Tollywood: ఏవి హిట్లు.. ఎన్ని ఫట్లు! - review on telugu movies released in last six months
close
Published : 29/06/2021 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ఏవి హిట్లు.. ఎన్ని ఫట్లు!

గతేడాది కరోనా దెబ్బకు సినిమా కలలు చెదిరిపోయాయి. కొత్త చిత్రాలు, షూటింగులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఈ ఏడాది ఆరంభంలో కొన్ని పెద్ద సినిమాలు విడుదలై పరిశ్రమలో జోష్‌ను పెంచే ప్రయత్నం చేశాయి. కానీ, ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా సినిమా కథ మళ్లీ మొదటికొచ్చింది. థియేటర్ల మూసివేతతో చాలా చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. కొన్నింటి విడుదల అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎత్తుపల్లాల దారిలో సాగిన ఈ ఆరునెలల టాలీవుడ్‌ ప్రయాణంపై ఓ కథనం. 

సంక్రాంతి జోరు తగ్గింది

సంక్రాంతి అంటే సినిమా వాళ్లకు పెద్ద పండుగ. అగ్ర కథానాయకుల సినిమాలన్నీ థియేటర్ల కోసం పోటీపడతాయి. అయితే ఈ సారి పరిస్థితి పూర్తిగా భిన్నం. కరోనా కారణంగా ప్రేక్షకులు సినిమాహాళ్లకు వస్తారా? లేదా అని అనుమానపడుతూనే అగ్రహీరోలు వెనకడుగు వేశారు. పెద్ద హీరోల్లో రవితేజ ‘క్రాక్‌’ ఒక్కటే రిలీజ్‌ అయ్యింది. అది సూపర్ హిట్‌గా నిలిచింది. యువ హీరోలు రామ్‌ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్‌ కూడా బరిలో దిగారు. వీటిలో  ‘రెడ్‌’ పర్వాలేదనిపించినా, ‘అల్లుడు అదుర్స్’ ఆకట్టుకోలేకపోయింది.  తమిళ హీరో విజయ్‌ ‘మాస్టర్‌’ కూడా సంక్రాంతి పండక్కే వచ్చి తెలుగు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాడు. జనవరిలోనే విడుదలైన అల్లరి నరేశ్‌ ‘బంగారు బుల్లోడు’, ప్రదీప్‌ మాచిరాజు హీరోగా చేసిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాలకు స్పందన అంతంత మాత్రమే.

పవన్‌ ఒక్కడే..

స్టార్‌ కథానాయకుల్లో ఈ ఏడాది పలకరించింది పవన్‌ ఒక్కడే. మహేశ్‌ బాబు, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు చేస్తున్న భారీ చిత్రాల నిర్మాణం పూర్తికాలేదు. దీంతో మిగతా అగ్ర హీరోల బాక్సాఫీస్‌ మెరుపులు లేకుండానే ఈ ఆరునెలలు గడిచిపోయాయి. పవన్‌ కల్యాణ్‌ లాయర్‌గా నటించిన ‘వకీల్‌ సాబ్‌’కు వసూళ్లు భారీగా వచ్చాయి. దాదాపు రూ.130 కోట్ల వరకూ గ్రాస్‌ను సాధించి, పవర్‌స్టార్‌ అభిమానులను కనువిందు చేసిందీ చిత్రం.

 వసూళ్ల ఉప్పెన

ప్రశాంత్‌ వర్మ ‘జాంబి రెడ్డి’తో కొత్త తరహా వినోదాన్ని టాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించారు. ఫిబ్రవరి ఆరంభంలో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. అదే నెలలో ‘ఉప్పెన’ రిలీజ్‌ అయింది. సముద్ర తీర ప్రేమకథ, సినిమా పాటలు, విజయ్‌సేతుపతి విలనిజం జనాలకు విపరీతంగా నచ్చేశాయి. ఏకంగా రూ.80 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అల్లరి నరేశ్‌ కామెడీ ట్రాక్‌ను వదిలి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది.  ‘నాంది’లో ఖైదీగా నరేశ్‌ నటించిన తీరు మెప్పించింది. అయితే ఆశించిన మేర వసూళ్లు సాధించలేకపోయింది. శర్వానంద్‌ ‘శ్రీకారం’ సినిమాకు ప్రశంసలు దక్కాయి కానీ వసూళ్లే నిరూత్సాహపరిచాయి. ‘రంగ్‌దే’ వసూళ్లు కూడా సినిమా బడ్జెట్‌ను చేరుకోలేకపోయాయి. మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రం రూ. 50 కోట్లతో తెరకెక్కితే ఆశించిన మేర రాణించలేదు. రాణా ‘అరణ్య’ ప్రయోగమూ బెడిసికొట్టింది. 

చిన్న సినిమాల సందడి

కరోనా కారణంగా ఈ సారి పెద్ద సినిమాల సందడి తగ్గినా.. చిన్న సినిమాలు ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశాయి. అందులో ముందుగా  ‘జాతి రత్నాలు’ సినిమాను చెప్పుకోవాలి.  పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రంగా నవ్వుల సునామీలో ముంచెత్తింది. వసూళ్లతో బాక్సాఫీస్‌కు మునుపటి కళను తీసుకొచ్చింది. కేవలం రూ. నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 65 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం విశేషం. ‘ప్లే బ్యాక్‌’ సినిమాకి ఆశించిన కలెక్షన్లు రాకున్నా, ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు దక్కాయి. ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్‌తో ఆసక్తిని రేపినప్పటికీ థియేటర్‌లో నిలబడలేకపోయింది. అనిల్‌ రావిపూడి నిర్మాతగా మారి తీసిన ‘గాలి సంపత్‌’కు ఆదరణ కరవైంది. ఇక చంద్రశేఖర్‌ యేలేటి, నితిన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘చెక్‌’ కూడా నిరుత్సాహానికి గురిచేసింది. సుమంత్‌ హిట్‌ కోసం కన్నడ సినిమా ‘కపటధారి’ని  నమ్ముకున్నా లాభం లేకపోయింది. 

ఓటీటీల్లో కొత్తదనం

కమర్షియల్‌ సినిమాల్లో కొత్తదనం తక్కువ. అందుకే ఓటీటీల్లో విడుదలయ్యే చిన్న సినిమాల్లో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు దర్శక-నిర్మాతలు.  ఈ ఏడాది అలా కొత్తదనంతో కొన్ని ఆకట్టుకున్నాయి. గమ్మత్తైన యాసతో  ‘సినిమా బండి’ చేసిన అల్లరికి అందరూ ఫిదా అయ్యారు. పల్లెటూరి అమాయకత్వం, సినిమా తీయాలన్న తపన కలిసి ఏర్పడ్డ వినోదం రక్తికట్టించింది. ‘ఏక్‌ మినీ ప్రేమకథ’తో తీసి సాహసమే చేశారు. ఇలాంటి కథాంశాలను ఎంచుకొని హాస్యాన్ని పండించొచ్చని నిరూపించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మెయిల్‌’ కూడా విశేషంగా అలరించింది. అలా అని ఓటీటీల్లో విడుదలైనవి అన్నీ మెప్పించాయని కాదు. ‘అర్ధ శతాబ్దం’ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

వేసవి వినోదం కరవు

 వేసవిలో సినిమాల వేడి  ఎక్కువే ఉంటుంది. కానీ 2020తో పాటు ఈ ఏడాది వేసవి కూడా వైరస్‌కు సమర్పించుకోవాల్సి వచ్చింది. థియేటర్లు తెరుచుకుని మంచి వసూళ్లు సాధిస్తున్న తరుణంలో ఉన్నపళంగా వైరస్‌ విజృంభించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో వేసవికి రావాల్సిన లవ్‌స్టోరీ, విరాట పర్వం, టక్‌ జగదీష్‌, సీటీమార్‌లతో పాటు మరికొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు వాయిదా పడ్డాయి. పరిస్థితి ఇలాగే ఉంటే బడా హీరోల చిత్రాలూ వేసవి చివరికల్లా థియేటర్లలోకి వచ్చేవి. కానీ సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌లు ఆగిపోయి మరింత ఆలస్యంగా పలకరించేలా ఉన్నాయి.  

అనువాదాలు.. అంతంత మాత్రమే

తెలుగులో విడుదలైన అనువాదాల్లో ‘మాస్టర్‌’ ఒక్కటే విజయవంతమైంది. ఓటీటీల్లో చాలా సినిమాలే రిలీజ్‌ అయినా.. అనుకున్నంత స్పందన కరవైంది. భారీ అంచనాలతో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ధనుష్‌ చిత్రం ‘జగమే తంత్రం’ ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టింది. ‘రాబర్ట్’‌, ‘పొగరు’, ‘యువరత్న’ సినిమాలకు ప్రేక్షకుల స్పందన తక్కువే. ఇక ‘ఆహా’ ఓటీటీలో ఈసారి మలయాళ చిత్రాల తాకిడి పెరిగింది. అక్కడ హిట్టైన సినిమాలన్నీ అనువాదాలుగా ఇందులో రిలీజ్‌ చేశారు. అందులో ‘మిడ్‌నైట్‌ మర్డర్స్’‌, ‘ట్రాన్స్‌’, ‘అనుకోని అతిథి’ కొంత మేర ఆకట్టుకున్నాయి. మిగతావన్నీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. 
అలా 2021 మొదటి ఆరునెలలు అగ్రహీరోల సినిమాల సందడి లేకుండానే ముగిసింది. అడపాదడపా సినిమాలు అలరించినప్పటికీ.. మునపటి జోష్‌ కనిపించలేదు. రెండో అర్ధభాగంలోనైనా థియేటర్లు తెరుచుకుని అగ్రహీరోల సినిమాలతో పండగ తెస్తాయని ఆశిద్దాం.  


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని