
తాజా వార్తలు
స్టార్స్‌తో పెళ్లండీ.. ఫేమస్సైపోయారండీ..!
వేల నుంచి లక్షల వరకు..
మెగా వారసురాలు నిహారిక వివాహం ఖరారైందా..! ఇంతకీ నాగబాబు అల్లుడు ఎవరు? ఏం చేస్తుంటాడు? ఎక్కడ చదువుకున్నాడు?.. పెళ్లి గురించి తెలియగానే అందరిలో మెదిలిన ప్రశ్నలివి. ఒకప్పుడు సామాజిక మాధ్యమాల వినియోగం అంతగా ఉండేది కాదు కాబట్టి.. వార్తల్లో వారి గురించి తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు అంతర్జాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నేరుగా వారి సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్లి, వివరాలు చూసి, అనుసరిస్తున్నారు. దీంతో అప్పటి వరకు మోస్తరుగా ఉన్న వారి ఫాలోవర్స్ సంఖ్య అతి తక్కువ కాలంలో పెరిగిపోతోంది. దీనికి రానా-మిహికా బజాజ్, కాజల్-గౌతమ్ కిచ్లు వివాహాలు కూడా ఉదాహరణలే..
2020 మే 12న కథానాయకుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేశారు. ఆయన పేరు చెప్పడం ఆలస్యం నెటిజన్లు వెతుకులాట మొదలుపెట్టారు. వధువు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు వేలల్లో ఉన్న ఆమె ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లోకి చేరింది. ఇప్పుడు ఆమెను 2 లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు.
అందాల తార కాజల్ పెళ్లి వార్త చెప్పి కుర్రాళ్ల గుండెల్ని పిండేశారు. ప్రియుడు గౌతమ్ కిచ్లు గురించి అక్టోబరు 6న ప్రకటించగానే అభిమానులు ఆయన ఎవరో.. ఏం చేస్తారో తెలుసుకున్నారు. అప్పటి వరకు గౌతమ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 12.5 వేలు మాత్రమే. కానీ ఆయనకు కాజల్‌తో ఉన్న బంధం గురించి తెలిసిన తర్వాత ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన్ను 99,833 మంది అనుసరిస్తున్నారు.. అంటే లక్షకు చేరువన్నమాట.
మరో వారంలో కొణిదెల కుటుంబంలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. జైపూర్‌లో నిహారిక వివాహ తంతు ఘనంగా జరగబోతోంది. ఆమె తొలిసారి జూన్ 19న ఇతడు ‘నావాడు..’ అంటూ చైతన్య జొన్నలగడ్డ ఫొటో పంచుకున్నారు. కాబోయే భర్తను అందరికీ ఆనందంగా పరిచయం చేశారు. అప్పుడు చైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో 35.3 వేల మంది మాత్రమే అనుసరించేవారు. కానీ ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ సంఖ్య 78.2 వేల మంది.
ఇంటర్నెట్‌డెస్క్