ఎస్పీబీ కన్నుమూత: ఫేక్‌ వార్తలపై చరణ్‌ ఆగ్రహం - sp charan fires on spreading fake news about sp balasubramanyam treatment
close
Updated : 28/09/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్పీబీ కన్నుమూత: ఫేక్‌ వార్తలపై చరణ్‌ ఆగ్రహం

చెన్నై: సుమధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి యావత్‌ సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయన కోలుకుని తిరిగి ఆరోగ్యంగా వస్తారన్న అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఎస్పీబీ అంత్యక్రియలు ముగిసి 24గంటలు కాకముందే సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని అసత్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్పీబీ వైద్యానికి సంబంధించి వస్తున్న వార్తలను ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

‘‘అందరికీ నమస్కారం. నాన్న మనల్ని విడిచి వెళ్లడం నిజంగా  దురదృష్టకరం, బాధాకరం. ఆయన ఆరోగ్యంతో తిరిగి వస్తారని మా కుటుంబమంతా ఎంతో ఆశపడింది. ఈ సమయంలో నేను మాట్లాడటం సరైనదా? కాదో తెలియదు. కానీ ఇప్పుడు మాట్లాడటం కచ్చితంగా అవసరమేననిపించింది. ఎంజీఎం ఆస్పత్రి గురించి కొన్ని అసత్యవార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా నాన్నగారి వైద్యానికి సంబంధించిన చెల్లించాల్సిన బిల్లులు, టెక్నికల్‌ స్టాఫ్‌ విషయంలో కొన్ని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా’’

‘‘ఆగస్టు 5వ తేదీ నుంచి శుక్రవారం నాన్న చనిపోయే వరకూ ఎంజీఎం ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ రోజుల్లో నాన్న వైద్యానికి అయిన ఖర్చులు కొంత చెల్లించామని, మరికొంత మిగిలి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడామని అందుకు వారు అంగీకరించకపోవడంతో ఉపరాష్ట్రపతిని కూడా కోరామంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. అంతేకాదు, మొత్తం బిల్లు చెల్లించే వరకూ నాన్నగారి భౌతికకాయాన్ని ఇచ్చేది లేదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అన్నట్లు కూడా రాసుకొచ్చారు. ఈ వార్తలన్నీ అర్థరహితం. కొందరు ఇలాంటివి ఎందుకు ప్రచారం చేస్తారో అర్థంకాదు. సరైన వ్యక్తులను సంప్రదించకుండా ఇలా ప్రచారం చేయడం ఎంత నేరమో వాళ్లకు తెలుసా? ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎంత బాధపడతారు. నిజంగా ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉండటం ఎంతో బాధాకరం. వారంతా ఎస్పీబీ అభిమానులు కాదు. ఎస్పీబీ అభిమానులు ఎప్పుడూ అలా చేయరు’’

‘‘నాన్నగారికి ఎలాంటి వైద్యం చేశారు? ఆస్పత్రి బిల్లులు ఎవరు? ఎంత చెల్లించారన్న విషయంపై ఆధారాలు లేని ఆరోపణలు చేసే ఆ వ్యక్తికి కనీస జ్ఞానం లేదు. ఆ వివరాలేవీ నేను ఇప్పుడు చెప్పలేను. దీనిపై నేను, ఎంజీఎం ఆస్పత్రి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాం. ఇలాంటి వార్తలు ప్రచారం కావడం చాలా చాలా బాధాకరం. ఒక వ్యక్తి చేసిన పనికి పది, పదిహేను మంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాన్నగారికి చెన్నై ఎంజీఎం ఆస్పత్రి ఇచ్చిన వైద్యం పట్ల మా కుటుంబమంతా ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంది. సొంత ఇంట్లో చూసుకున్నట్లు నాన్నగారిని వైద్య బృందమంతా ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ఎండీ డాక్టర్‌ ప్రశాంత్‌, ఛైర్మన్‌ రాజగోపాలన్‌లు నాన్నగారు త్వరగా కోలుకోవాలని రోజూ నాకు సందేశాలు పంపేవారు. నాన్న వైద్యానికి అయిన ఖర్చులు, ఇతర వివరాలను అన్నీ త్వరలోనే వారే వెల్లడిస్తారు. అప్పటివరకూ దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయకండి. ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నా. నాన్న వైద్యానికి కావాల్సిన పరికరాల కోసం అపోలో ఆస్పత్రిని సంప్రదించగా వారు వెంటనే వాటిని ఎంజీఎంకు పంపారు. అందరూ ఎంతో మంచి మనుషులు’’ అంటూ చరణ్‌ మాట్లాడారు.

కరోనా సోకడంతో ఆగస్టు 5న ఎస్పీబీ చెన్నైలోనే ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు. తొలినాళ్లలో కోలుకున్నట్లు కనిపించిన ఆయన ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తూ రావడంతో వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నెగెటివ్‌ వచ్చింది. క్రమంగా ఆరోగ్యం మెరుగవుతున్న సమయంలో ఈ నెల 24న మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో  25వ తేదీ మధ్యాహ్నం 1.04గంటలకు తుది శ్వాస విడిచారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని