్నాయి. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని